జస్టిస్ లావు నాగేశ్వరరావు
న్యాయవ్యవస్థలో ఆణిముత్యం జస్టిస్ లావు నాగేశ్వరరావు. ‘‘ఈ దేశంలో రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రం రాలేదు. కులం, మతం పేరుతో విభజన ఉంటే స్వాతంత్య్రం రానట్లే...’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జూన్ 7న పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు. సామాజిక న్యాయం దిశగా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. మూడు దశాబ్దాల పాటు న్యాయవాదిగా సేవలందిం చిన ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పని చేయకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని అందుకున్న అతికొద్ది మందిలో ఒకరు. ఇది ఆయన ప్రతిభా విశేషాలకు తార్కాణం. ఇలా సుప్రీం న్యాయమూర్తిగా మారే గౌరవం అందుకున్న తొలి తొలుగువాడు కూడా ఆయనే. గుంటూరు జిల్లా, పెద నందిపాడు ఆయన స్వగ్రామం. ఒక సామాన్య రైతు కుటుం బంలో జన్మించారు. గుంటూరు ‘ఏసీ కాలేజీ ఆఫ్ లా’లో న్యాయవాద పట్టా అందుకున్నారు. పలు హిందీ సినిమాల్లో నటించారు. క్రికెట్, గోల్ఫ్ క్రీడల్లో ప్రావీణ్యముంది.
1982లో గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిం చారు. తర్వాత తన ప్రాక్టీస్‌ను ఏపీ హైకోర్టుకు మార్చారు. అనంతరం సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టారు. అన్ని దశల్లోనూ ఆయన తన ప్రతిభను నిరూపించు కున్నారు. 2000వ సంవత్సరంలో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత తరఫున వాదించి ఆమెపై కోర్టు అన్ని ఆరోపణలను కొట్టేసేలా చేశారు. బీసీసీఐలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను విచారించేందుకు సుప్రీం నియమించిన ‘ముద్గల్ కమిటీ’లో ఆయన సభ్యులు. రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే విషయంలో ఎన్నికల కమిషన్ అధికార పరిధికి సంబంధిం చిన కేసును వాదించారు. ఆయన ప్రతిభను గుర్తించి యూపీఏ ప్రభుత్వం 2003–2004లోనూ, ఎన్డీఏ ప్రభుత్వం 2013–14లోనూ ‘అదనపు సొలిసిటర్ జనరల్’గా నియమించుకొని ఆయన సేవలు పొందాయి.
34 ఏళ్లపాటు లా ప్రాక్టీసు చేసిన ఆయన దేశంలో అత్య ధికంగా ఆర్జించే న్యాయవాదిగా పేరు పొందారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా వచ్చిన అభ్యర్థనను ఆయన ఒకసారి నిరాకరించారు. రెండో సారి ఆ ప్రతిపాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చేస్తే కాదనలేకపోయారు. గత ఆరేళ్లలో ఆయన ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ న్యాయపరిధికి సంబంధించి అనేక కీలకమైన తీర్పులను వెలువరించారు. ‘బలవంతపు వాక్సినేషన్’ ప్రైవసీ హక్కుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షపడ్డ ఏజీ పేరరివాళన్‌ను విడుదల చేయమని ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చారు. న్యాయమూర్తిగా ఆయన 552 బెంచ్‌లలో విచారణలో పాల్గొని 163 కీలక తీర్పులు వెలువరించారు. మద్రాస్ బార్ అసోసి యషన్ కేసులో తీర్పునివ్వడం ద్వారా దేశంలో ‘ట్రిబ్యునల్’ వ్యవస్థను పునర్నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కు తుంది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన రాజద్రోహం కాదని ఆయన ‘సోలీ సోరాబ్జీ స్మారకో పన్యాసం’లో స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి ఐపీసీలో సంబంధిత సెక్షన్లను సవరించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ జోక్యం సరైంది కాదని పేర్కొన్నారు. (క్లిక్: వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?)
జస్టిస్ నాగేశ్వరరావు తన గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు చాలా ప్రేమ. కన్నతల్లి వంటి మాతృభాషను బతికించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని విశాఖపట్టణంలో ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ 14వ వార్షిక పురస్కార సభలో అన్నారు. ఎన్నో ఉన్నత భావాలు కలిగిన జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయవ్యవస్థకు తీరని లోటు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ‘అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రా’నికి ఆధిపత్యం వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన ఆధ్వర్యంలో ఈ కేంద్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!)
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు
(జూన్ 7న జస్టిస్ లావు నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా...)
Comments
Please login to add a commentAdd a comment