తీరిన కోరిక తెలంగాణ హైకోర్టు | Guest Columns On Andhra Pradesh And Telangana To Have Separate High Courts | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 1 2019 1:21 AM | Last Updated on Tue, Jan 1 2019 1:21 AM

Guest Columns On Andhra Pradesh And Telangana To Have Separate High Courts - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి రెండు హైకోర్టులు ఉండాలి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడాలి. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారు. గత 62 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థతో తెలంగాణ నలిగిపోయింది. ఈ అసమానతలు తొలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. దాని కోసం మరో పోరాటం అవసరమేమో. ఏమైనా, 1 జనవరి 2019 తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది.

2 జూన్‌ 2014వ తేదీ మాదిరిగా, 1 జనవరి 2019వ తేదీ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ ప్రజలు సంపూర్ణ తెలంగాణ ఏర్పడినట్టు భావించలేదు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఈ జనవరితో ఆ కోరిక తీరింది. 1947 నుంచి 1956 వరకు ఉన్న చరిత్ర ఎవరికీ తెలియకుండా చరిత్ర పుస్తకాలు వచ్చేశాయి.  అందుకని హైదరాబాద్‌ రాష్ట్రానికి ప్రత్యే కంగా హైకోర్టు ఉండేదని, దానికి ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఉండేవారని ఎవరికీ తెలియదు. ఆంధ్రా హైకోర్టు, హైదరాబాద్‌ హైకోర్టులను 1 నవంబర్‌ 1956న విలీనం చేశారు. కానీ, హైదరాబాద్‌ హైకోర్టు ఆంధ్రా హైకోర్టులో విలీనం అయినట్టు భ్రమింపజేసి హైదరాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించి వాళ్లను తమకన్నా జూనియర్లు అయిన ఆంధ్రా న్యాయమూర్తులకన్నా జూనియర్లుగా మార్చి తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు. 

హైదరాబాద్‌ హైకోర్టు పద్ధ్దతులను మంటగలిపి ఆంధ్రా పద్ధతులను హైకోర్టులో నెలకొల్పారు. అది చాలా సులువుగా అమలు జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆం్ర«ధా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆంధ్రా రాష్ట్రానికి, హైదరాబాద్‌ రాష్ట్రానికి చాలా భేదం ఉంది. అది బ్రిటీష్‌ వారి ఆధిపత్యంలో నుంచి ఏర్పడిన రాష్ట్రం. భారతదేశానికి చెందిన ముస్లిం రాజు ఆధిపత్యం నుంచి బయటపడి ఏర్పడిన రాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రం. ఆంధ్రా శాసనాలు అన్నీ బ్రిటీష్‌ పార్లమెంట్‌ తయారు చేసినవి. హైదరాబాద్‌ రాష్ట్రంలోని శాసనాలు అన్నీ హైదరాబాద్‌ స్వంత శాసనాలు. ఇక భాష విషయానికి వస్తే వాళ్లది ఆంగ్లం, హైదరాబాద్‌ వాళ్లది ఉర్దూ. ఇక్కడి శాసనాలన్నీ ఉర్దూలో ఉండేవి. పరిపాలన ఉర్దూలో జరిగేది.

హైకోర్టులో కూడా ఉర్దూలో వాదనలు వినిపించేవాళ్లు. ఇక్కడి న్యాయవాదుల సౌకర్యార్థం ఓ ఉర్దూ బెంచిని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు దశలో వాగ్ధానం చేశారు. కానీ చేయలేదు. చాలామంది తెలంగాణ న్యాయవాదులకు ఇంగ్లీషులో ఆంధ్రావాళ్లకి ఉన్న ప్రావీణ్యం లేకపోవడం వల్ల రెండవ శ్రేణి న్యాయవాదులుగా పరిగణించబడినారు. దానికి తోడు ఆంధ్ర రిజిస్ట్రార్ల, అధికారుల ఆధిపత్యం కింద నలిగిపోయినారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపికచేసే కొలీజియమ్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులే ఉండటం వల్ల ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే హైకోర్టు న్యాయమూర్తులుగా, వారు నేరుగా ఎంపిక చేసిన ఆంధ్రా న్యాయవాదులే జిల్లా జడ్జీలుగా నియమితులైనారు. న్యాయవ్యవస్థ మొత్తం ఆంధ్రా ప్రాంత వాసుల గుప్పిటిలోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఏర్పడటానికి ముందు మాత్రమే అడ్వకేట్‌ జనరల్‌ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి నియామకం కావడం వల్ల ప్రభుత్వ న్యాయవాదుల ఎంపికలో ఎంత వివక్ష జరిగిందో ఊహించుకోవచ్చు.  

ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం రావడం, న్యాయవాదులు చురుగ్గా పాల్గొనడం నేటి ఆధునిక చరిత్ర. 14 మార్చి, 2004న తెలం గాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడవ మహాసభలు జరిగాయి. ఈ సమావేశానికి అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి (సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశారు.)ని ఆహ్వానించాం. ఆ సమయంలో ఎంతో భవిష్యత్‌ ఉన్న హైకోర్టు న్యాయమూర్తి ఆ సమావేశాలకు రావడం సాహసమనే చెప్పాలి. సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న నేను క్రియాశీలక పాత్ర పోషించడమూ అంతే సాహసమని చెప్పుకోక తప్పదు. ఆ రోజు న్యాయ మూర్తుల ఎంపికకు పరీక్ష జరుగుతోంది. అందరు న్యాయమూర్తులు ఆ డ్యూటీలో ఉన్నారు.

నాకు మాత్రం మినహాయింపునిచ్చారు. జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, జస్టిస్‌ నర్సింహారెడ్డి తదితరులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా బలపరిస్తే పరోక్షంగా బలపరిచిన న్యాయమూర్తులు ఎందరో. దేశంలో ఉండేటువంటి మౌలిక వనరులు ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అవి వివిధ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజల మధ్యన సమానత్వం పెంపొందించడానికి ఉపయోగపడాలి. రాజ్యం ఏర్పాటు చేసేటువంటి ప్రతి వ్యవస్థ ఆర్థిక రాజకీయ, సాంఘిక సమానత్వం సంపాదించడానికి, పెంపొందించడానికి సాధనాలుగా ఉపయోగపడాలి. భిన్న ప్రాంతాల, వృత్తుల ప్రజల మధ్యన ఉన్నటువంటి  ఆర్థిక తారతమ్యాలను రూపుమాపడాన్ని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఈ స్ఫూర్తితో న్యాయమూర్తులు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. 

ఈ మూడవ సభ జరిగిన పది సంవత్సరాల తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నర సంవత్స రాల తరువాత తెలంగాణకి హైకోర్టు ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పేరుని హైదరాబాద్‌ హైకోర్టుగా మార్చి దాన్ని రెండు రాష్ట్రాలకు కామన్‌ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఒక్కపేరు తప్ప ఏమీ మారలేదు. మిగతా కొత్త రాష్ట్రాల్లో విభజించినట్టు క్రిందికోర్టు న్యాయమూర్తుల విభజన కూడా జరుగలేదు. ఈ విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలన్న హైకోర్టు న్యాయమూర్తి నర్సింహారెడ్డి వాదనని ఎవరూ పట్టించుకోలేదు.

దాని ఫలితంగా ఎంతోమంది తెలంగాణ న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాందిశీకుల్లా బతికారు. 31 డిసెంబర్‌న వారి విభజన జరిగింది. ఈ విభజనపట్ల ఎన్నో అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా ప్రత్యేక హైకోర్టు ఏర్పడుతున్నందుకు సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఏర్పాటుని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 ప్రకారం పూర్వ ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా 2 జూన్‌ 2014న ఏర్పడినాయి. ఈ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి రెండు హైకోర్టులు ఉండాలి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడాలి. ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా హైదరబాద్‌ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుని విడదీసి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజలు కోరినారు. హైదరాబాద్‌లోనే రెండు హైకోర్టులు వేరువేరుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాలని కల్పిస్తామని ధన్‌గోపాల్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అలా వీల్లేదని హైదరాబాద్‌ హైకోర్టు తీర్పుని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ద్వారా అప్పీలుని దాఖలు చేసింది. హైదరాబాద్‌ హైకోర్టు సుప్రీంకోర్టు ముందు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. 16 నుంచి 18 నెలల లోపు పూర్తిస్థాయిలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి అవుతుందని అంతలోపు తాత్కాలిక భవనంలో హైకోర్టుని ఏర్పాటు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తెలిపారని హైకోర్టు తమ ప్రమాణ పత్రంలో పేర్కొంది. హైదరాబాద్‌ హైకోర్టు నియమించిన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ అమరావతిలోని భవనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో ఆ హైకోర్టుకు వెళ్లడానికి ఇష్టపడే న్యాయమూర్తులు తమ ఇష్టాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. న్యాయమూర్తులు అమరావతి వెళ్లడానికి ఇష్టపడటం లేదన్న అపప్రధని తొలగించారు.

డిసెంబర్‌ 15నాటికి హైకోర్టు తాత్కాలిక భవనం సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది. న్యాయమూర్తులు కూడా అక్కడ ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తి చెం దారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు లేవని అందుకని కాంపిటెంట్‌ అథారిటీ (రాష్ట్రపతి) తగు చర్యలు తీసుకొని నోటిఫికేషన్ని జారీ చేయాలని సూచించింది. 1 జనవరి 2019 నాటికి రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేస్తాయని సుప్రీంకోర్టు ఆశించింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జనవరి 1 నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు అవుతుందని నోటిఫికేషన్ని విడుదల చేసింది. రెండు హైకోర్టుల న్యాయమూర్తుల జాబితాని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సి.ప్రవీణ్‌కుమార్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. 

ఈ దశలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అనవసర సందేహాలు,అపో హలు కావాలని సృష్టించారు. ఈ విభజన వల్ల జగన్‌మోహన్‌రెడ్డి కేసులు మళ్లీ మొదటి దశకు చేరుకుంటాయన్న వాదనను లేవనెత్తారు. కేసుల విచారణకి అధికార పరిధి ఉంటుంది. ఆ అధికార పరిధిలోని కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతుంది. న్యాయమూర్తులు బదిలీ అయినంత మాత్రాన అవి మళ్లీ మొదటిదశకు చేరుకోవు. ఎందుకంటే, అవి వారంట్‌ కేసులు. సమ్మరీ(చిన్న కేసులు)ల్లో మాత్రమే అలాంటి అవకాశం ఉం టుంది. ఈ విషయాన్ని న్యాయకోవిదులు ముఖ్యమంత్రికి చెబుతారు.

అయినా, అన్నీ తెలిసీ ముఖ్యమంత్రి ఇలాంటి అపోహలని సృష్టిస్తున్నా రని భావించాల్సి ఉంటుంది. చేరువలో న్యాయం ఉండాలి. సత్వర న్యాయం అందాలి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక సూత్రాలు చెబుతున్నది ఇదే. హైకోర్టు దగ్గరలో ఉండటం న్యాయవాదులకే కాదు, కక్షిదారులకీ అవసరం. మన దేశంలో న్యాయవ్యవస్థ నత్తనడక నడుస్తున్నదని పేరుంది. 28 డిసెంబర్‌ 2018నాటికి మన దేశంలో 30 సంవత్సరాలకు మించి కోర్టు పరిశీలనలో 66వేల కేసులు ఉన్నాయి. ఐదు సంవత్సరాలకు పైబడిన కేసులు 60లక్షలు ఉన్నాయి. 1800 కేసులు గత 48–58 సంవత్సరాలుగా వాదన దశలో ఉన్నాయి. 60 సంవత్సరాలకు పైబిన కేసులు 140ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి కొత్త కోర్టునీ, అందులో హైకోర్టునీ స్వాగతించాల్సింది పోయి అనవసర అపోహలు సృష్టించడం, ఆటంకాలు సృష్టించడం ఎవరికీ తగదు.  

గత 62 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థతో తెలంగాణ నలిగిపోయింది. తెలంగాణ న్యాయమూర్తులు తక్కువ మంది ఉన్నారు. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే అధికంగా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌ న్యాయమూర్తులు, జిల్లా జడ్జీల్లో సీనియర్లు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. ఈ అసమానతలు తొలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. ఏమైనా, 1 జనవరి 2019 తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నేను పని చేశాను. అది హైదరాబాద్‌ హైకోర్టుగా రూపాంతరం చెందిన తరువాత పదవీ విరమణ చేశాను. ఇప్పుడు న్యాయవాదిగా తెలంగాణ హైకోర్టులోకి ప్రవేశించడం ఓ భావోద్వేగానికి సంబంధించిన అంశం. ఇది ఒక్క నాకే కాదు, ఎంతోమంది న్యాయవాదులకీ, న్యాయమూర్తులకీ కూడా. అందరికీ అభినందనలు. 


వ్యాసకర్త: మంగారి రాజేందర్‌, మాజీ న్యాయమూర్తి మొబైల్‌: 9440483001 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement