ధర్మాసన చైతన్యానికి దారేది? | abkprasad opinion on law system active role | Sakshi
Sakshi News home page

ధర్మాసన చైతన్యానికి దారేది?

Published Tue, Apr 19 2016 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ధర్మాసన చైతన్యానికి దారేది? - Sakshi

ధర్మాసన చైతన్యానికి దారేది?

రెండో మాట
 
కర్ణాటకలో బొమ్మయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ చేసిన ప్రయోగాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఫుల్‌బెంచ్ కొట్టివేస్తూ చీవాట్లు పెట్టింది. అయినా నేటి బీజేపీ-ఆరెస్సెస్ పరివార్ ప్రభుత్వం నిస్సిగ్గుగా అదే బాటలో ప్రయాణిస్తోంది. ఈ తప్పుడు ప్రయోగాలను ఆదర్శంగా మార్చుకున్న నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా విపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలను హైకోర్టు, సుప్రీంకోర్టు పదే పదే ప్రశ్నించినా వారు లెక్కచేయడం లేదు.

 
న్యాయవ్యవస్థ (ధర్మాసనం) తన చైతన్యపు హద్దులను అదుపు తప్పి పెంచుకుంటూ పోతోంది. కార్యనిర్వాహక వ్యవస్థ అయిన ప్రభుత్వ, శాసన వేదికల అధికారాలను న్యాయవ్యవస్థ తనకు దఖలు పరుచుకోరాదు. సుప్రీంకోర్టు చొరవతో ప్రారంభించిన ప్రజా ప్రయోజన వ్యాజ్య (పిల్) ప్రక్రియ అనేక సామాజిక దురన్యాయాల పరిష్కారానికి దోహదం చేసినప్పటికీ, రాజ్యాంగం  మూడు విభాగాలకు కేటాయించిన ప్రత్యేక అధికారాలను, వాటి సాధికారతనూ సుప్రీం న్యాయమూర్తులు పల్చబరచడానికి ప్రయత్నించరాదు.
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (భోపాల్‌లో జరిగిన న్యాయమూర్తుల సదస్సులో చేసిన హెచ్చరిక-16-4-16)
 
భోపాల్‌లో జరిగిన న్యాయమూర్తుల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. అందులో న్యాయ వ్యవస్థ (ధర్మాసన) చైతన్యం గురించి కొన్ని విమర్శలు వినిపిస్తాయి. సద్విమర్శ చేసిన కొన్ని సందర్భాలూ కనిపిస్తాయి. దేశంలో సుపరిపాలన నెలకొనేందుకు వీలుగా, సమతౌల్యంతో, నిష్పాక్షికంగా న్యాయం అందించే కృషిలో సామాన్యుడికి న్యాయ వ్యవస్థ తన మీద విశ్వాసం కలిగించగలిగిందని ప్రణబ్ పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే శిరోధార్యమని ప్రణబ్ పలికారు. అలాగే  రాజ్యాంగ పరిధిలో అధికారాలను చెలాయించడంలో అన్ని సందర్భాలలోనూ సమతౌల్యంతో వ్యవహరించాలనీ, ఈ క్రమంలో శాసనవేదికలూ, ప్రభుత్వాలూ తీసుకునే నిర్ణయాలు న్యాయ వ్యవస్థ సమీక్షకు బద్ధమై ఉండాలని కూడా రాష్ట్రపతి అన్నారు.

అయితే, తన అధికారాలను చెలాయించడంలో న్యాయ వ్యవస్థ ఆత్మ నిగ్రహంతో తనకు తానై క్రమశిక్షణతో వ్యవహరించాలని కూడా చెప్పారు. ఈ మాట ఇప్పుడు చెప్పడంలో ఏదో ఒక విశేషం ఉండి ఉండాలి. ఎందుకంటే, కేంద్ర, రాష్ట్రాల పాలకులు ప్రణబ్ ప్రస్తావించిన రాజ్యాంగ స్ఫూర్తితో గాని, చట్టాలను గౌరవించడంలో గాని పరిధులు దాటి వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు, పౌర సమాజాలు మరింత సన్నిహితంగా ఈ అంశాన్ని గుర్తించి ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో నిరసనలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పౌరుల, ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు ప్రాణాధారాలైన వాక్, సభా, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను రాజ్యాంగం విస్పష్టంగా నిర్వచించింది. ప్రణబ్ ప్రస్తావించిన ఆ ధర్మాసన చైతన్యం పరిధిలోకి, పరిశీలనలోకి ఇవి వస్తాయి. కానీ పాలకులు ఈ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కుంచింపచేసే యత్నం చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను ‘దేశద్రోహ’ నేరంగా పరిగణిస్తూ, బ్రిటిష్ వలస పాలకుల చట్టాలను దుమ్ము దులిపి ఆ హక్కుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు.
 
అగ్నికి కూడా చెదలేనా?

ఈ దుర్దశలోనే ఈ నెల 17న పీపుల్స్ ట్రిబ్యునల్ ముందు హాజరైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రు వ్యధతో చెప్పిన మాటలను గుర్తు చేసుకోకతప్పదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఘటనలపైన, కుల విచక్షణా ధోర ణులపైన దృష్టి సారించిన ఆ ట్రిబ్యునల్ ముందు హాజరైన విద్యార్థులను ఉద్దేశించే జస్టిస్ చంద్రు ఒక అనుభవాన్ని ఆవిష్కరించారు. అది కొట్టివేయదగినది కాదు. ఆ అనుభవం ఆయన మాటలలోనే: ‘నేను విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు హాస్టల్ నుంచి మూడుసార్లు నిష్కా రణంగా గెంటేశారు. తిరిగి ప్రవేశించడానికి అనుమతించేదాకా నిరవధిక నిరాహార దీక్ష చేశాను. కొన్ని నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నచోట కోర్టుల నుంచి న్యాయం కోసం ఎదురుచూడకూడదు.

కోర్టులకు వెళ్లి మా విద్యార్థులం ఎన్నడూ న్యాయం పొందలేకపోయాం. ఇది అనుభవసారం. నేటికీ మార్పు లేకుండా యథాతథ పరిస్థితి కొనసాగుతున్నది- విద్యార్థులు రాజకీయాల వైపు వెళ్లకుండా పాలకవర్గాలు నిరోధించడం. అలాగే సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం నుంచి విద్యార్థులను పక్కకు తప్పుకునేటట్టు చేయడం కూడా. కానీ న్యాయం కోసం పోరాడక తప్పదు. ఎందుకంటే విశ్వవిద్యాలయ ప్రాంగణాలు మా భవిష్యత్ నాయకులను సిద్ధం చేసేందుకు ఉద్దేశించినవేనని మరచిపోరాదు. మరొక అనుభవాన్ని కూడా ఆయన వెల్లడించారు.

ఒక దళిత యువకుడు మున్సిఫ్ ఉద్యోగానికి పరీక్ష రాసి (కింది సివిల్ కోర్టుకి) దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ ఇంటర్వ్యూలో ఆ న్యాయమూర్తి అడిగాడట -‘ఇంతకూ నీ ఆరాధ్యదైవం ఎవరు?’ అని. ఇతడు డాక్టర్ అంబేడ్కర్ అనడం ఆలస్యం పరీక్షలో తప్పించేశాడని జస్టిస్ చంద్రు చెప్పారు. మన న్యాయ వ్యవస్థ కూడా కుల వ్యవస్థలోనే కొట్టుమిట్టాడుతోందని ఆయన బాధను వ్యక్తం చేశారు. నిజానికి విద్యాధికులు, హేతువాదులైన ఆచార్యులు, పౌర హక్కుల ఉద్యమ నాయకులు తమ ధోరణులను ప్రశ్నించరాదని నేటి పాల కులు ఆశిస్తున్నారు. అంతేకాదు, ఒక సమస్యను నిగ్గు తేల్చడానికి ప్రాచీనా చార్యులు నెలకొల్పిన ప్రశ్నోత్తరాల ప్రక్రియ నుంచి తప్పించడానికి జరుగు తున్న కుట్రను నిరోధించడానికీ పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తున్నది.

పాఠాలు నేర్వని పాలకులు
రాజకీయ వ్యవస్థలోనూ ప్రజాస్వామ్యానికి కూడా ఇలాంటి దుర్గతినే పట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాలను కూల్చి (ఉదా. ఉత్తరాఖండ్, అరుణాచల్), కృత్రిమ పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పాలన ప్రవేశపెడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులు లేదా అనుచరులు, సాను భూతిపరులు అయిన గవర్నర్‌లను ఈ పనులలో పావులుగా ఉపయోగించు కుంటున్నారు. 20 ఏళ్ల క్రితం కర్ణాటకలో ఎస్‌ఆర్ బొమ్మయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ చేసిన ప్రయోగాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఫుల్‌బెంచ్ కొట్టివేస్తూ చీవాట్లు పెట్టింది.

అయినా నేటి బీజేపీ-ఆరెస్సెస్ పరివార్ ప్రభుత్వం నిస్సిగ్గుగా అదే బాటలో ప్రయాణిస్తోంది. ఈ తప్పుడు ప్రయోగా లను ఆదర్శంగా మార్చుకున్న నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా విపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలను హైకోర్టు, సుప్రీంకోర్టు పదే పదే ప్రశ్నించినా లెక్కచేయడం లేదు. అంటే అంబేడ్కర్ చెప్పినట్టు లోపం రాజ్యాంగంలో కాకుండా రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పాలకులలోనే ఉంది. ఈ సంగతి రాష్ట్రపతికి తెలియదని అనుకోలేం.

