Justice lavu Nageswara Rao
-
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్‌సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు సుప్రీం ఆదేశించింది. -
సామాజిక న్యాయం దిశలో మైలు రాళ్లు!
న్యాయవ్యవస్థలో ఆణిముత్యం జస్టిస్ లావు నాగేశ్వరరావు. ‘‘ఈ దేశంలో రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రం రాలేదు. కులం, మతం పేరుతో విభజన ఉంటే స్వాతంత్య్రం రానట్లే...’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జూన్ 7న పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు. సామాజిక న్యాయం దిశగా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. మూడు దశాబ్దాల పాటు న్యాయవాదిగా సేవలందిం చిన ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పని చేయకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని అందుకున్న అతికొద్ది మందిలో ఒకరు. ఇది ఆయన ప్రతిభా విశేషాలకు తార్కాణం. ఇలా సుప్రీం న్యాయమూర్తిగా మారే గౌరవం అందుకున్న తొలి తొలుగువాడు కూడా ఆయనే. గుంటూరు జిల్లా, పెద నందిపాడు ఆయన స్వగ్రామం. ఒక సామాన్య రైతు కుటుం బంలో జన్మించారు. గుంటూరు ‘ఏసీ కాలేజీ ఆఫ్ లా’లో న్యాయవాద పట్టా అందుకున్నారు. పలు హిందీ సినిమాల్లో నటించారు. క్రికెట్, గోల్ఫ్ క్రీడల్లో ప్రావీణ్యముంది. 1982లో గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిం చారు. తర్వాత తన ప్రాక్టీస్‌ను ఏపీ హైకోర్టుకు మార్చారు. అనంతరం సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టారు. అన్ని దశల్లోనూ ఆయన తన ప్రతిభను నిరూపించు కున్నారు. 2000వ సంవత్సరంలో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత తరఫున వాదించి ఆమెపై కోర్టు అన్ని ఆరోపణలను కొట్టేసేలా చేశారు. బీసీసీఐలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను విచారించేందుకు సుప్రీం నియమించిన ‘ముద్గల్ కమిటీ’లో ఆయన సభ్యులు. రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే విషయంలో ఎన్నికల కమిషన్ అధికార పరిధికి సంబంధిం చిన కేసును వాదించారు. ఆయన ప్రతిభను గుర్తించి యూపీఏ ప్రభుత్వం 2003–2004లోనూ, ఎన్డీఏ ప్రభుత్వం 2013–14లోనూ ‘అదనపు సొలిసిటర్ జనరల్’గా నియమించుకొని ఆయన సేవలు పొందాయి. 34 ఏళ్లపాటు లా ప్రాక్టీసు చేసిన ఆయన దేశంలో అత్య ధికంగా ఆర్జించే న్యాయవాదిగా పేరు పొందారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా వచ్చిన అభ్యర్థనను ఆయన ఒకసారి నిరాకరించారు. రెండో సారి ఆ ప్రతిపాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చేస్తే కాదనలేకపోయారు. గత ఆరేళ్లలో ఆయన ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ న్యాయపరిధికి సంబంధించి అనేక కీలకమైన తీర్పులను వెలువరించారు. ‘బలవంతపు వాక్సినేషన్’ ప్రైవసీ హక్కుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షపడ్డ ఏజీ పేరరివాళన్‌ను విడుదల చేయమని ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చారు. న్యాయమూర్తిగా ఆయన 552 బెంచ్‌లలో విచారణలో పాల్గొని 163 కీలక తీర్పులు వెలువరించారు. మద్రాస్ బార్ అసోసి యషన్ కేసులో తీర్పునివ్వడం ద్వారా దేశంలో ‘ట్రిబ్యునల్’ వ్యవస్థను పునర్నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కు తుంది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన రాజద్రోహం కాదని ఆయన ‘సోలీ సోరాబ్జీ స్మారకో పన్యాసం’లో స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి ఐపీసీలో సంబంధిత సెక్షన్లను సవరించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ జోక్యం సరైంది కాదని పేర్కొన్నారు. (క్లిక్: వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?) జస్టిస్ నాగేశ్వరరావు తన గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు చాలా ప్రేమ. కన్నతల్లి వంటి మాతృభాషను బతికించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని విశాఖపట్టణంలో ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ 14వ వార్షిక పురస్కార సభలో అన్నారు. ఎన్నో ఉన్నత భావాలు కలిగిన జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయవ్యవస్థకు తీరని లోటు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ‘అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రా’నికి ఆధిపత్యం వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన ఆధ్వర్యంలో ఈ కేంద్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూన్ 7న జస్టిస్ లావు నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా...) -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర
సాక్షి, అమరావతి/పెనమలూరు:సవాళ్లను ఎదుర్కొంటూనే రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ లా కళాశాలలో ఆదివారం దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో ‘భారత న్యాయవ్యవస్థ–భవిష్యత్తు సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. స్వాతంత్య్రం అనంతరం దేశం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చూసిందన్నారు. ఈ క్రమంలోనే పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా న్యాయ వ్యవస్థకు ప్రధాన సమస్యగా మారిందన్నారు. సమాజంలో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటారనే అపోహ ఉందన్నారు. న్యాయ వ్యవస్థతో కలిసి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు న్యాయమూర్తిని ఎంపిక చేస్తాయనే విషయాన్ని తెలిసిన వారు కూడా అసత్య ప్రచారంలో ఉండటం విచారకరమన్నారు. సీజేఐ ఏమన్నారంటే.. సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి.. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. హ్యాకింగ్, మనీలాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారు. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాలి. న్యాయ వ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలి. న్యాయాధికారులు కూడా సాంకేతిక విజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత లభించడంలేదు. గృహ, వైద్య సదుపాయాలు కూడా దక్కడంలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండగా వీటిల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ కేసులే. అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతకుముందు.. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు చిత్రపటానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు సతీమణి నాగేంద్రమ్మకు పాదాభివందనం చేశారు. విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని విశ్వసించి ఆయన స్వగ్రామం పెదనందిపాడులో గ్రంథాలయ స్థాపనతో పాటు వాలీబాల్ క్రీడను వెంకటేశ్వర్లు ప్రోత్సహించారని జస్టిస్ రమణ చెప్పారు. ఆయన ఆదర్శాలే తనయుడు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని కొనియాడారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ వీఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. ఇది దురదృష్టం.. న్యాయాధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయి. తీర్పులు అనుకూలంగా రాకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా జడ్జిలపై బురదజల్లుతున్నారు. కోర్టులు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీచేస్తే తప్ప అధికారులు ఈ విషయంలో స్పందించకపోవడం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి. వారు కోర్టులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. వారి ఎంపిక కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. న్యాయ వ్యవస్థలోని ఖాళీలను భర్తీచేయడంలో కేంద్రం సత్వర చర్యలు చేపడుతోంది. మీడియా ట్రయల్స్ (వ్యాఖ్యలు, కథనాలు) కేసుల నిర్ణయానికి మార్గదర్శకం కావు. చట్టసభలు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. మెజార్టీ ఉన్నంత మాత్రాన ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు చేయడం కుదరదు. తప్పనిసరిగా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందే. న్యాయస్థానాల ఆదేశాలను ప్రభుత్వాలు గౌరవించకపోవడం వ్యవస్థల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. న్యాయ సమీక్ష పరిధిని పరిమితం చేయాలనుకోవడం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదవండి: ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ -
శిక్షలపై నిర్దిష్ట విధివిధానాల్లేవు
సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో లాగే శిక్షల విషయంలో మన దేశంలో నిర్దిష్టమైన విధివిధానాల్లేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. దీంతో ఒకే రకమైన నేరం చేసిన వ్యక్తులకు వేర్వేరు శిక్షలు పడుతున్నాయని పేర్కొన్నారు. శిక్షల విషయంలో నిర్దిష్టత, ఏకరూపత ఉంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. ‘న్యాయ విచక్షణ’అంశంపై తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగించారు. ఈ రోజుల్లో నేరస్తులను శిక్షించడం న్యాయమూర్తులకు చాలా సులభమైన పని అని, అయితే ఎంతమేర శిక్ష విధించాలో నిర్ణయించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాలు, న్యాయ సంప్రదాయాలు, తీర్పులకు లోబడే న్యాయమూర్తుల విచక్షణ ఉంటుందన్నారు. ఏ న్యాయమూర్తికీ కూడా అపరిమితమైన విచక్షణాధికారం ఉండదని చెప్పారు. న్యాయమూర్తుల విచక్షణాధికారాల గురించి న్యాయవాదులు తమ తమ కక్షిదారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
గోప్యత హక్కుకు కొత్త భాష్యం చెప్పాల్సి వస్తోంది
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో గోప్యత హక్కుకు (రైట్ టూ ప్రైవసీ) సరికొత్త భాష్యం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. సాంకేతికాభివృద్ధి పెరుగుతున్న తరుణంలో గోప్యత హక్కుపై విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఇతరులు అందులో జోక్యం చేసుకోవడం ముమ్మాటికీ గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనన్నారు. రాజ్యాంగంలో దీని గురించి ప్రస్తావన లేకపోయినా... తరువాత పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల నేపథ్యంలో అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమైందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన అమెరికా, భారత్ అత్యున్నత న్యాయస్థానాలు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తుతించారు. శుక్రవారం హైకోర్టులో ‘గోప్యత హక్కు’పై సీనియర్ న్యాయవాది వై.సూర్యనారాయణ స్మారకోపన్యాసాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగించారు. ఆధార్ నమోదు సందర్భంగా ప్రజల నుంచి తీసుకునే సమాచారం గోప్యత హక్కుకు భంగకరమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపబోతోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ భవితవ్యం ఏమిటో దేవుడికే తెలియాలన్నారు. సూర్యనారాయణ తన గురువని చెప్పుకోవడం ఎంతో గర్వం గా ఉందని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనేనని చెప్పారు. నియంత్రణ వ్యవస్థలు ఉండాలి... అంతకు ముందు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ... సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గోప్యత హక్కుకు భంగం కలగకుండా తగిన నియంత్రణ వ్యవస్థ అవసరమన్నారు. ఎంతో మంది యువ న్యాయవాదులు సూర్యనారాయణ వాదనలను చూసి ప్రభావితమయ్యారని, అందులో తానూ ఒకడినని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగేశ్వరరావును ఉభయ న్యాయవాద సంఘాల అధ్యక్షులు గండ్ర మోహనరావు, చిత్తరవు నాగేశ్వరరావు సన్మానించారు.