మీడియాపై ఆంక్షలు సబబా? | why restrictions on media, writes Mangari Rajender | Sakshi
Sakshi News home page

మీడియాపై ఆంక్షలు సబబా?

Published Wed, Dec 6 2017 3:44 AM | Last Updated on Wed, Dec 6 2017 3:44 AM

why restrictions on media, writes Mangari Rajender - Sakshi

ప్రధాన న్యాయమూర్తి సహా అన్ని కోర్టుల కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని మన న్యాయవ్యవస్థ ప్రజలకు కల్పించింది. ఈ హక్కుని తగ్గించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయత తగ్గుతుంది.

న్యాయస్థానాల్లో విచారణలు బహిరంగంగా జరుగుతాయి. ఈ విచారణలను ప్రజలు హాజరై గమనించవచ్చు. ఈ బహిరంగ విచారణల వల్ల వ్యక్తులకి, సమాజానికి మేలు జరుగుతుంది. బహిరంగ విచా రణ హక్కు ఉండటం వల్ల న్యాయపాలన ఎలా జరుగు తుందో, నిర్ణయాలు ఎలా జరుగుతాయో ప్రజలకు తెలుస్తుంది. మన దేశంలో సివిల్, క్రిమినల్‌ కోర్టుల విచారణలు బహిరంగంగానే జరుగుతాయి. ఈ బహి రంగ విచారణల వల్ల ప్రజల్లో కోర్టుల పట్ల విశ్వసనీ యత పెరుగుతుంది. బహిరంగ విచారణలను వీక్షించి, ప్రచురించే అవకాశం మీడియాకు ఉంది. కానీ ఇటీవలి కాలంలో కోర్టులు జారీ చేస్తున్న ఉత్తర్వుల వల్ల కోర్టు కార్యకలాపాలను ప్రచురించే అవకాశాన్ని మీడియా కోల్పోతుంది. ఇవి, ఒక రకంగా బహిరంగ విచారణలకి వ్యతిరేకమైన ఉత్తర్వులని  అనుకోవచ్చు. కోర్టుల కార్య కలాపాల్లో ఉన్నంత పారదర్శకత ఏ వ్యవస్థలోనూ కన్పించదు. ఇది న్యాయ వ్యవస్థకు ఉన్న విశిష్ట లక్షణం. ఈ విశిష్టత బీటలు వారుతున్నట్టు అనిపిస్తుంది.

సోహ్రాబుద్దీన్‌ షేక్‌ కేసును విచారిస్తున్న సీబీఐ న్యాయమూర్తి ఆ విచారణకు సంబంధించిన విషయా లను ప్రచురించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా రిపోర్టుల వల్ల విచారణకు  అంతరాయం కలు గుతుంది, ముద్దాయిల ప్రాణాలకు నష్టం వాటిల్లు తుంది అన్న డిఫెన్స్‌ వాదనలను అంగీకరిస్తూ సీబీఐ న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ ముఖ్యమంత్రిపై కేసు సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు నవంబర్‌ 7న ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. వీటి కంటే ముందే సుప్రీంకోర్టు ఈ ఏడాది మొదట్లో దాదాపు ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. న్యాయమూర్తి కర్ణ న్‌కు కోర్టు ధిక్కార కేసులో శిక్ష విధిస్తూ అది ఆయన ప్రకటనలను ఏ పత్రిక ప్రచురించకూడదంటూ మీడి యాపై ఆంక్షలను విధించింది. ఈ ఉత్తర్వులు మిగతా కోర్టులను కూడా ప్రభావితం చేశాయని అనుకోవచ్చు.

చాలా కేసుల్లో మీడియా కాపలా కుక్కలా పని చేస్తుంది. విచారణలో ఉన్న వ్యక్తులకు హాని కలగకుండా మీడియా కేసు వార్తలను ప్రచురించాల్సి ఉంటుంది. హాని కలిగించే విధంగా ప్రచురించినప్పుడు ఆ మీడియా సంస్థపై చర్య తీసుకునే అధికారం కోర్టులకు ఉంది. అయినా మీడియా గొంతు నొక్కడం ఎంతవరకు సమం జసం అన్న వాదన వినిపిస్తోంది. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారమేగాక అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం ప్రతి వ్యక్తికి బహిరంగ విచారణ హక్కులు ఉంటాయి.

బహిరంగ విచారణలు జరపడం అనేది నియమం లాంటిది. ఈ నియమానికి మినహాయింపులు ఇచ్చే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది. విచారణకు మొత్తంగా ప్రజలందరిని దూరంగా ఉంచాలా, ప్రత్యే కించి ఎవరిని దూరంగా ఉంచాలి అన్న విషయాలు సంబంధిత కోర్టుని బట్టి, ఆ వ్యవహారం తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే కోర్టు కార్యకలాపాలను కొంత కాలం కానీ, పూర్తిగా కానీ పత్రికలు ప్రచురించరాదని ఆదేశించే అధికారం కోర్టుకు ఉంటాయి.  క్రిమినల్‌ ప్రొసీ జర్‌ కోడ్‌ సెక్షన్‌ 327 ప్రకారం క్రిమినల్‌ కోర్టులకు ఈ అధికారం ఉంటుంది. సివిల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లో అలాంటి ప్రత్యేక నిబంధన లేదు. కానీ సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 151 ప్రకారం సివిల్‌ కోర్టుకు స్వయంసిద్ధ అధికా రాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో ఎవరినైనా బయటికి పంపించే అధికారం కోర్టుకు ఉంటుంది. అధికారం ఉండడం ఒక ఎత్తు, దానిని న్యాయబద్ధంగా ఉపయోగించడం మరొక ఎత్తు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కోర్టులు తమ అధికారాలను వినియోగించాల్సి ఉంటుంది.

బహిరంగ విచారణలనేవి ఆరోగ్యకరమైన, నిష్పా క్షిక న్యాయపాలనకు పునాది లాంటివి. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండటానికి న్యాయమూర్తులు చపలత్వా నికి లోనుకాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడు తుంది.

భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భావాలను ప్రకటించిన తర్వాత, అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ముందుగానే భావ ప్రక టనను నిరోధించడం ప్రజాస్వామ్యానికి హాని కలిగిం చేది అవుతుందని అనుకోవచ్చు.

1950లో సుప్రీంకోర్టు, బ్రిజ్‌భూషణ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఢిల్లీ కేసులో  బ్రిటిష్‌ న్యాయ కోవిదుడు బ్లాక్‌ స్టోన్‌ అభిప్రాయాన్ని ఉటంకిస్తూ పత్రికా స్వేచ్ఛ గురించి ఇలా అభిప్రాయపడింది. ‘‘ప్రచురించడానికన్నా ముందే పత్రి కపై పరిమితులు విధించకూడదు. ఈ స్వేచ్ఛ ఇచ్చి నంత మాత్రాన తప్పుడు రాతలపై చర్యలు తీసు కోవద్దని కాదు’’. ఇప్పుడు కోర్టులు ఇస్తున్న ఉత్తర్వుల వల్ల ప్రచురణకన్నా ముందే పత్రికలపై పరిమితులను విధిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

నిష్పాక్షిక విచారణ కోసం కోర్టులు ఈ పరిమి తులను విధించవచ్చు. అయితే బహిరంగ విచారణల వల్ల, కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల కోర్టుల పట్ల ప్రజల విశ్వసనీయత మరింత పెరిగే అవకాశం ఉంది. భారత ప్రధాన న్యాయ మూర్తి కోర్టు కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని కూడా కోర్టులు కల్పించాయి. మిగతా వ్యవస్థల కన్నా భిన్నంగా ఈ హక్కుని కోర్టులు ప్రజలకి ఇచ్చాయి. ఈ హక్కుని తగ్గించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు వున్న విశ్వసనీయత తగ్గుతుంది. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని కోర్టులు పరిమితులని విధిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది.


- మంగారి రాజేందర్‌

వ్యాసకర్త తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు ‘ మొబైల్‌ : 94404 83001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement