హఫీజ్‌పేట్: వ్యాపారంలో లాభాపేక్ష మాత్రమే ప్రాధాన్యం కాకూడదని.. సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో ‘లీడర్‌షిప్ సమ్మిట్–2022’ను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపార విద్య చదివే విద్యార్థులకు సైతం రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రాయోజిత వ్యాజ్యాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే న్యాయవ్యవస్థలో సగం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాల స్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఒక సవాల్‌గానే ఉంటాయన్నారు.
వాటిని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఎప్పుడూ తాడుపై నడిచినట్లేనని ఆయన పేర్కొన్నారు.
16 నెలల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం..
చీఫ్ జస్టి‹స్‌గా 16 నెలలు కొనసాగిన సమయంలో సుప్రీంకోర్టు కోర్టుకు 11 మంది న్యాయమూర్తులను, పలు హైకోర్టులకు 233 మందిని న్యాయమూర్తులను నియమించడం జరిగిందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగామని చెప్పారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రారంభించామని వివరించారు. ఇదిలా ఉంటే.. ఐఎస్‌బీ 20 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పురోభివృద్ధి సాధించిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
ఐఎస్‌బీ ఏర్పాటు సమయంలో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై కోర్టులో కేసు వేయగా.. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా ఉంటూ కేసులో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ఎప్పటికీ మరువలేమని చెప్పారు. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడు లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ భూ వ్యాజ్యానికి సంబంధించి అప్పటి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు కాపీని డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందజేశారు.
అంతకుముందు లీడర్‌షిప్ సమ్మిట్ ప్రాధాన్యతను మదన్ పిల్లుట్ల వివరించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌కుమార్, డాక్టర్ జయంతి కుమరేశ్, లైట్‌స్పీడ్ పార్ట్‌నర్ అభిషేక్‌నాగ్, ది బెటర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అనురాధ కేడియా, మైగేట్ సీఈఓ విజయ్ అరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఈడీ కేదార్‌లేలేతోపాటు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌బీ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, రాష్ట్ర హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment