వివరణాత్మక ఉత్తర్వులు సుప్రీంకోర్టు వెంటనే ఇవ్వకపోతే సీబీఐ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సీబీఐని పోలీసు సంస్థగా పరిగణించడానికి అవకాశం ఉండదు. అప్పుడు సీబీఐ పెట్టిన కేసులన్నీ గంగలో కలుస్తాయి. స్టే తీర్పు సీబీఐ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. సత్వర న్యాయం అన్నది మన రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లలో మిళితమై ఉంది. అయితే ఇది అమలు జరగడం లేదు. కేసుల పరిష్కారాల్లో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు. అందులో ‘స్టే’లు ముఖ్యమైనవి.
ఈ పరిస్థితిని గమనించి సుప్రీంకోర్టు మార్చి 28వ తేదీన కృష్ణకాంత్ తామ్రాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఓ ప్రధానమైన అంశాన్ని సృష్టించింది. ఈ తీర్పులో చాలా విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. న్యాయమూర్తుల నియామకం, న్యాయవాదుల బంద్‌లు, అఖిల భారత స్థాయిలో న్యాయమూర్తుల నియామకం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు లాంటి చాలా విషయాలని ప్రస్తావిస్తూ స్టేల గురించి కూడా ప్రస్తావించింది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఈ స్టేల గురించి ఎక్కువగా ప్రస్తావించాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఇది చాలా ముఖ్యమైన అంశం.
హైకోర్టులు, సుప్రీంకోర్టులు సామాన్యులకి అందనంత దూరంలో ఉంటాయి. ఈ కోర్టులు ఏదైనా కేసులో స్టేలు మంజూరు చేస్తే వాటిని వెకేట్ చేయించడం మామూలు వ్యక్తులతో అయ్యేపని కాదు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ స్టేలను ఆసరా చేసుకొని వినోదం చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకి ఈ తీర్పు కష్టం కలిగిస్తుంది. ఇది బయటకు కన్పించే పరిస్థితి కానీ ఈ తీర్పు వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ పరిణామాల్లో ముఖ్యమైంది సీబీఐ ఏర్పాటు. అదే విధంగా ఆ సంస్థ దర్యాప్తు చేసిన కేసుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఏ కోర్టు మంజూరు చేసినా స్టేల తుది గడువు 6 మాసాలు మాత్రమే. ఈ 6 మాసాల తరువాత ఆ స్టే పొడిగింపు కోసం ఆ కోర్టు వివరణాత్మక తీర్పులని జారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఉత్తర్వులని ఆ స్టే పొందిన వ్యక్తులు తీసుకున్నప్పుడే వాళ్లు పొందుతున్న ఉపశమనం కొనసాగుతుంది. అలా తీసుకొని రానప్పుడు వాళ్లు చట్టం పరిధిలోకి వస్తారు. ఉదాహరణకు, ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి నిరోధక శాఖ ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయగానే అతను హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో వెళ్లి స్టే తెచ్చుకుంటాడు.
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకూడదని అతను కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాడని అనుకుందాం. ఆ కేసు కోర్టు ముందుకు రాకుండా అతను చాలా చర్యలు తీసుకుంటాడు. ఈ తీర్పువల్ల ఆ పరిస్థితికి కొంతమేర అవరోధం ఏర్పడుతుంది. అతను మళ్లీ కోర్టు నుంచి వివరణాత్మక ఉత్తర్వులు తెచ్చుకొని పోలీసులకు అందచేయకపోతే పోలీసులు దర్యాప్తుని కొనసాగించవచ్చు. అవసరమైతే అతన్ని అరెస్టు కూడా చేయవచ్చు. ఇది ఒక పరిస్థితి.
ఇంకో పరిస్థితిని మనం గమనిద్దాం. 1963వ సంవత్సరంలో కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా సీబీఐని ఏర్పాటు చేశారు. చట్టం ద్వారా కాకుండా కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా ఏర్పాటైన సంస్థ రాజ్యాంగ వ్యతిరేకమైన సంస్థ అని గౌహతి హైకోర్టు నవీంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తులు ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, ఇందిరా షాలు 7 నవంబర్ 2013లో తీర్పు చెప్పారు.
నవీంద్రకుమార్ పై 2001వ సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టప్రకారం ఓ కేసుని సీబీఐ నమోదు చేసింది.
2004వ సంవత్సరంలో సీబీఐ చార్జిషీట్‌ని దాఖలు చేసింది. సీబీఐ రాజ్యాంగబద్ధత గురించి నవీంద్రకుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ని దాఖలు చేశాడు. పోలీసు విధులు నిర్వర్తించే అధికారం సీబీఐకి లేదని అతను తన రిట్ పిటీషన్లో పేర్కొన్నాడు. హైకోర్టులోని సింగిల్ బెంచ్ అతని రిట్ పిటీషన్‌ని 30.11.2007 రోజున డిస్మిస్ చేసింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అతను అప్పీలుని దాఖలు చేశాడు. అతని అప్పీలుని ఆమోదిస్తూ డివిజన్ బెంచ్ ఈ విధమైన ఫైండింగ్స్ (నిర్ణయాంశాలు)ని ఇచ్చింది.
డి.ఎస్.పి. ఈ చట్టంలోని ఫలానా నిబంధన ప్రకారం సీబీఐని ఏర్పాటు చేసినట్టు, సీబీఐ ఏర్పాటు తీర్మానంలో ఎక్కడా పేర్కొనలేదు. అందుకని ఆ చట్ట ప్రకారం సీబీఐ ఏర్పడినట్టు కాదు. ఏదైనా సంస్థకి ప్రత్యేకమైన పేరుని ఇస్తే అదే పేరుతో సంస్థ ఉండాలి. ఈ సంస్థ ఆ విధంగా లేదు. అందుకని అది ఈ చట్ట ప్రకారం ఏర్పాటైన సంస్థ కాదు. అన్నింటికన్నా ముఖ్యమైంది– సీబీఐ ఏర్పాటు తీర్మాన ప్రతిని రాష్ట్రపతి ముందు పెట్టలేదు. ఆయన అనుమతి కూడా తీసుకోలేదు.
భారత ప్రభుత్వ కార్యదర్శి వి. విశ్వనాథన్ 1.4.1963వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుతో ఏర్పడిన సంస్థ సీబీఐ. ఇంకా కొన్ని కారణాలని పేర్కొంటూ సీబీఐ అనేది పోలీసు సంస్థ కాదని గౌహతి హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. అందుకని నవీంద్రకుమార్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌ని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. భారత ప్రభుత్వం ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టేని మంజూరు చేసింది. ఆ స్టే ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఆ కేసు ఎప్పుడు పరి ష్కారం అవుతుందో తెలియదు.
ఇప్పుడు సుప్రీంకోర్టు కృష్ణకాంత్ తీర్పులో చెప్పిన ప్రకారం కోర్టులు మంజూరు చేసిన స్టేలు ఆరుమాసాలకి మించి కొనసాగడానికి వీల్లేదు. ఒకవేళ స్టే కొనసాగాలంటే కోర్టు వివరణాత్మక ఉత్తర్వులను పరిశీలించాలి. ‘స్టే’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టుకి కూడా వర్తిస్తుంది. వివరణాత్మక ఉత్తర్వులు సుప్రీంకోర్టు వెంటనే ఇవ్వకపోతే సీబీఐ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సీబీఐ అనేది పోలీసు సంస్థగా పరిగణించడానికి అవకాశం ఉండదు. అప్పుడు సీబీఐ పెట్టిన కేసులన్నీ గంగలో కలుస్తాయి. స్టే తీర్పు సీబీఐ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.
సుప్రీం కోర్టు మార్చి 28న జారీ చేసిన తీర్పువల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఈ తీర్పుని లోతుగా చూస్తే తప్ప ఈ విషయం బోధపడదు. ఈ తీవ్ర పరిణామాలని భారత ప్రభుత్వం గమనిస్తే ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తామ్రాకర్ కేసులో ‘స్టే’ని మంజూరు చేయడం అంత సులువు కాదు.
మంగారి రాజేందర్
వ్యాసకర్త కవి, రచయిత మొబైల్ : 94404 83001
Comments
Please login to add a commentAdd a comment