విశ్లేషణ
న్యాయానికి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏదైనా కేసుని గోప్యంగా విచారించమని హైకోర్టు ఆదేశించవచ్చు. బహిరంగంగా విచారణలు జరపడం వల్ల ఉచితమైన, నిష్పాక్షిక న్యాయం అందుతుంది. ఈ భావనకి నష్టం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టు గోప్యతను పాటించవచ్చు.
మన దేశంలో ఎన్‌కౌంటర్ మరణాలు సహజమైపోయాయి. నిందితులే దాడి చేసినట్టుగా ప్రథమ సమాచార నివేదికలు విడుదల అవుతాయి. ఈ కేసుల్లో భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధన 302 ప్రకారం కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పుని ప్రకటించి చాలా కాలమైంది. దానిపై అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఏదైనా ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు జరిగి, కోర్టులో విచారణ జరు గుతూ ఉంటే సహజంగానే దేశ ప్రజలకి ఆ కేసు గురించి ఆసక్తి ఏర్పడు తుంది. మీడియా కూడా ఈ కేసులని రిపోర్టు చేయడంలో ఉత్సాహాన్ని ప్రకటిస్తుంది. ఇలాంటి కేసుల విచారణ విషయాలను మీడియాలో ప్రక టించకూడదన్న నిషేధపు ఉత్తర్వులు ఆందోళన కలుగజేస్తాయి. సొహ్రా బుద్దీన్ షేక్, ప్రజాపతి మాసిరామ్, కవుసర్‌బీ ఎన్‌కౌంటర్ కేసులని విచా రిస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి అలాంటి ఉత్తర్వులనే ఆ కేసుల విష యంలో జారీ చేశారు. ఆ ఉత్తర్వులని బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకి లేదని, ఆ పరిస్థితులూ లేవని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ న్యాయమూర్తి జారీ చేసిన మీడియా నిషేధపు ఉత్తర్వులకి వ్యతిరేకంగా టీవీ, ప్రింట్ మీడియా జర్న లిస్టులు హైకోర్టులో రిట్ పిటిషన్‌ని దాఖలు చేశారు.
ఆ కేసులో జరుగుతున్న రోజువారీ వ్యవహారాలని మీడియా ప్రచు రించవచ్చని, ప్రసారం చేసుకోవచ్చని బొంబాయి హైకోర్టు తమ ఉత్త ర్వులో స్పష్టం చేసింది. మీడియా గొంతు నొక్కడం లాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకి లేదని హైకోర్టు న్యాయమూర్తి మోహన్ డిరే స్పష్టం చేశారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మీడి యాకూ వర్తిస్తుంది. బహిరంగ విచారణ జరుగుతున్నప్పుడు ఆ విష యాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. అది ప్రజాహితం కోసమేనని కూడా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సొహ్రాబుద్దీన్ కేసు ఈ చరిత్రను సృష్టించింది. 2003 నుంచి 2006 వరకు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాల గురించి దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో దర్యాప్తు జరిగి విచారణ దాకా వచ్చిన కేసు అది. ఈ కేసు ఫలితంగా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసుని విచారించిన రెండవ న్యాయమూర్తి బీహెచ్ లోయా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని మరణం ఇప్పుడు ప్రశ్నా ర్థకమైంది. 2014లో ఆ కోర్టుని నిర్వహించిన మూడవ న్యాయమూర్తి అప్పటి హోంమంత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని డిశ్చార్జ్ చేశారు. న్యాయమూర్తి లోయా మరణం గురించిన కేసు విచారణ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశం దాకా చేరింది. ఈ దశలో సీబీఐ న్యాయమూర్తి మీడియా గొంతు నొక్కడం వివాదాస్పదమైంది.
న్యాయస్థానాల్లో విచారణలు బహిరంగంగా జరుగుతాయి. ఈ విచారణలను ప్రజలు హాజరై గమనించవచ్చు. ఈ బహిరంగ విచారణల వల్ల వ్యక్తులకి, సమాజానికి మేలు జరుగుతుంది. బహిరంగ విచారణ హక్కు అనేది రాజ్యాంగంలోని అధికరణ 21లో మిళితమై ఉంది. ఈ బహిరంగ విచారణలవల్ల కోర్టుల విశ్వసనీయత పెరుగుతుంది. బహిరంగ విచారణ నియమం లాంటిది. గోప్యంగా జరపడం ఈ నియమానికి మినహాయింపు. న్యాయానికి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏదైనా కేసుని గోప్యంగా విచారించ మని హైకోర్టు ఆదేశించవచ్చు. బహిరంగంగా విచారణలని జరపడం వల్ల ఉచితమైన, నిష్పాక్షికంగా న్యాయం అందుతుంది. ఈ భావనకి నష్టం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులని జారీ చేసే అవకాశం ఉంది.
క్రింది కోర్టుల్లో కూడా విచారణలు బహిరంగంగా జరగాలి. క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 327 ఇదే విషయాన్ని చెబుతుంది. అయితే లైంగిక దాడులకి సంబంధించిన నేరాల విచారణని గోప్యంగా జరపాల్సి ఉంటుంది. అదే విధంగా అందరినీ కానీ, కొంతమందినిగానీ కోర్టు నుంచి బయటకు పంపే అధికారం కోర్టుకి ఉంటుంది. ఈ విషయాలను బొంబాయి హైకోర్టు పరిశీలించి ఈ విధంగా అభిప్రాయపడింది.
‘‘ఈ కేసులో బహిరంగ విచారణ జరపడంవల్ల ప్రాణానికి హాని ఉందని, అలాంటి పరిస్థితి ఉందనిగానీ సీబీఐ న్యాయమూర్తి తమ ఉత్త ర్వులలో పేర్కొనలేదు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని కోర్టు డిశ్చార్జి చేసింది. అందుకని అలాంటి భయాందోళనలకి అవకాశం లేదు’’.
దేశంలోని కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నాయని అనడానికి పార దర్శకత అవసరం. న్యాయ ప్రక్రియలో ఇదే మౌలికమైన అంశం. ఆ విశ్వ సనీయతవల్లే ప్రజలు కోర్టు తీర్పులకి బద్ధులై ఉంటున్నారు.
బొంబాయి హైకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. ‘‘భారత ప్రజాస్వామ్యాన్ని అనుక్షణం కాపాడే వ్యవస్థ మీడియా. ప్రజలకి కళ్లూ చెవులూ మీడియానే. అందుకని సమాజహితం కోసం మీడియాకు స్వేచ్ఛ ఉండాలి’’. అవును– ఖచ్చితంగా మీడియాకు స్వేచ్ఛ ఉండాలి.
- మంగారి రాజేందర్
వ్యాసకర్త కవి, రచయిత
మొబైల్ : 94404 83001
Comments
Please login to add a commentAdd a comment