దర్యాప్తులో జోక్యం సమంజసమేనా? | is correct to interfere with the investigation ? | Sakshi
Sakshi News home page

దర్యాప్తులో జోక్యం సమంజసమేనా?

Published Sun, Sep 4 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

దర్యాప్తులో జోక్యం సమంజసమేనా?

దర్యాప్తులో జోక్యం సమంజసమేనా?

 సందర్భం

రాజకీయ నాయకులు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఆ కేసులు అత్యంత ప్రాముఖ్యాన్ని చూరగొంటాయి. ఈ మధ్యన రెండు, మూడు నిబంధనలు ఆ రకమైన ప్రాముఖ్యాన్ని సంత రించుకున్నాయి. అవి- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154, సె.156(3), సె. 482. మొదటి నిబంధన ప్రథమ సమా చార నివేదిక (ఎఫ్‌ఐఆర్) గురించి వివరిస్తుంది. రెండో నిబం ధన ఎఫ్‌ఐఆర్‌ని విడుదల చేసి దర్యాప్తు చేసి దానిని మేజిస్ట్రేట్‌కి సమర్పించడం గురించి వివరిస్తుంది. హైకోర్టుకి ఉన్న స్వయం సిద్ధ అధికారాలను సె.482 వివరిస్తుంది. ఈ నిబంధన ప్రకారం కోర్టు ప్రక్రియ దుర్విని యోగం అవుతున్నప్పుడు లేదా న్యాయాన్ని సంరక్షించడానికి కోర్టు జోక్యం చేసుకునే అధికారాలను తెలియచేస్తుంది.

ముద్దాయిపై ఎఫ్‌ఐఆర్ విడుదల అయ్యాక, ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ముద్దాయి భావించినప్పుడు ఆ ఎఫ్‌ఐఆర్‌ని రద్దు చేయమని సె.482 ద్వారా కానీ, రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం కానీ కేసుని దాఖలు చేయవచ్చు. యోగ్యత ఉన్న కేసుల్లో హైకోర్టు ఆ కేసుని రద్దు చేయవచ్చు. అదే విధంగా నేర అభియోగం (చార్జిషీట్) దాఖలు చేసిన తర్వాత అందులో బలం లేదని ముద్దాయి భావించినప్పుడు దాన్ని రద్దు చేయమని హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ రెండు దశలు లేనప్పుడు హైకోర్టుని ఆశ్ర యించే అవకాశం లేదు. కేసుల దర్యాప్తు అనేది పోలీసులకి శాసనం ఇచ్చిన అధికారం. ఇందులో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు.

ఎఫ్‌ఐఆర్‌లను పూర్తిగా పరిశీలించినప్పటికీ అది ఎలాంటి నేరాన్ని చూపించలేన ప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం హైకోర్టుకి ఉంటుంది. దేశ పౌరులను, వ్యక్తులను అన్యాయంగా కేసుల్లో ఇరికించకుండా ఉండటానికి హైకోర్టు తన స్వయంసిద్ధ అధికారాలను ఉపయోగించి ఎఫ్‌ఐఆర్‌లను, క్రిమినల్ కేసులను కొట్టివేయవచ్చు. ఎఫ్‌ఐఆర్‌ను ముఖదృష్టితో పరిశీ లించినప్పుడు ఎలాంటి నేరం లేని సందర్భాల్లో దాన్ని కొట్టివేయవ చ్చని చాలా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు ఎలాంటి నేరాన్ని సూచించనప్పుడు దాన్ని కొట్టివేసే అధికారం హైకోర్టుకి ఉంటుంది.  ముద్దాయిపై ఆరోపించిన క్రిమినల్ నేరాల్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధనల ప్రకారం విచారించాలి. హైకోర్టు ఈ దశలో జోక్యం చేసుకోకూడదు. కాని ఏ నేరమూ కన్పించనప్పుడు మాత్రమే ఆ కేసుల్లో కోర్టు జోక్యంచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలు:
ఎఫ్‌ఐఆర్‌ను ఎప్పుడు కొట్టివేయాలి? ఎప్పుడు కొట్టివేయకూడదు అనే అంశాలపై సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్‌లాల్, ఏఐఆర్ 1992 కేసు (602)లో సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
1. ఎఫ్‌ఐఆర్‌లోని లేదా ఫిర్యాదులోని ఆరోపణలని ముఖవిలువతో గమనించిన ప్పుడు వాటిని మొత్తంగా ఆమోదించినప్పటికీ కూడా అది ఎలాంటి నేరాన్ని చూపించన ప్పుడు వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. 2. ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలను అదేవిధంగా నివేదికతోపాటు వచ్చిన ఇతర సమాచారాలని గమనించినప్పుడు అది ఎలాంటి విచారణా ర్హమైన (కాగ్నిజబుల్) నేరాన్ని సూచించనప్పుడు దాన్ని రద్దు చేయవచ్చు. 3. ఎఫ్‌ఐఆర్ లోని ఆరోపణలు, సాక్ష్యాల ద్వారా సేకరించిన సాక్ష్యాలు ఎలాంటి విచారణార్హమైన నేరాన్ని సూచించనప్పుడు దాన్ని రద్దు చేయవచ్చు. 4. ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలు విచార ణార్హమైన నేర సమాచారాన్ని సూచించకుండా, విచారణార్హం కాని (నాన్ కాగ్నిజబుల్) నేరాన్ని చూపించినప్పుడు, దానికి సె.155 (2) ప్రకారం సంబంధిత మేజిస్ట్రేట్ అనుమతి లేనప్పుడు రద్దు చేసే అవకాశం ఉంది.

