నేరం రుజువయ్యే వరకు ముద్దాయి నిరపరాధే!! | Innocent until proven guilty of a crime !! | Sakshi
Sakshi News home page

నేరం రుజువయ్యే వరకు ముద్దాయి నిరపరాధే!!

Published Mon, Mar 23 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

నేరం రుజువయ్యే వరకు ముద్దాయి నిరపరాధే!!

నేరం రుజువయ్యే వరకు ముద్దాయి నిరపరాధే!!

సందర్భం
 నేరారోపణ ఎదుర్కొంటున్న వారిని నేరస్తులుగా చూడటం సరికాదు. నేరం రుజువయ్యే వరకు ముద్దాయిని నిరపరాధిగా పరిగణించాల్సి ఉంటుంది. మన శాసనకర్తలకు శాసనాల గురించిన స్పృహ కూడా లేదా?
 
 మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. కానీ పార్లమెంట్‌లో వివిధ రాష్ట్రాల లోని శాసన సభల్లో అదే విధంగా పెద్ద సభల్లో కూడా సభ్యు ల ప్రవర్తన బలహీనంగా ఉంది.  అన్ని రాష్ట్రాలలోని శాసన సభ్యుల ప్రవర్తన ఒకేలా ఉంది. అక్రమాల గురించి ఎవరైనా సభ్యుడు లేదా ప్రతి పక్ష నాయకుడు ప్రశ్నించినప్పుడు, ఏవైనా వివరణలని కోరి నప్పుడు పాలకపక్షం తగు జవాబు ఇవ్వడంలేదు. పైగా వ్యక్తిగత దూషణలతో ఎదురు దాడి చేస్తున్నారు. 420 అని, జైలు పక్షి అని కూడా అరుస్తున్నారు. ప్రజలు గమ నిస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా దారుణంగా ప్రవ ర్తిస్తున్నారు. దీనికి ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు.

 శాసనాలు చేసే వ్యక్తులు శాసనాల గురించిన స్పృ హ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం శాసనం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గాని, లేక వ్యక్తిగత స్వేచ్ఛను గాని హరించడానికి వీల్లేదు. మన శాసనాల ప్రకారం కేసుల దర్యాప్తు విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అం టే అవి ముద్దాయికి అదే విధంగా ప్రాసిక్యూటర్‌కి కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. అంటే ఇద్దరినీ సమానంగా చూడాలి. మన దేశంలో విరోధి (అడ్వసెరీ) పద్ధతిలో విచారణలు జరుగుతాయి. ఈ పద్ధతిలో న్యాయమూర్తి ఇరుపక్షాలకి నిష్పక్షపాతంగా ఉండాలి. అతను కేసుల విచారణలో సాధారణంగా చురుకుగా పాల్గొనగూడదు. ఈ పద్ధతి ఎక్కువగా ‘కామన్ లా’ దేశాలలో ఉంది. ఈ పద్ధతిలో ఇరుపక్షాలు ఉంటాయి. ముద్దాయి పక్షం ఒకటి ప్రాసిక్యూషన్ పక్షం మరొకటి. కేసును ఋజువు చేయా ల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ఈ పద్ధతిలో ముద్దాయి సాక్ష్యం ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. అదే విధంగా అతన్ని ప్రాసిక్యూటర్ ప్రశ్నించ డానికి వీల్లేదు. కాని ముద్దాయి తనని తాను విచారిం చుకోవడానికి అతనికి విచక్షణాధికారం ఉంది. ఆ విధం గా అతను నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే అతన్ని ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో తప్పుడు సాక్ష్యం ఇస్తే అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మౌనంగా ఉండే అవకాశం ఉంది. ఈ పద్ధతి ఇన్క్విస్టోరియల్‌కి విరుద్ధం. ఆ పద్ధతిలో న్యాయమూర్తి చురుకైన పాత్ర వహిస్తాడు. విచారణలో సాక్ష్యులను విచారించేది న్యాయమూర్తే.  సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తిదే.

 మన జ్యురిస్‌ప్రుడెన్స్ ప్రకారం ఆరు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి కొత్తగా మరొకటి చేరింది. అవి :- 1. నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని అమాయకునిగా పరిగణించాలి. 2. నేర నిరూపణ భారం ఎప్పుడూ ప్రాసిక్యూషన్‌పైనే ఉంటుం ది. తాను అమాయకుడినని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిపై ఉండదు. 3. అనుమానానికి అతీ తంగా నేర నిరూపణ చెయ్యాలి. 4. ప్రాసిక్యూషన్ కథ నంలో సహేతుకమైన సంశయం ఉంటే ఆ సంశయ లబ్ది ముద్దాయికే లభిస్తుంది. 5. భారతీయ శిక్షా స్మృతిలోని సాధారణ మినహాయింపుల విషయంలో ముద్దాయి కేసు ప్రబలతని బట్టి రుజువు చేస్తే సరిపోతుంది. 6. తొంభై తొమ్మిది మంది ముద్దాయిలు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు.

 కాలక్రమంలో చివరి సూత్రానికి కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మారిన జ్యురిస్‌ప్రుడెన్స్ ప్రకారం - అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఎలా ఉందో, అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తిపై ఉంది. నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయి నిరపరాధి అనే మౌలికమైన హక్కు భావన దర్యాప్తు నుంచి నేరనిరూపణ జరిగే వరకు ఉంటుంది. దీని అర్థం నేరనిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసి క్యూషన్‌పై ఉంటుంది. ఈ విషయం మీద భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. బాధితులకు కష్టం కలిగే విధంగా సమాజానికి నష్టం వాటిల్లే విధంగా ఈ నిబంధన ఉంద ని చాలా మంది వాదిస్తూ ఉంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సాక్ష్యాధారాల చట్టంలో ఏ ఒక్కరికో లబ్ది చేకూర్చే విధంగా తయారు చేయలేదు. ఇద్దరికీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే సమాజానికి తగు న్యాయం జరిగే విధంగా తయారు చేశారు. నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్‌పై ఉండకూడదని నేరం తాను చెయ్యలేదని రుజువు చేసు కోవాల్సిన బాధ్యత ముద్దాయిపై ఉంచాలన్న వాదన తరుచూ వస్తుంది. అయితే ఈ వాదనతో ఏకీభవిం చలేం. మన దేశంలోని నేరస్తులు ఎక్కువ మంది నిరు పేదలు, దిక్కూదివాణం లేని వ్యక్తులు. వాళ్లు తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమ వుతారు. అలాంటి సందర్భాలలో న్యాయమూర్తి వాళ్లకి శిక్ష విధించాల్సి వస్తుంది. దాని వల్ల అమాయకులకి పెద్ద ఆపద వస్తుంది.  కేసుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మ న దేశంలోని చాలా మంది ప్రజలకి లేవు. తమపై మో పిన నేరారోపణలని ఎదుర్కొనే సామర్థ్యం ఇంకా భార తదేశ ప్రజలకి రాలేదు. ఇక ‘రాజ్యం’ విషయానికి వస్తే విచారణని రుజువు చేసే క్రమంలో దానికి ఎంతో శక్తి ఉంది. వనరులు ఉన్నాయి. పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యవస్థలాంటి ఎన్నో అంశాలు రాజ్యం వద్ద ఉన్నాయి.
 అందుకని నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలి అన్న సూత్రం ఆవ శ్యకత ఎంతో ఉంది. అది ముద్దాయికి డాలుగా ఉపయో గపడుతుంది. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులపై కోర్టు శిక్ష విధించే వరకు నిరపరాధిగానే భావించాల్సి ఉంటుంది. ఇదీ మన దేశంలోని జ్యురిస్‌ప్రుడెన్స్. ఈ విషయం అందరూ గ్రహించాలి.

 మంగారి రాజేందర్, న్యాయనిపుణులు
మొబైల్ : 94404 83001

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement