
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. హిజాబ్ వ్యవహారాన్ని పెద్దది చేయకండి’’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్‌తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణకు సుప్రీం నో చెప్పింది.
ఇదే పిటిషన్‌పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్ జస్టిస్ రమణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment