నా భర్త ఆరేళ్ల క్రితం తన కజిన్‌కి 7 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. నెలవారీ వడ్డీ చెల్లించేలా ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నాము. ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చారు కానీ తర్వాత కట్టడం ఆపేశారు. దాంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తుండగానే నా భర్త చనిపోయారు. మా వద్ద అప్పు తీసుకున్న వారి తండ్రికి భూములు ఉన్నాయి. మావారు కాలం చేసిన తర్వాత మాకు రావలసిన బాకీ గురించి అడిగాను. అందుకు వారు అంగీకరించకపోగా ‘‘కోర్టులో తేల్చుకుంటాము’’ అంటున్నారు. ప్రామిసరీ నోటు నా పేరు మీదే ఉంది కానీ ప్రస్తుతం నా వద్ద ఒరిజినల్ లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రామిసరీ నోటు ఒరిజినల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రామిసరీ నోటుపై ఉన్న సాక్షులు కూడా ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారి వైపే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు సలహా ఇవ్వగలరు.
– లత, సత్యసాయి జిల్లా
ప్రామిసరీ నోటు మీ పేరు మీదే ఉంది అంటున్నారు కాబట్టి కోర్టులో కేసు మీరు నడిపించవచ్చు. మీకు మీ డబ్బులు తిరిగి పొందే హక్కు – వీలూ రెండూ ఉన్నాయి. ఒరిజినల్ ప్రామిసరీ నోటు చాలా ముఖ్యమైన ఆధారం. అయితే అది లేనంత మాత్రాన మీ కేసు తేలకుండా పోదు. వేరే ఆధారాల మీద మీరు కేసు నడిపించాలి. ప్రామిసరీ నోటును ద్వితీయ సాక్ష్యం (సెకండరీ ఎవిడెన్స్)గా తీసుకునే వీలు ఉందా లేదా అనే అంశాన్ని మీ కేసు పూర్వాపరాలు సమీక్షించిన మీ లాయర్ మాత్రమే చెప్పగలరు.
మీరు డబ్బులు ఇచ్చారనడానికి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ వంటి ఏదో ఒక సాక్ష్యం ఉన్నా సరిపోతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. అంతమొత్తంగా డబ్బులు మీకు చెందినవే అనే అంశాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్‌కమ్ టాక్స్ డిక్లరేషన్ చేశారా లేదా ప్రభుత్వానికి మీ వద్ద ఉన్న నగదు గురించి డిక్లేర్ చేశారా లేదా అనే అంశాలపై అవతలవారు కేసు నడిచే క్రమంలో అడగవచ్చు.
దానికి సమాధానాలు ఇచ్చేందుకు మీరు సిద్ధపడి ఉండాలి. మీరు ఒకవేళ ప్రభుత్వానికి సదరు లావాదేవీ గురించి డిక్లేర్ చేసి ఉన్నట్లయితే ఎలాంటి భయం అవసరం లేదు. ఇదంతా ఎందుకనుకుంటే మధ్యవర్తి ద్వారా మరోసారి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగిగా మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎటువంటి అమ్మకాలు/ కొనుగోలు చేసినా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి డిక్లేర్ చేయవలసి ఉంటుంది.
అధికమొత్తంలో నగదు సేవింగ్స్ రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మీకు వేరే ఆదాయం ఉంటే అది కూడా డిక్లేర్ చేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్థిక లావాదేవీలు అధిక మొత్తంలో చేసినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. )
Comments
Please login to add a commentAdd a comment