గోప్యత హక్కుకు కొత్త భాష్యం చెప్పాల్సి వస్తోంది
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో గోప్యత హక్కుకు (రైట్ టూ ప్రైవసీ) సరికొత్త భాష్యం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. సాంకేతికాభివృద్ధి పెరుగుతున్న తరుణంలో గోప్యత హక్కుపై విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఇతరులు అందులో జోక్యం చేసుకోవడం ముమ్మాటికీ గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనన్నారు. రాజ్యాంగంలో దీని గురించి ప్రస్తావన లేకపోయినా... తరువాత పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల నేపథ్యంలో అది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమైందన్నారు.
ఇందుకు సంబంధించి ఆయన అమెరికా, భారత్ అత్యున్నత న్యాయస్థానాలు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తుతించారు. శుక్రవారం హైకోర్టులో ‘గోప్యత హక్కు’పై సీనియర్ న్యాయవాది వై.సూర్యనారాయణ స్మారకోపన్యాసాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగించారు. ఆధార్ నమోదు సందర్భంగా ప్రజల నుంచి తీసుకునే సమాచారం గోప్యత హక్కుకు భంగకరమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపబోతోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ భవితవ్యం ఏమిటో దేవుడికే తెలియాలన్నారు. సూర్యనారాయణ తన గురువని చెప్పుకోవడం ఎంతో గర్వం గా ఉందని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనేనని చెప్పారు.
నియంత్రణ వ్యవస్థలు ఉండాలి...
అంతకు ముందు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ... సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గోప్యత హక్కుకు భంగం కలగకుండా తగిన నియంత్రణ వ్యవస్థ అవసరమన్నారు. ఎంతో మంది యువ న్యాయవాదులు సూర్యనారాయణ వాదనలను చూసి ప్రభావితమయ్యారని, అందులో తానూ ఒకడినని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగేశ్వరరావును ఉభయ న్యాయవాద సంఘాల అధ్యక్షులు గండ్ర మోహనరావు, చిత్తరవు నాగేశ్వరరావు సన్మానించారు.