![Supreme Court To Oversee Hyderabad Cricket Association Polls - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/14/Untitled-6_1.jpg.webp?itok=LWNDIaJo)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది.
త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్‌సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు సుప్రీం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment