promissory notes
-
ఒరిజినల్ ప్రామిసరీ నోటు ఉంటే మంచిది ..!
నా భర్త ఆరేళ్ల క్రితం తన కజిన్‌కి 7 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. నెలవారీ వడ్డీ చెల్లించేలా ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నాము. ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చారు కానీ తర్వాత కట్టడం ఆపేశారు. దాంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తుండగానే నా భర్త చనిపోయారు. మా వద్ద అప్పు తీసుకున్న వారి తండ్రికి భూములు ఉన్నాయి. మావారు కాలం చేసిన తర్వాత మాకు రావలసిన బాకీ గురించి అడిగాను. అందుకు వారు అంగీకరించకపోగా ‘‘కోర్టులో తేల్చుకుంటాము’’ అంటున్నారు. ప్రామిసరీ నోటు నా పేరు మీదే ఉంది కానీ ప్రస్తుతం నా వద్ద ఒరిజినల్ లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రామిసరీ నోటు ఒరిజినల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రామిసరీ నోటుపై ఉన్న సాక్షులు కూడా ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారి వైపే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు సలహా ఇవ్వగలరు. – లత, సత్యసాయి జిల్లాప్రామిసరీ నోటు మీ పేరు మీదే ఉంది అంటున్నారు కాబట్టి కోర్టులో కేసు మీరు నడిపించవచ్చు. మీకు మీ డబ్బులు తిరిగి పొందే హక్కు – వీలూ రెండూ ఉన్నాయి. ఒరిజినల్ ప్రామిసరీ నోటు చాలా ముఖ్యమైన ఆధారం. అయితే అది లేనంత మాత్రాన మీ కేసు తేలకుండా పోదు. వేరే ఆధారాల మీద మీరు కేసు నడిపించాలి. ప్రామిసరీ నోటును ద్వితీయ సాక్ష్యం (సెకండరీ ఎవిడెన్స్)గా తీసుకునే వీలు ఉందా లేదా అనే అంశాన్ని మీ కేసు పూర్వాపరాలు సమీక్షించిన మీ లాయర్ మాత్రమే చెప్పగలరు. మీరు డబ్బులు ఇచ్చారనడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటి ఏదో ఒక సాక్ష్యం ఉన్నా సరిపోతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. అంతమొత్తంగా డబ్బులు మీకు చెందినవే అనే అంశాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్కమ్ టాక్స్ డిక్లరేషన్ చేశారా లేదా ప్రభుత్వానికి మీ వద్ద ఉన్న నగదు గురించి డిక్లేర్ చేశారా లేదా అనే అంశాలపై అవతలవారు కేసు నడిచే క్రమంలో అడగవచ్చు. దానికి సమాధానాలు ఇచ్చేందుకు మీరు సిద్ధపడి ఉండాలి. మీరు ఒకవేళ ప్రభుత్వానికి సదరు లావాదేవీ గురించి డిక్లేర్ చేసి ఉన్నట్లయితే ఎలాంటి భయం అవసరం లేదు. ఇదంతా ఎందుకనుకుంటే మధ్యవర్తి ద్వారా మరోసారి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగిగా మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎటువంటి అమ్మకాలు/ కొనుగోలు చేసినా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి డిక్లేర్ చేయవలసి ఉంటుంది. అధికమొత్తంలో నగదు సేవింగ్స్ రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మీకు వేరే ఆదాయం ఉంటే అది కూడా డిక్లేర్ చేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్థిక లావాదేవీలు అధిక మొత్తంలో చేసినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. ) -
భర్త అప్పును భార్య చెల్లించినా..
సాక్షి, అమరావతిబ్యూరో/పటమట: విజయవాడ కొత్తపేట జోడు బొమ్మల సెంటర్‌కు చెందిన బవిడిశెట్టి రాము వీఎంసీలో ఓ చిరు ఉద్యోగి. పెదబాబు అనే వడ్డీ వ్యాపారి దగ్గర రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో పెదబాబు కోర్టు ద్వారా అతని పింఛన్ నుంచి నెలనెలా కొంత సొమ్ము జమ చేసుకుంటున్నాడు. అదే సమయంలో రాము వన్‌టౌన్‌కు చెందిన రాంప్లి పాపారావు వద్ద కూడా రూ.2 లక్షలు అప్పు తీసుకుని చెల్లించేశాడు. అయితే అతను పాపారావుకు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు వెనక్కు తీసుకోలేదు. ఇప్పుడా ప్రామిసరీ నోట్ల ఆధారంగా పాపారావు కోర్టుకు వెళ్లి రూ.7 లక్షలకు దావా వేశాడు. పాపారావు వేధింపులు భరించలేక బవిడిశెట్టి రాము ఇటీవల మృతి చెందాడు. అయినా అప్పు చెల్లించాలంటూ అతని కుటుంబ సభ్యులను కాల్‌మనీ గ్యాంగ్ వేధిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో శానిటరీ విభాగంలో పనిచేస్తున్న సుమారు 450 మంది చిరు ఉద్యోగులు అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కాల్‌మనీ వ్యాపారులు రాబందుల్లా మారి ఉద్యోగులను పీక్కుతింటున్నారు. అవసరాల నిమిత్తం కాల్‌మనీ వ్యాపారుల వద్ద రూ.వేలల్లో అప్పు తీసుకున్న పాపానికి రూ.లక్షల్లో డబ్బులు చెల్లించినప్పటికీ వారి అప్పు తీరడం లేదు. పైగా రూ.లక్షల్లో అప్పు ఉన్నాడంటూ లీగల్ నోటీసులు రావడం.. పింఛన్లు, రిటైర్ బెనిఫిట్లు అటాచ్‌మెంట్‌కు గురవతుండటంతో వీఎంసీ ఉద్యోగుల్లో దిక్కుతోచని స్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగులకైతే ముక్కు మొహం తెలియని వారి నుంచి లీగల్ నోటీసులు రావడం గమనార్హం. కాల్‌మనీ వ్యాపారులు తెరవెనుక ఉండి ఇతరుల పేరిట లీగల్ నోటీసులు పంపుతూ వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా వీఎంసీ అడ్డాగా జరుగుతోన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల మరణించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ముక్కంటి కూడా కాల్‌మనీ వ్యాపారుల వేధింపులకు గురైనట్లు సమాచారం. వీఎంసీలో కీలక స్థానంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఓ ఉద్యోగి కాల్‌మనీ వ్యాపారులు కలిసి ఈ దందాను కొనేళ్లుగా సాగిస్తున్నట్లు సమాచారం. అతనికి చెందిన రూ.20 లక్షలకు పైగా డబ్బును కాల్‌మనీ వ్యాపారులు వడ్డీకి తిప్పుతున్నట్లు వీఎంసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులెవరైనా తీసుకున్న అప్పు చెల్లించకపోతే వారికి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే పనిని సైతం అప్పట్లో ఆ ఉద్యోగి చేసేవాడని.. ఇందుకు అకౌంట్స్ విభాగంలోని కొందరు సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. భర్త అప్పును భార్య చెల్లించినా.. బండి చిన్న నూకమ్మ వీఎంసీలో శానిటరీ విభాగంలో పనిచేస్తూ ఈ ఏడాది జూన్‌లో రిటైరైంది. ఈమె భర్త వడ్డాది నాగరాజు ఆర్టీసీలో పనిచేస్తూ 2017లో చనిపోయాడు. ఇతను రాంపల్లి పాపారావు వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. భర్త చెల్లించాల్సిన అప్పునకు గానూ పాపారావుకు నూకమ్మ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. ఆ తర్వాత వడ్డీతో సహా అప్పు చెల్లించేసింది. ఆ సమయంలో పాపారావు నుంచి తాను రాసిచ్చిన ప్రామిసరీ నోటు తీసుకోవడం మరిచింది. ఇప్పుడదే ఆమెకు శాపంగా మారింది. ఇటీవల ఆమెకు కోర్టు నుంచి రెండు లీగల్ నోటీసులు వచ్చాయి. అందులో ఒకటి రూ.7 లక్షలు చెల్లించాలంటూ మంగళగిరికి చెందిన పలతోటి మరియరాజు నుంచి కాగా.. మరొకటి గుణదలకు చెందిన జాదు రాజేశ్వరి అనే మహిళ నుంచి రూ.లక్షలు అప్పు చెల్లించాలని ఉంది. దీంతో ఆమెకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛను నిలిచిపోయింది. కాల్‌మనీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఆమె అనారోగ్యంతో మంచం పట్టింది. మందులకు కూడా బ్యాంకు నుంచి డబ్బు తీసుకోలేని దుస్థితిలో ఉంది. -
ప్రామిసరీ నోట్ అంటే..!
కాకినాడ లీగల్ : అప్పు తీసుకునేటప్పుడు రుణం ఇచ్చేవారికి తీసుకునేవారు ప్రామిసరీ నోట్ రాసి ఇస్తూంటారు. ఈ నోట్‌పై అవగాహన లేక కొందరు మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై సరైన అవగాహన ఉంటే మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశముంటుంది. ప్రామిసరీ నోట్ (ప్రోనోట్) అంటే రాతపూర్వకమైన పత్రమని అర్థం. ప్రామినరీ నోట్లో డబ్బు ఇచ్చే వ్యక్తి (రుణదాత), అప్పు తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) పూర్తి పేర్లు, చిరునామాలు ఉండాలి. డబ్బు ఎంత మొత్తం అనేది తప్పనిసరిగా అక్షరాల్లో రాసుకోవాలి. ప్రోనోట్ రాసిన స్థలం, తేదీని రాయాలి. డబ్బు తీసుకునే వ్యక్తి ప్రోనోట్ కింది భాగంలో అంటించిన రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చేయాలి. చదువురానివారు ఎడమచేతి బొటనవేలి ముద్రలను వేయాలి. ప్రామిసరీ నోట్‌కు సాక్షులు ఉండి తీరాలని చట్టంలో లేదు. కాకపోతే ఇద్దరు సాక్షుల సంతకాలు తీసుకోవడం మంచిది. అలాగే రుణగ్రహీతకు ప్రోనోట్ రాసిన వ్యక్తి సంతకం చేయడం మంచిది. నిర్ణీత మొత్తాన్ని ఒక వ్యక్తి లేదా అతడిచే ఆర్డర్ పొందిన వ్యక్తికి లే దా ఆ పత్రంపై డబ్బు తీసుకోవడానికి దానిని తెచ్చిన వ్యక్తికి చెల్లిస్తానని వాగ్దానం చేసి ఉండాలి. షరతులు మాత్రం ఉండకూడదు. ప్రతిఫలం (ఇచ్చిన సొమ్ము) నగదు ద్వారా ముట్టినదో, చెక్కు ద్వారా ముట్టినదో రాయాలి. ప్రామిసరీ నోట్ రాతపూర్వకంగా ఉండాలి. ప్రామిసరీ నోట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రూపాయి నుంచి ఎంత రు ణానికైనా ఒక రూపాయి రెవె న్యూ స్టాంప్ సరిపోతుంది. కాలపరిమితి ప్రామిసరీ నోట్‌పై ఉన్న తేదీ నుంచి మూడేళ్లు, ప్రామిసరీ నోట్ రాసిన తేదీ నుంచి మూడేళ్లలోపు రుణగ్రహీత సొమ్ము చెల్లించకుంటే కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఆపైకాలం దాటితే కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు. మూడేళ్ల కాలంలో రుణగ్రహీత ఏమైనా సొమ్ము చెల్లిస్తే ప్రామిసరీ నోట్ వెనుక ఎంత చెల్లించిందీ రాసి, సంతకం చేసి తేదీ వేయాలి. దీంతో ఆ తేదీ నుంచి తిరిగి మూడేళ్లు ప్రోనోట్‌కు కాలపరిమితి ఉంటుంది. వడ్డీ : అప్పుగా తీసుకున్న సొమ్ముకు రూ.2 మాత్రమే వడ్డీగా వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేయడం నేరం. రుణదాత బాధ్యతలు ప్రామిసరీ నోట్‌పై కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా చూసుకోవడం మంచిది. రుణగ్రహీత సంతకాలను ఫోర్జరీ చేసి ప్రామిసరీ నోట్లు తయారు చేయడం నేరం. రుణగ్రహీత డబ్బు అప్పు గా తీసుకుని మూడేళ్లలోవు చెల్లించకుంటే న్యాయవాది ద్వారా అతడి కి నోటీసు ఇచ్చి కోర్టులో కేసు దాఖలు చేయాలి. రుణగ్రహీత బాధ్యతలు ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేస్తే ఇబ్బందులు తప్పవు. తాను అప్పుగా తీసుకున్న సొమ్మును స కాలంలో తీర్చాలి. తన ఆర్థిక శక్తి ఎంత ఉం దో అంతవరకే అప్పు తీసుకోవడం మంచిది. ప్రోనోట్ బదిలీ ప్రామిసరీ నోట్‌ను రుణదాత తనకు కావాల్సిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు. రుణగ్రహీత నుంచి అప్పు వసూలు చేసుకునే హక్కును బదిలీ చేయవచ్చు. -
బాండ్లు కాదు.. ప్రామిసరీ నోట్లు!
టీ సర్కార్ మరో కొత్త ఆలోచన సాక్షి, హైదరాబాద్: రైతులు రుణాలు చెల్లిస్తే... వారికి రెండు మూడేళ్లలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా హామీ పత్రం (పామిసరీ నోట్) ఇవ్వనున్నట్లు సమాచారం. రైతులు బ్యాంకులకు రుణం చెల్లించి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తీసుకుని వస్తే.. ప్రభుత్వం ఒక బాండును రైతుకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. అయితే బాండ్లు జారీ చేయడం వల్ల అధికారికంగా అప్పు తెచ్చుకోవడమేనన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులకు బాండ్ల రూపంలో కాకుండా హామీ పత్రం (ప్రామిసరీ నోట్) ఇచ్చే అంశాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండు మూడు సంవత్సరాల్లోగా రైతులకు ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని యోచనలో ఉంది. తగ్గనున్న భారం! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రుణ మాఫీ భారం తగ్గుతోంది. ప్రస్తుతం అంచనా వేసిన రూ. 17,337 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు తగ్గనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రుణమాఫీ అమలుకు జారీ చేసిన మార్గదర్శకాల తరువాత బ్యాంకర్లు రైతులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకుల వారీగా, గ్రామం వారీగా లెక్కల క్రోడీకరణ పనిని ప్రారంభించిన విషయం విదితమే. ఒక రైతుకు మూడు నాలుగు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు, ఒక కుటుంబంలో ఉన్న అకౌంట్లను పరిశీలిస్తున్న బ్యాంకులు వీటన్నింటినీ ఒకే అకౌంట్‌గా మార్చాలని యోచిస్తున్నారు. ఇలా మార్చిన పక్షంలో ఒక కుటుంబానికి లక్ష రూపాయల వరకే మాఫీ చేయడం వీలవుతుందని, దీంతో ఈ భారం రెండువేల కోట్ల మేరకు తగ్గుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటి నుంచి జాబితా సిద్ధం బ్యాంకుల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి మంగళవారం లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే రుణాలు రీ షెడ్యూల్ చేయడానికి వంద మండలాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. మరో వెయ్యికోట్ల రూపాయలకు వెసులుబాటు కలుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి వారం పదిరోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 31వ తేదీలోగా బ్యాంకుల నుంచి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారం వచ్చిన తరువాత ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై.. నిధులు ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.