5. ఎఫ్‌ఐఆర్‌లోని లేదా ఫిర్యాదులోని ఆరోపణలు అర్థరహితంగా ఉండి నమ్మశక్యంగా లేన ప్పుడు దాన్ని రద్దు చేయవచ్చు. 6. ఏదైనా శాసనపరమైన నిషేధం ఉన్నప్పుడు అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం లేదా వేరే శాసనాల ప్రకారం కానీ ఉన్నప్పుడు రద్దు చేయవచ్చు. అదే విధంగా బాధిత వ్యక్తి ఉపశమనం పొందడానికి వేరే నిబంధనలు ఉన్నప్పుడు కూడా రద్దు చేయవచ్చు.7. దురుద్దేశపూర్వకంగా లేదా ద్వేషపూర్వకంగా లేదా పగ సాధించడానికి కేసు నమోదు చేయించినప్పుడు రద్దు చేయవచ్చు. పైన పేర్కొన్న సందర్భాలు లేనప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడం సమంజసం కాదు.

ఎఫ్‌ఐఆర్ నివేదికను ఎప్పుడు కొట్టివేయకూడదు?
ఎఫ్‌ఐఆర్ నివేదికను కొట్టివేసేటప్పుడు అందులో ఉన్న విషయాలను గమనించాలి. అంతేకానీ సాక్ష్యాలలోని నిజానిజాల గురించి పరిశీలించకూడదు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ రు.సి.కుట్టన్ కేసులో (1999 (2) ఎస్.సి.సి 65) అభిప్రాయ పడింది. సుప్రీంకోర్టు ఇంకా ఇలా చెప్పింది. సాక్ష్యాలను గురించి విచారించడం హైకోర్టుకు తగని పని. తన అధికార పరిధిని దాటడమే అవుతుంది. కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు దర్యాప్తుని ఆపడం, ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయడం సరైంది కాదు. ఎఫ్‌ఐఆర్ అనేది దర్యాప్తు అధికారికి తమ ప్రక్రియను మొదలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఎఫ్‌ఐ ఆర్‌ని రద్దు చేసేటప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ దశలో సాక్ష్యాలలోని నిజానిజాల వైపు చూడకూడదు.

సాక్ష్యాలను సమీక్షించే అధికారం, వాటిపై వ్యాఖ్యానించే అధికారం కేసు విచారించే క్రమంలో ఉంటుంది. అంతే తప్ప కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ఈ అధికారం కోర్టు లకు ఉండదు. క్రిమినల్ కేసులని కొట్టివేసే దశలో కేసులోని సాక్ష్యాల గురించి హైకోర్టులు వ్యాఖ్యానించకూడదు. అట్లా వ్యాఖ్యానించి కేసులని రద్దుచేయకూడదు. దర్యాప్తు దశలో ఈ అధికారం కోర్టులకి లేదు. భజన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శ కాలను సుప్రీంకోర్టు నేటికీ ప్రతికేసులోనూ ఉటంకిస్తూనే ఉంది. అదే స్థిరమైన న్యాయం అయినా కొంతమంది కోర్టులకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు.
 

వ్యాసకర్త: మంగారి  రాజేందర్
పూర్వ డెరైక్టర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమి
lopalivarsham@gmail.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement