బిల్లుల మీద చర్చలు తగ్గుతున్నాయా? | Article On Discussions In parliament | Sakshi
Sakshi News home page

బిల్లుల మీద చర్చలు తగ్గుతున్నాయా?

Published Tue, Jun 18 2019 12:46 AM | Last Updated on Tue, Jun 18 2019 12:46 AM

Article On Discussions In parliament - Sakshi

ప్రజలకు అవసరమైన శాసనాలు తయారు చేయడం శాసన వ్యవస్థ ప్రధాన కర్తవ్యం. శాసనాలు తయారు చేసే క్రమంలో చర్చలు జరగాలి. బిల్లులలోని నిబంధనలను నిశితంగా పరిశీలించాలి. ప్రజల సొమ్ముని ఏ విధంగా వినియోగించాలి అన్న విషయం మీద కూడా కొన్ని శాసనాలు ఉంటాయి. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే శాసనాలని, సంక్షేమ పథకాలకు సంబంధించిన శాసనాలను, వాటిలోని అంశాలని చర్చించడం కూడా శాసనకర్తల విధి. ఈ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసమే శాసనసభ్యులని, పార్లమెంటు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. శాసనమండలి సభ్యులని, రాజ్యసభ సభ్యులని కూడా ఈ విధులు నిర్వర్తించడం కోసమే ఎన్నుకుంటారు. 

ఈ విధ్యుక్త బాధ్యతని సభ్యులు విస్మరిస్తున్నట్లు అనిపిస్తుంది. శాసనాల మీద జరగాల్సినంత చర్చ జరగడం లేదు. జరిగినా కూడా అది బలహీనంగా ఉంటుంది. బిల్లుమీద, బిల్లులోని అంశాల మీదా మాట్లాడుతున్న శాసనకర్తలు అరుదుగా కన్పిస్తున్నారు. బిల్లు ప్రతులని శాసనకర్తలకి ముందుగానే ఇచ్చినప్పటికీ వాటిని అధ్యయనం చేసి వస్తున్న సభ్యుల సంఖ్య తక్కువగా కన్పిస్తుంది.

గత పది సంవత్సరాలలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో 44 శాతం బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా చట్టరూపం దాల్చాయని ఓ సర్వే సారాంశం. ఇలా శాసనాలు రావడం వల్ల కార్యనిర్వాహక వ్యవస్థ శాసనాల మాదిరిగా నియమాలు తయారు చేసే విధంగా కొన్ని నిబంధనలు శాసనాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా పార్లమెంటు తయారు చేసే శాసనాలు ప్రాతినిధ్య శాసన నిర్మాణం ద్వారా శాసనాలుగా వస్తున్నాయి. పార్లమెంటు, శాసనసభలు చేయాల్సిన పనిని కార్యనిర్వాహక వ్యవస్థకి చేస్తుంది. ఇందుకు ఉదాహరణలుగా కొన్ని శాసనాలని ఉదహరించవచ్చు. 

చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ విషయంలో అలాంటిదే జరిగింది. చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ సంస్థని తొలగించి నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ)ని ఏర్పాటు చేశారు. చార్టెడ్‌ అకౌంటెట్స్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే సంస్థ ఇది. ఈ సంస్థ ఏర్పాటులో పార్లమెంటు పాత్ర శూన్యం. కంపెనీ చట్టం, 2013లో ఏర్పరిచిన ఒకే ఒక నిబంధన సి. 132. ఆ నిబంధనని ఆధారం చేసుకుని ఈ సంస్థని కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇలాంటి నిబంధనలు చాలా శాసనాల్లో ఉంటున్నాయి. 

కొత్తగా తయారు చేసే శాసనాల మీద చర్చలు జరుగకపోవడానికి కారణాలు – శాసనాల గురించి అవగాహన ఉన్న సభ్యుల సంఖ్య తగ్గిపోవడం, పార్టీ మార్పిడి వ్యతిరేక చట్టం. దీనికి రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీలో చాలా మంది న్యాయవాదులు ఉండేవారు. మొదటి లోక్‌సభలో న్యాయవాదుల సంఖ్య 36 శాతం. ఈ సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన లోక్‌సభ సభ్యుల్లో 4 శాతం మంది మాత్రమే న్యాయవాదులు ఉన్నారు. న్యాయవాదులు ఉంటేనే బిల్లుల మీద చర్చ ఎక్కువగా జరుగుతుందని కూడా అనలేం. కానీ కొంత ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం వల్ల పార్టీలు మారటం ఏమాత్రం తగ్గలేదు కానీ బిల్లులమీద చర్చ జరుగకుండా ఉండటానికి ఆ చట్టం దోహదపడుతుందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న పార్టీ బిల్లుకు అనుకూలంగా ఓటువేయమని విప్‌ జారీ చేస్తుంది. సభ్యులందరూ అదేవిధంగా ఓటువేస్తారు. ప్రతిపక్ష పార్టీలలోకూడా ఇదే పరిస్థితి. దాని వల్ల కూడా బిల్లులమీద ఎలాంటి చర్చ జరగటం లేదని అనుకోవచ్చు. కార్యనిర్వాహక వ్యవస్థే బిల్లులని తయారు చేస్తుంది. విప్‌ ప్రభావం వల్ల అవసరమైన చర్చ జరుగకుండా బిల్లులు ఆ చట్టసభల్లో ఆమోదం పొందుతున్నాయి. 

పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ద్వారా శాసనకర్తలు తమ స్వేచ్ఛని పోగొట్టుకున్నారని చెప్పవచ్చు. ఉద్దేశించిన ప్రధాన సమస్యని ఈ చట్టం ఆపలేకపోయింది. కానీ ఈ విషయంలో శాసనకర్తల స్వేచ్ఛని హరించిందని చెప్పవచ్చు. 

ఇప్పుడు కాలం మారింది. గతంలో మాదిరిగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తుల సంఖ్య, న్యాయవాదుల సంఖ్య, ఇతర విద్యావేత్తల సంఖ్య చట్టసభల్లో రోజురోజుకీ తగ్గిపోతుంది. పెద్దల సభలో కూడా ఇదే పరిస్థితి. అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు అంతటా ఆ వ్యాపార వేత్తలే కన్పిస్తున్నారు. వాళ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజాసమస్యల కన్నా తమ వ్యాపార విషయాల మీద వారి దృష్టి ఎక్కువగా ఉంటుందని అనడం అతిశయోక్తి కాదు. 

మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాల్లో 39 శాతం మంది తమ వృత్తి రాజకీయం–సాంఘిక సేవ అని పేర్కొంటున్నారు. నిజానికి సాంఘిక సేవ అనేది ఏమీ లేదు. వాళ్లలో వ్యాపారస్తులే అధికం. ఈ పరిస్థితులు నెలకొని ఉన్న మన దేశంలో శాసనాల మీద, బిల్లుల మీద, ప్రజాసమస్యల మీద చర్చ జరగాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. 

కొన్ని రాజ్యాంగ పదవులకు వ్యాపారవేత్తలు అర్హులు కారు. ఆ పదవులు చేపట్టిన తర్వాత ఎలాంటి వ్యాపార లావాదేవీలూ చేయడానికి వీల్లేదు. అలాంటి నిబంధన శాసనకర్తల విషయంలో కూడా ఏర్పరిస్తే మంచిదనే అభిప్రాయం కలుగుతుంది. 


మంగారి రాజేందర్‌
వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు
మొబైల్‌ : 94404 83001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement