జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను సత్కరిస్తున్న రోటరీ క్లబ్ ప్రతినిధులు. చిత్రంలో న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం సామాన్యుడు సైతం రాజ్యాంగం గురించి చర్చించే పరిస్థితి వచ్చిందని, ఇది ఎంతో శుభ పరిణామమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగం కేవలం గ్రంథాలయాలకు, బహిరంగ సభల్లో ప్రసంగాలకు పరిమితం కాకూడదని, దానిపై చర్చోప చర్చలు జరిగినప్పుడే ప్రజలకు తమ హక్కుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుందని తెలిపారు.
శనివారం విజయవాడ సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు జస్టిస్ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. జీవిత సాఫల్య పురస్కారం ద్వారా తాను సాధించాల్సింది, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఓ తెలుగువాడిగా శాయశక్తులా తన పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పారు. తెలుగువాడి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా తెలుగువాడి కీర్తిని ఎగురవేస్తానని, ఇది తాను ఇస్తున్న హామీ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
కోర్టులో జరిగేది కక్షిదారుడికి అర్థం కావాలి
► రాజ్యాంగంపై ప్రజల్లో చర్చ మొదలైన నేపథ్యంలో వారికి వారి హక్కుల గురించి తెలియచేసి చైతన్య పరచాలి. ఇందులో రోటరీ క్లబ్ భాగస్వామ్యం కావాలి.
► దేశం ఎంత అభివృద్ధి సాధించినా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, మౌలిక సదుపాయాల లేమి, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం. ఈ దిశగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.
► న్యాయ పాలన అన్నది చాలా ముఖ్యం. అది లేకపోతే అరాచకం పెరిగిపోతుంది. ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. న్యాయ పాలన అమలు కోసం న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలి. న్యాయ పాలన గురించి ప్రజలకు తెలిసేలా మేధావి వర్గం పనిచేయాలి.
► కోర్టులు, పోలీసుల దగ్గరకు వెళ్లకూడదన్న నిశ్చిత అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. అయితే హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు కచ్చితంగా న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అలాంటి పరిస్థితిలో న్యాయ స్థానాలు తప్పక జోక్యం చేసుకుంటాయి. ఇందులో మరో మాటకు తావు లేదు.
► కోర్టులో జరిగేది ప్రతిదీ కక్షిదారునికి అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టుల్లో మౌలిక వసతులు పెరగాలి. కోర్టు భవనాల నిర్మాణాలు జరగాలి. ఇందు కోసమే జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జ్యుడిషియల్ ఇన్‌ఫ్రా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
సంస్కరణలు అవసరమే
► న్యాయ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయ వ్యవస్థ గురించి అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలుసుకునేలా సరళీకరణ, భారతీయీకరణ జరగాలి.
► ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఏం వాదనలు జరుగుతున్నాయి.. కోర్టు ఏమంటోంది.. ఏం తీర్పు చెప్పింది.. అన్న విషయాలు అతనికి స్వయంగా అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థ సరళీకరణ అయినట్లుగా భావించాలి. న్యాయ వ్యవస్థ అర్థం కాని బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు.
► న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు అర్థం కానప్పుడు ప్రజలు న్యాయ స్థానాలకు బదులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు. ఇలా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం బెజవాడ ప్రజలకు అలవాటు. ఆ దిశగా వెళ్లొద్దని కోరుతున్నా.
పెండింగ్‌లో 4.60 కోట్ల కేసులు
► ప్రస్తుతం దేశంలో 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ కేసుల సంఖ్య పెద్దది కాదు. వాయిదాలు వేయకుండా సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. ఈ దిశగా ప్రభుత్వానికి సైతం పాత్ర ఉంది.
► ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి పనిచేస్తే కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందదు. అన్ని వ్యవస్థలు తమ పరిధులకు లోబడి పని చేయాలి. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి.
► న్యాయ వ్యవస్థలో మార్పు దిశగా చర్యలు చేపట్టాం. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అవసరమైన చోట గట్టిగా మాట్లాడుతున్నా.
తెలుగు శిథిలం కాకుండా చూడాలి
► తెలుగు భాష శిథిలం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మాతృభాషలో విద్య చాలా అవసరం. మాతృభాషలో ఆలోచనలు చేసినప్పుడే పనుల్లో విజయం సాధ్యమవుతుంది.
► మన విజయానికి మాతృభాషే పునాది. ఆ పునాదిని కూల్చేసే పరిస్థితి రాకూడదు. తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
► అనంతరం నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మలను సన్మానించారు. జీవిత సాఫల్యం పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని సీజేఐ జస్టిస్ రమణ.. అనాథ బాలల ఆశ్రమాలకు వితరణ కింద అందజేశారు.
► ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పట్టాభి రామయ్య, సుబ్బరామయ్య నాయుడు, ఎం.రామారావు, డాక్టర్ మోహన్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నివాసంలో ఏర్పాటు చేసిన విందులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు.
విజయవాడ చైతన్యం చూపాలి
► విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు జాతీయ స్థాయిలో కీర్తి గడించారు. విజయవాడతో నాకు ఎన్నో గొప్ప స్మృతులు ఉన్నాయి. న్యాయ విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌కు వెళ్లాను. అతికష్టం మీద విజయవాడను వీడాల్సి వచ్చింది.
► అయినప్పటికీ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి శని, ఆదివారాలు ఇక్కడే గడిపే వాడిని. కళలు, సంస్కృతి, రచనలకు బెజవాడ ఎంతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు నేను ఊహించిన విధంగా బెజవాడ లేదు. ఇందుకు నేను విచారిస్తున్నా. మరోసారి జూలు విదిల్చి చైతన్యం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నా ఉన్నతికి కారణమైన ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ మరువను.
Comments
Please login to add a commentAdd a comment