సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డికి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలను కొనియాడింది. పద్మనాభరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని విచారం వ్యక్తంచేసింది. గుండెపోటుతో ఈనెల 4న కన్నుమూసిన పద్మనాభరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశయ్యారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాదులతో పాటు న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన కొత్తలోనే మానవ హక్కుల రక్షణ కోసం పద్మనాభరెడ్డి ఎంతో తపనపడ్డారని, చివరి వరకు అలాగే పనిచేశారని కొనియాడారు.
‘‘వృత్తిపట్ల అంకితభావం, క్రిమినల్ లా పట్ల అపారమైన విజ్ఞానం, వెరసి ఆయనకు భారీస్థాయిలో కేసులు తీసుకొచ్చాయి. హైకోర్టులో అపారమైన ప్రాక్టీస్ దృష్ట్యా ఆయన క్రిమినల్ లాలో నడిచే ఎన్‌సైక్లోపీడియాగా పేరుపొందారు. తన వ్యక్తిత్వంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పద్మనాభరెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. పేదలు, అణగారిన వర్గాల న్యాయవాదిగా పేరుపొందారు. ’అని జస్టిస్ సేన్‌గుప్తా ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని తన తరఫున, తన సహచర న్యాయమూర్తుల తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పద్మనాభరెడ్డి మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.
పద్మనాభరెడ్డికి హైకోర్టు ఘన నివాళి
Published Wed, Aug 7 2013 5:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement