అభిప్రాయం
అవి అవార్డులు కావొచ్చు. రివార్డులు కావొచ్చు. న్యాయమూర్తులకి అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. న్యాయమూర్తులు అలాంటివి స్వీకరించకూడదు. ఇది ఎక్కడా వ్రాయని, నమోదు చేయని నీతి, నియమం.
ప్రజాస్వామ్య మనుగడకి స్వతంత్ర, నిర్భయ, నిష్పక్ష పాత న్యాయ వ్యవస్థ అవసరం. న్యాయమూర్తులు నిర్భయంగా లేకపోతే వాళ్లు భారత పౌరులకి రాజ్యాం గం ప్రసాదించిన ప్రాథమిక హక్కులని, ఇతర హక్కులని పరిరక్షించలేరు. న్యాయమూర్తులు బలహీనంగా ఉండి ఒత్తిడులకి, ప్రలోభాలకి లొంగిపోతే వాళ్లు ప్రజల హక్కులని పరిరక్షించలేరు. ఫలితంగా న్యాయవ్యవస్థ మీద విశ్వసనీయత సన్నగిల్లుతుంది. చిన్న చిన్న ప్రలోభాలకి కూడా న్యాయమూర్తులు లొంగకూడదు.
మన దేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం, అభిప్రాయభేదాలు ఇలాంటి వాటితో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మసకబారుతుంది. కొన్ని సంఘటనలు చిన్నవిగా అన్పించినా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవి న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద అనుమానాలు వచ్చేవిధంగా ఉంటున్నాయి. మిగతా వ్యవస్థల్లో ఉన్న అవలక్షణాలు మెల్లమెల్లగా న్యాయ వ్యవస్థకి సంక్రమిస్తున్నాయని అన్పిస్తుంది.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన న్యాయవ్యవస్థని ప్రభుత్వం ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదు. న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, న్యాయం జరిగిందని అన్పించడం అంతకన్నా ముఖ్యం. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాలని జాగ్రత్తగా గమనించి అలాంటి ప్రభావితం చేసే విషయాలకి దూరంగా ఉండాలి. అవి అవార్డులు కావొచ్చు. రివా ర్డులు కావొచ్చు. న్యాయమూర్తులకి అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. న్యాయమూర్తులు అలాంటివి స్వీకరించకూడదు. ఇది ఎక్కడా రాయని, నమోదు చేయని నీతి, నియమం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ 30 మంది మహిళలకి నారీ శక్తి పురస్కారాలను ప్రకటించింది. మహిళలకి న్యాయం అందే విధంగా, వాళ్లకి స్వాధికారికత లభించే విధంగా కృషి చేసినందుకు గుర్తింపుగా నారీ శక్తి పురస్కారాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆమె స్వీకరించింది కూడా. గతంలో ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా అవార్డులని ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్ సంస్థల నుంచి గానీ స్వీకరించలేదు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎం.ఎల్. వెంకటాచలయ్యకి, పి.ఎన్. భగవతికి పద్మభూషణ్‌ల్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే వాళ్లు పదవీ విరమణ చేసిన తరువాత ఇచ్చింది. మరో ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. వర్మకి ఆయన మరణించిన తరువాత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఆ అవార్డుని నిరాకరించారు. కానీ ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న గీతా మిట్టల్ ఈ అవార్డుని స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల మొత్తాన్ని ధార్మిక సంస్థలకి ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఏమైనా అవార్డు స్వీకరించడంవల్ల ఆమె ప్రభుత్వం నుంచి కొంత లబ్ధిని పొందినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కేసులని ఆమె పరిష్కరించటంలో స్వతంత్రత కోల్పోతుందన్న భావన ప్రజలకి కలిగే అవకాశం ఉంది. మరో విధంగా చెప్పాలంటే అవార్డు స్వీకరించడంవల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకి భంగం వాటిల్లుతుందని భావించవచ్చు.
పదవీ విరమణ తరువాత న్యాయమూర్తులు ఏదో ఒక పదవిని స్వీకరించడం విషయంలోనే దేశంలో విమర్శలు వస్తున్నాయి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సదాశివం గవర్నర్ పదవి స్వీకరించడంలో చాలా విమర్శలు వచ్చాయి. పదవీ విరమణ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఏ పదవీ స్వీకరించకుండా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అన్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే మరో పదవిని స్వీకరించడమంటే న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి ద్రోహం చేసినట్టేనని మరో మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ అన్నారు. ఈ మాట లని ఎవరూ పట్టించుకోవడం లేదు. న్యాయమూర్తి లోధా తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన హెచ్‌ఎల్. దత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉండటానికి తన సంసిద్ధతని వెలిబుచ్చారు. ఆ పదవిని స్వీకరించారు. ఆయనే కాదు. చాలామంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత వివిధ చదువుల్లో ఉన్నారు.
అవార్డు స్వీకరించడం అనేది చిన్న విషయంగా కన్పిస్తూ ఉండవచ్చు. కానీ పదవిలో ఉన్న న్యాయమూర్తి ఈ విధంగా అవార్డు స్వీకరించడంవల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతని దెబ్బతీస్తాయి. మిగతా వ్యవస్థలకి భిన్నంగా న్యాయవ్యవస్థ ఉండాలి. కానీ రోజు రోజుకూ అన్ని వ్యవస్థల్లాగే ఇది కూడా మారిపోతోందని అన్పిస్తుంది. న్యాయమూర్తులని రిసీవ్ చేసుకోవడానికి ప్లకార్డులు ఫ్లెక్సీలు, నిలువెత్తు బొమ్మలు, గజమాలలు కన్పిస్తుంటే న్యాయ వ్యవస్థ ఎటు ప్రయాణం చేస్తుందని భయమేస్తుంది. విజిల్ బౌలర్లుగా ఉండాల్సిన న్యాయవాదులే ఈ పని చేస్తుంటే ఈ పరిస్థితికి ఆనకట్ట వేసేదెవరు?
- మంగారి రాజేందర్
వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001
Comments
Please login to add a commentAdd a comment