
సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో లాగే శిక్షల విషయంలో మన దేశంలో నిర్దిష్టమైన విధివిధానాల్లేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. దీంతో ఒకే రకమైన నేరం చేసిన వ్యక్తులకు వేర్వేరు శిక్షలు పడుతున్నాయని పేర్కొన్నారు. శిక్షల విషయంలో నిర్దిష్టత, ఏకరూపత ఉంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. ‘న్యాయ విచక్షణ’అంశంపై తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగించారు.
ఈ రోజుల్లో నేరస్తులను శిక్షించడం న్యాయమూర్తులకు చాలా సులభమైన పని అని, అయితే ఎంతమేర శిక్ష విధించాలో నిర్ణయించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాలు, న్యాయ సంప్రదాయాలు, తీర్పులకు లోబడే న్యాయమూర్తుల విచక్షణ ఉంటుందన్నారు. ఏ న్యాయమూర్తికీ కూడా అపరిమితమైన విచక్షణాధికారం ఉండదని చెప్పారు. న్యాయమూర్తుల విచక్షణాధికారాల గురించి న్యాయవాదులు తమ తమ కక్షిదారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment