సదస్సు ప్రారంభోత్సవంలో జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఖన్వీల్కర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. సమష్టి కృషితో వివిధ కోర్టుల్లో ఏడాదిలో 126 జడ్జీ పోస్టులను భర్తీ చేయగలిగామని అన్నారు. త్వరలో మరో 50 నియామకాలను పూర్తి చేస్తామని తెలిపారు.
ఆరేళ్ల విరామం తర్వాత శుక్రవారం ఢిల్లీలో జరిగిన 39వ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడారు. న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను గుర్తించి, చర్చించడం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హైకోర్టుల్లో ఇంకా ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీ కోసం వీలైనంత త్వరగా పేర్లను పంపించాలని, అందులో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు.
హైకోర్టుల నుంచి ప్రభుత్వానికి 100 ప్రతిపాదనలు
గత ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు 9 మంది నూతన న్యాయమూర్తులు, హైకోర్టులకు 10 మంది నూతన ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హైకోర్టుల స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. గతేడాది తాను సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైకోర్టుల్లో నియామకాల కోసం కొలీజియం ఇప్పటివరకు 180 సిఫార్సులు చేసిందని, ఇందులో 126 నియామకాలు జరిగాయని వెల్లడించారు.
మరో 54 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఉన్నాయని చెప్పారు. వివిధ హైకోర్టుల నుండి ప్రభుత్వానికి దాదాపు 100 ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే అవి ఇంకా సుప్రీం కోర్టుకు చేరలేదన్నారు. మిగిలిన 212 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలను పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులకు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రదర్శించిన పట్టుదల, ధృఢ సంకల్పంతో న్యాయస్థానాల పనితీరు దెబ్బతినకుండా చూసుకోగలిగామని హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కోర్టుల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడకుండా స్థిరమైన ఆన్‌లైన్ వ్యవస్థలను అభివృద్ధి చేశామన్నారు.
సుప్రీంకోర్టులో వినూత్నమైన ఫాస్టర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని జస్టిస్ ఎన్‌వీ రమణ వివరించారు. 2016లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆమోదించిన తీర్మానాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఐటీ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, దేశంలోని అన్ని కోర్టు సముదాయాల కనెక్టివిటీ, మానవ వనరులు, జిల్లా కోర్టులు, మౌలిక సదుపాయాలు, కోర్టుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.
నేడు సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సదస్సు
న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ హాజరవుతారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఈ సదస్సులో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానంగా చర్చిస్తారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ జస్టిస్ ఎన్‌వీ రమణ చేసిన ప్రతిపాదనను సదస్సు ఎజెండాలో చేర్చారు. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నారు. ప్రారంభోత్సవంలో జస్టిస్ ఎన్‌వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment