జస్టిస్ లావు నాగేశ్వరరావు మాతృమూర్తి నాగేశ్వరమ్మకు పాదాభివందనం చేస్తున్న సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి/పెనమలూరు:సవాళ్లను ఎదుర్కొంటూనే రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ లా కళాశాలలో ఆదివారం దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో ‘భారత న్యాయవ్యవస్థ–భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చూసిందన్నారు. ఈ క్రమంలోనే పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా న్యాయ వ్యవస్థకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. సమాజంలో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటారనే అపోహ ఉందన్నారు. న్యాయ వ్యవస్థతో కలిసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు న్యాయమూర్తిని ఎంపిక చేస్తాయనే విషయాన్ని తెలిసిన వారు కూడా అసత్య ప్రచారంలో ఉండటం విచారకరమన్నారు. సీజేఐ ఏమన్నారంటే..
సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి..
ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. హ్యాకింగ్, మనీలాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారు. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాలి. న్యాయ వ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలి. న్యాయాధికారులు కూడా సాంకేతిక విజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత లభించడంలేదు. గృహ, వైద్య సదుపాయాలు కూడా దక్కడంలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండగా వీటిల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ కేసులే. అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.
అంతకుముందు.. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు సతీమణి నాగేంద్రమ్మకు పాదాభివందనం చేశారు. విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని విశ్వసించి ఆయన స్వగ్రామం పెదనందిపాడులో గ్రంథాలయ స్థాపనతో పాటు వాలీబాల్ క్రీడను వెంకటేశ్వర్లు ప్రోత్సహించారని జస్టిస్ రమణ చెప్పారు. ఆయన ఆదర్శాలే తనయుడు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని కొనియాడారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ వీఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
ఇది దురదృష్టం..
న్యాయాధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి. తీర్పులు అనుకూలంగా రాకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జిలపై బురదజల్లుతున్నారు. కోర్టులు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీచేస్తే తప్ప అధికారులు ఈ విషయంలో స్పందించకపోవడం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. వారు కోర్టులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. వారి ఎంపిక కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. న్యాయ వ్యవస్థలోని ఖాళీలను భర్తీచేయడంలో కేంద్రం సత్వర చర్యలు చేపడుతోంది.
మీడియా ట్రయల్స్ (వ్యాఖ్యలు, కథనాలు) కేసుల నిర్ణయానికి మార్గదర్శకం కావు. చట్టసభలు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. మెజార్టీ ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు చేయడం కుదరదు. తప్పనిసరిగా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందే. న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు గౌరవించకపోవడం వ్యవస్థల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. న్యాయ సమీక్ష పరిధిని పరిమితం చేయాలనుకోవడం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
Comments
Please login to add a commentAdd a comment