అయినప్పుడు న్యాయ వ్యవస్థ ధర్మాసన చైతన్యాన్ని విస్తరించకూడద’ని ప్రత్యేకించి హెచ్చరించవలసిన అవసరం ఇప్పుడెందుకు వచ్చింది? బహుశా కారణం ఇది కావచ్చు. జాతిసంపద రేడియో తరంగాల మీద గుత్తాధిపత్యం కోసం కాంగ్రెస్ - యూపీఏ పాలనలో జాతీయ అంతర్జాతీయ టెలికాం కంపెనీలు సాగించిన పెనుగులాట మల్టీ నేషనల్ కంపెనీలకు లాభసాటి వ్యాపారంగా, దేశ బొక్కసానికి పెద్ద చిల్లుగా మారింది. అప్పుడు సుప్రీం జోక్యం చేసుకుని ఈ కంపెనీల ‘వేట’ ఆట కట్టించి, 2-జి కుంభకోణాలపై విచారణకు ఆదేశించింది. సుప్రీం దేశభక్తియుత చర్యలో ఈ విచారణ అగ్రగామిగా చెప్పాలి. ఈ కుంభకోణాలలో సీబీఐ డెరైక్టర్ (సిన్హా?) ఒకరు కోర్టు అభిశంసనలకు గురై కొలువు చాలించుకోవలసి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా  ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ గుత్త కంపెనీలకూ, గుత్త పాలకులకూ మరో రూపంలో కొనసాగుతున్న సంబంధాలు చూస్తున్నాం.  

మరొక కీలక అంశం - బీజేపీ పాలకులు ధార్మిక, విద్యా, ఆరోగ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విదేశీ గుత్త ప్రత్యక్ష పెట్టుబడు లను 49 శాతం నుంచి 100 శాతానికి అనుమతిస్తున్నారు. ఈ దశలో  తమ నిర్ణయాలకు, వాటిపైన వచ్చే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు (పిల్స్)  న్యాయ వ్యవస్థ అడ్డుగా నిలవడం పాలకులకు ఇష్టముండదు!  బీజేపీ పాలకులకూ, అత్యున్నత న్యాయ వ్యవస్థకూ మధ్య ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న ‘ప్రచ్ఛన్నయుద్ధం’ (కోల్డ్‌వార్) దాని ఫలితమే. న్యాయ వ్యవస్థ రెక్కలు కత్తిరించేందుకు సుప్రీం స్వయంపాలిత జ్యుడీషియల్ కమిషన్ స్థానే కేంద్రపాలిత జాతీయ స్థాయి జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పరచడానికి పాలనా వ్యవస్థ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని జ్యుడీషియల్ పాలనా వ్యవస్థలో ప్రత్యక్ష జోక్యంగా న్యాయ వ్యవస్థ భావిస్తోంది.

ఎజెండాలు మారితే చాలదు!
కేంద్ర ప్రభుత్వ కార్య నిర్వాహక అధికారం రాష్ట్రపతిదే. ఆ అధికారాన్ని రాజ్యాంగ పరిధిలో (అధికరణ 53(1)) రాష్ట్రపతి చెలాయిస్తారు. 1970లలో ‘పిల్‌‘ ప్రవేశాన్ని సుప్రీం రెండు చేతులతో ఆహ్వానించి ఉండకపోతే ప్రజా వ్యతిరేక పాలకులు జ్యుడీషియరీని మరింతగా ఆట పట్టించి ఉండేవారు. అంతులే, వర్ధిచంద్ కేసులు ఈ ‘పిల్‌‘ కిందనే అవినీతి నిరోధక చట్టానికి పట్టుబడ్డాయి. ఈ రెండు కేసుల్లోనూ (రాజకీయులవే), బోఫోర్స్ కేసులోనూ ‘పిల్‌‘ ప్రభావం అసాధారణమైంది! అందుకే కార్యనిర్వాహక శక్తిగా ప్రభుత్వం పని కేవలం చట్టాలు చేయడమేకాదు, శాంతి భద్రతలు కాపాడటమే కాదు, ఆ ‘శాంతి భద్రతలు‘ ప్రజా బాహుళ్యానికి నూటికి 90 మందికి  అనుభవంలో వచ్చేటట్లు చూడడం కూడా రాష్ట్రపతి అధికార పరిధిలోనిదే.

ఎందుకంటే అధికరణలు 38/39 ద్వారా దేశ సంపదను దేశ ప్రజలదిగా రాజ్యాంగం ప్రకటించింది గనుక, ఆ సంపద యావన్మంది ప్రజలకు ఆచరణలో దక్కాలంటే మత ధర్మాలతో నిమిత్తం లేని ‘సెక్యులర్‌‘ (లౌకిక) వ్యవస్థను వెయ్యి కళ్లతో కాపాడుకోవలసిందే. ఆదివాసీలు, మైనారిటీలు, తదితర అసంఖ్యాక బడుగు, బలహీన వర్గాలూ, మనుషులూ భారతీయులు కానట్లుగా పాలక రాజకీయ పార్టీలు వ్యవహరించినంత కాలం - అదే అసలు ‘దేశద్రోహం‘. అది ’సెడిషన్’కు సరైన అర్థం! అసలు ఎజెండాలు మారాలిగానీ, జెండా రంగులు, డ్రెస్ కోడ్‌లు మార్చుకున్నంత మాత్రాన, అంబేడ్కర్‌కు, భగత్‌సింగ్‌కు మొక్కుబడిగా పూలమాలలు వేసినంత మాత్రాన వ్యవస్థ మారదు. పేదలకు అవస్థలూ తప్పవు!

వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement