ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణ విషయంలో ప్రభుత్వ వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం సరైన చర్య అనిపించుకోదని హైకోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ నిమిత్తం వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారికి రీ పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ పౌరహక్కుల సంఘం నేత సీహెచ్ చంద్రశేఖర్, మృతుల భార్యలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్ స్పందిస్తూ కేసు దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పగించామని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదుల్లో ఒకరైన వి. రఘునాథ్ స్పందిస్తూ సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీపై తమకు అభ్యంతరాలున్నాయని, అందువల్ల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ సీబీఐ ఎందుకని, అవసరమైతే ఆ అధికారిని మార్చి వేరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తామని తెలిపింది. ప్రభుత్వ వాదన వినకుండా తాము సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పరిహారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో తగిన వేదికలను ఆశ్రయించాలని తెలిపింది.
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై..
నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద గత నెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికారుద్దీన్, తదితరులకు రీ పోస్టుమార ్టం నిర్వహణకు ఆదేశాలు ఇచ్చేందుకు సింగిల్ జడ్జి నిరాకరించడంపై రిట్ అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన ధర్మాసనం విచారణను వేసవి సెలవుల రెండో వెకేషన్ బెంచ్‌కు బదలాయించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ దశలో సీబీఐ విచారణకు ఆదేశించలేం
Published Sat, May 2 2015 1:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement