Clemency prisoner
-
క్షమాభిక్ష కోసం ఎదురుచూపు
క్షణికావేశంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఎంతో మంది ఖెదీలు జైళ్లలో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు, భార్యా, బిడ్డలకు దూరమై మానసిక ఆవేదన చెందుతున్నారు. జీవిత ఖైదీలలో అర్హులైన వారికి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి క్షమాభిక్ష ద్వారా విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఖైదీలకు క్షమా భిక్ష జీఓ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. రెడ్డిపల్లి ఓపన్ ఎయిర్ జైలులో మొత్తం 52 మంది ఖైదీలున్నారు. ఇందులో ఏడేళ్ల శిక్షతో పాటు మూడేళ్ల రెమిషన్ కలిపి మొత్తం పదేళ్ల శిక్ష అనుభవించిన 31 మంది ఖైదీలు క్షమాభిక్ష జీఓ వస్తే విడుదలయ్యేందుకు ఎదురుచూస్తున్నారు. అనంతపురం, బుక్కరాయసముద్రం: జీవిత ఖైదీల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న జీఓ 6 ప్రకారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఏడేళ్ల శిక్షతో పాటు మూడేళ్ల రెమిషన్ కలిగిన వారు క్షమాభిక్షకు అర్హులు. 65 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఐదేళ్ల శిక్షతో పాటు రెండేళ్ల రెమిషన్ కలిగి ఉండాలి. మహిళలు అయితే ఐదేళ్ల శిక్షతో పాటు రెండేళ్ల రెమిషన్ కలిగి ఉండాలి. పురుషులు ఫ్యామిలీ కేసులు అయితే 14 సంవత్సరాల శిక్షతో పాటు 6 సంవత్సరాల రెమిషన్ కలిగి ఉండాలి. మహిళలు అయితే పది సంవత్సరాల శిక్షతో పాటు నాలుగు సంవత్సరాల రెమిషన్ కలిగి ఉండాలి. స్వలాభం కోసం హత్య చేసిన వారు సెక్షన్ 379 నుంచి 402 సెక్షన్ వరకు కేసులు ఉన్నవారు 14 సంవత్సరాలు శిక్షతో పాటు 6 సంవత్సరాల రెమిషన్ కలిగి ఉండాలి. క్షమాభిక్షకు అనర్హతలు ఇవే.. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులను చంపిన వారు క్షమాభిక్షకు అనర్హులు. 16 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న బాలురను చంపడం, 18 సంత్సరాల లోపు ఉన్న బాలికలను చంపిన వారు కూడా అనర్హులే. కిడ్నాప్, రేప్‌కేసులో శిక్ష అనుభవిస్తున్న వారికీ క్షమాభిక్ష లేదు. జైలులో క్రమ శిక్షణ ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు విడుదలకు అవకాశం ఉండదు. గంజాయి కేసులో జీవిత ఖైదు పడిన వారు అనర్హులు. తీవ్రవాదులకు క్షమాభిక్ష వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల వల్ల 17 మంది జీవిత ఖైదీలు క్షమాభిక్షకు దూరమవుతున్నారు. 12 సంత్సరాలు శిక్ష పూర్తి చేసినా.. ఈ వ్యక్తి ప్రకాశం జిల్లా కందుకూరు మండలానికి చెందిన రామస్వామి. భార్యను చంపిన కేసులో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొదట్లో రామస్వామికి పోలీస్ స్టేషన్లో 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. భార్య మూడు నెలలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో పోలీసులు తిరిగి 302, 498–ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏడు సంవత్సరాల శిక్షతో పాటు మూడు సంవత్సరాల రెమిషన్ పూర్తి చేసుకున్నవారు క్షమాభిక్షకు అర్హులని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తాను 12 సంవత్సరాలు శిక్ష పూర్తి చేసుకున్నానని రామస్వామి చెబుతున్నాడు. మార్గదర్శకాల నిబంధనల వల్ల తాను క్షమాభిక్షకు నోచుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకూ క్షమాభిక్ష ప్రసాదించి ఉంటే పిల్లల వద్దకు చేరుకునేవాడినని వాపోయాడు. అర్హుల జాబితాను సిద్ధం చేశాం ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్షకు అర్హులైన వారి జాబితా సిద్ధం చేసుకుని రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ కార్యాలయానికి పంపించాము. జీవిత ఖైదీల విడుదల ప్రభుత్వం చేతుల్లో ఉంది. జీఓ సంబంధించి ఫైలును జైళ్లశాఖ నుంచి కేబినెట్‌కు, అక్కడ నుంచి గవర్నర్‌కు, సీఎంకు వెళ్తుంది. అక్కడ నుంచి విడుదలకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంటుంది. – సుదర్శన్, ఇన్చార్జి సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు, రెడ్డిపల్లి, బుక్కరాయసముద్రం మండలం -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు) : సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు విశాఖ కేంద్ర కారాగారం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు తరబడి నాలుగు గోడల మధ్య గడుపుతూ కుటుంబీకులకు దూరంగా ఉన్న వారు ఎట్టకేలకు ఆదివారం విముక్తి పొందారు. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన క్షమాబిక్ష జీవోకి ఇప్పుడు మోక్షం కలిగింది. ఈ ఏడాది జనవరి 24న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీంతో ఆ జీవో ప్రకారం ఇక్కడి జైలు అధికారులు అర్హులైన జీవిత ఖైదీల జాబితా తయారుచేసి జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. అప్పటి నుంచి వీరంతా ఎప్పుడు విడుదలవుతామా అంటూ ఎదురు చూశారు. రిపబ్లిక్ డే, ఉగాదికి విడదులవుతామని ఆశించారు. ఆ రెండు గడువులు దాటిపోయాయి. ఎట్టకేలకు ఆ ఖైదీలకు ఆదివారం మోక్షం కలిగింది. కానీ జైలు అధికారులు పంపించిన జాబితాలోని నలుగురిని ఉన్నతాధికారులు అనర్హులుగా గుర్తించి విడదులైన జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. ప్రభుత్వం క్షమాభిక్షపై రాష్ట్రంలో విడుదల చేసిన 49 మంది జీవిత ఖైదీలలో ఇక్కడి నుంచి 13 మందికి విముక్తి కలిగింది. దీంతో మధ్యాహ్నం 1 గంటకు వారంతా ఆనందోత్సాహాలతో జైలు నుంచి బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. వీరిలో ఓ మహిళా ఖైదీ తన రెండేళ్ల కుమార్తెతో విడుదల కావడం విశేషం. విడుదలైన వారిలో విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు 9 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారు చెరో ఒక్కరు చొప్పున ఉన్నారు. క్షమాబిక్ష జీవో నిబంధనల ప్రకారం వీరందరూ రూ.50వేలు బ్యాండు పూచీకత్తుపై విడుదలయ్యారు. ప్రతి మూడు నెలలకు ఓసారి వీరంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది. కొబ్బరికాయలు కొట్టిన ఖైదీలు విడుదలైన ఆనందంలో ఖైదీలు జైలు ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చెప్పులు పక్కన విడిచి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరూ జైలుకు దండం పెట్టారు. ఇది ఒక దేవాలయం లాంటిదని, మాకు జీవిత పాఠం నేర్పిందని, బాహ్యప్రపంచంలో నీతిగా బతుకుతామంటూ దండం పెట్టుకొన్నారు. విడుదలైన జీవిత ఖైదీలు వీరే విశాఖపట్నం జిల్లా నుంచి జి.శ్రీనివాస్(నాతవరం), ఎం.అప్పారావు (జి.మాడుగుల), ఎస్.సుబ్బారావు(పెదబయిలు), ఎన్.అప్పన్న (నాతవరం), ఎన్.శ్రీను(నాతవరం), ఆర్.అప్పనాయుడు(అచ్చుతాపురం), ఎ.నాయుడు(మునగపాక), బి.గోవిందరాజు(గోపాలపట్నం), ఆర్.శ్యామల(గాజువాక) విడుదలయ్యారు. విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారం రెడ్డి వీధికి చెందిన జి.కృష్ణ, పెదసాము ప్రాంతానికి చెందిన ఆర్.సీతారాం, శ్రీకాకుళం జిల్లా గట్లభద్రకు చెందిన ఎం.బాబూరావు, కడప జిల్లాకు చెందిన ఎస్.రవికుమార్ విడుదలయ్యారు. మళ్లీ నేరం చేస్తే జీవితాంతం జైలులోనే జైలు నుంచి విడుదలైన జీవిత ఖైదీలకు డిప్యూటీ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు నిబంధనలు వివరించారు. క్షమాభిక్ష జీవో ప్రకారం ఇప్పుడు విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాంటి వారికి క్షమాభిక్ష రద్దయి జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. బయట ప్రపంచంలో గౌరవంగా జీవించాలని సూచించారు. విడుదలైన వారంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ప్రతి మూడు నెలలకు ఓసారి వెళ్లి సంతకం చేయాలన్నారు. ఇప్పుడు ఇక్కడ మిగిలిన శిక్ష ముగిసినంతవరకు పోలీస్ స్టేషన్లో మూడు నెలలకు ఓసారి సంప్రదించాల్సిందేనని సూచించారు. -
నాకూ దుస్తులు కుట్టండి
తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాధించే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన రాజప్ప మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కూడా జైల్లో ఉన్నారని, అనంతరం ఆయన జైలులో ఖైదీ సంక్షేమానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కేంద్ర కారాగారంలో ఖైదీల ఆరోగ్యం కోసం 50 పడకల హాస్పిటల్ నిర్మించేందుకు చర్యటు చేపట్టామన్నారు. గత ఏడాది జైల్ ఉత్పత్తుల ద్వారా రూ.33.63 లక్షల లాభాలు వచ్చాయని తెలిపారు. పెట్రోల్ అమ్మకాల ద్వారా రూ1.45 కోట్ల నికర లాభాలు ఆర్జించినట్టు తెలిపారు. ఖైదీలను కోర్టులకు, హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లేటప్పుడు ఎస్కార్ట్ సమస్య ఉందని దానిని పరిష్కరిస్తామని తెలిపారు. పెరోల్ విషయంలో గడువు 45 రోజులు పెంచామన్నారు. ముందుగా గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్, రెండో డివిజన్ కార్పొరేటర్ పీతాని లక్ష్మీకుమారి, మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం క్రైం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌ను సందర్శించిన హోమ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సెంట్రల్ జైల్లో ఉన్న టైలరింగ్ యూనిట్‌ను పరిశీలించారు. యూనిట్లో ఖైదీలు కుట్టే రెడీమేడ్ దుస్తులను పరిశీలించి వారి నైపుణ్యానికి ముచ్చట పడ్డారు. హోమ్ మంత్రి కూడా తనకు దుస్తులు తయారు చేయాలని కొలతలు ఇచ్చారు. దీనితో ఆయన వెంట ఉన్న నేతలు సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ, తదితరులు కూడా తమతమ కొలతలు ఇచ్చారు. అలాగే ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీలకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు హోం మంత్రి చినరాజప్ప సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జైల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని కాకినాడ క్రైం: అహింసాయుత సిద్ధాంతంతో ప్రపంచ ప్రాచుర్యం పొందిన గొప్ప దార్శనికుడు మహాత్మాగాంధీ అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీకి నివాళులర్పించారు. స్వాతంత్య్రం సాధనలో మహాత్మాగాంధీ జాతికి చూపిన అహింసాయుత మార్గం జాతి ఎన్నటికీ మరువదన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, ఏఎస్పీ ఏఆర్ వీఎస్ ప్రభాకరరావు, ఎస్బీ డీఎస్పీలు ఆర్.విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, ఆర్ఐ ఏఆర్ రాజా పాల్గొన్నారు. -
జాప్యానికి సుప్రీం జవాబు
క్షమాభిక్ష దరఖాస్తును గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ సమాచారాన్ని ఖైదీకి గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయాలన్న నియమం ఏదీ జైలు మాన్యువల్స్‌లో లేదు. కానీ 161వ అధికరణ ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకునే హక్కు ఖైదీకి ఉన్నప్పుడు, గవర్నర్ నిర్ణయం ఏమిటో తెలుసుకునే హక్కు కూడా ఆ ఖైదీ కలిగి ఉంటాడు. రాష్ట్రపతి తిరస్కరించినా ఇదే వర్తిస్తున్నది. కేసుల విచారణలో జాప్యం ఉండకూడదు. అధిక సంఖ్యలో ఉన్న కేసులతో ఇలాంటి జాప్యం తప్పడం లేదు. దీనిని అర్థం చేసుకో వచ్చు. కానీ, క్షమాభిక్ష దరఖాస్తుల పరిశీలనకి సంవత్సరాల కొద్దీ సమయం తీసుకుంటే అర్థం చేసుకోవడం కాదు, ఆందోళన తప్పదు. ఉరిశిక్ష పడిన వారి విషయంలో ఇది ఎంత కలవరపాటుకు గురిచేసే అంశమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి జాప్యంతో శిక్ష పడిన వారే కాదు, వారి స్నేహితులూ కుటుంబ సభ్యులూ అనుక్షణం పడే వేదన మాటలకు అందేది కాదు. అందుకే, 21.1.2014న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మరణ శిక్షల ప్రక్రియలో ఓ మైలురాయి వంటిదనిపిస్తుంది. ఆశిక్ష పడిన 15 మంది దాఖలు చేసుకున్న 13 రిట్ దరఖాస్తులను సుప్రీంకోర్టు ఆమోదించి, వారి శిక్షలను జీవిత కాల శిక్షలుగా మార్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశి వం, న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, శివకీర్తి సింగ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. దేవేందర్ పాల్‌సింగ్ బుల్లార్ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని రద్దు చేసి వారికి కూడా ఈ తీర్పును వర్తింపజేసింది. క్షమాభిక్ష కోరడమూ హక్కే దేవేందర్‌పాల్ సింగ్ బుల్లార్ వర్సెస్ ఢిల్లీ కేసులో మరణశిక్షపడిన ఖైదీ తన మరణశిక్షను తగ్గించమని 2003లో రాష్ట్రపతికి దరఖాస్తు చేశాడు. 8 సంవత్సరాల తరువాత దానిని రాష్ట్రపతి తోసిపుచ్చారు. క్షమాభిక్ష దరఖాస్తును తోసిపుచ్చడంలో తీవ్రమైన జాప్యం ఉందన్న కారణంగా తన మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చమని ఆ ఖైదీయే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. చట్ట ప్రకారమే మరణశిక్ష విధించినందువల్ల ఆ విన్నపాన్ని మన్నించలేమని కోర్టు (న్యాయమూర్తులు ఎస్.జె.ముకోపాధ్యాయ, జి.ఎస్.సింఘ్వీలతో కూడిన ధర్మా సనం) అతని కేసుని 12 ఏప్రిల్ 2013న తోసిపుచ్చింది. ఆ తరువాత రెండు వారాలకే అదే డివిజన్ బెంచి మహేంద్రనాథ్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా కేసులో 12 సంవత్సరాల జాప్యం కారణంగా మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చింది. 12 సంవత్సరాల తరువాత క్షమాభిక్ష దరఖాస్తుని తోసిపుచ్చడానికి ఎలాంటి కారణాలు చూపకపోవడం మన్నించరాని విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చివరలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఇది. ‘రాజ్యాంగంలోని 72/161 అధికరణల ప్రకారం క్షమాభిక్ష కోరడమనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అంతేకానీ ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారం, విచక్షణాధికారం ప్రకారం ఇచ్చే హక్కు కాదు. రాజ్యాంగ బద్ధంగా చేయాల్సిన విధులని అత్యంత జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ రకంగా నిర్వర్తించనప్పుడు రాజ్యాంగ విలువలు కాపాడటం కోసం కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. విశాల ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో ‘ప్రతీకారానికి’ ఎలాంటి విలువాలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ముద్దాయికి కూడా యథార్థ రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఆ హక్కుని రక్షించాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. అందుకని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగంలోని 72/161 అధికరణలలో జోక్యం చేసుకుంటున్నట్టు కాదు. మరణశిక్ష పడిన ఖైదీలకు రాజ్యాంగం ప్రసాదిం చిన యథార్థ రక్షణే’. దరఖాస్తు చేసే పద్ధతి క్షమాభిక్ష దరఖాస్తులను రాష్ట్రపతి ముందు పెట్టడానికి భారత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించినప్పటికి అవి సరిగ్గా అమలు కావడంలేదు. రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్షని తోసిపుచ్చిన తరువాత ఎవరైనా రాష్ట్రపతిని ఆశ్రయిస్తే ఆ కేసుకు సంబంధించిన రికార్డును, విచారణ కోర్టు తీర్పును, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను నిర్దేశించిన కాలపరిమితిలో హోంమంత్రిత్వ శాఖకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సూచనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర శాఖలు పాటించడం లేదు. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అన్నట్టు రికార్డుని పంపిస్తున్నాయి. ఈ సూచనలు కఠినంగా పాటించి జాప్యాన్ని నివారించాలి. ఈ వివరాలు హోం మంత్రిత్వ శాఖకు అందిన తరువాత తమ సిఫార్సులను, లేదా అభిప్రాయాలను తగిన సమయానికి రాష్ట్రపతికి పంపించాలి. వీటిని పంపినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి స్పందనా లేకుంటే, మళ్లీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి రాష్ట్రపతి నిర్ణయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా హోం మంత్రిత్వ శాఖపైనే ఉంది. విన్నపాన్ని తోసిపుచ్చితే... క్షమాభిక్ష దరఖాస్తుని గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ సమాచారాన్ని ఖైదీకి గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయాలన్న నియమం ఏదీ జైలు మాన్యువల్స్‌లో లేదు. కానీ 161 అధికరణ ప్రకారం గవర్నర్‌కి క్షమాభిక్ష పెట్టు కునే హక్కు ఖైదీకి ఉన్నప్పుడు, గవర్నర్ నిర్ణయం ఏమిటో తెలుసుకునే హక్కు కూడా ఆ ఖైదీ కలిగి ఉంటాడు. రాష్ట్రపతి తిరస్కరించినా ఇదే వర్తిస్తున్నది. కానీ దరఖాస్తు తిరస్కరణ విషయాన్ని ఖైదీకి అతని కుటుంబ సభ్యులకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా తెలియజేయాలి. క్షమాభిక్ష సమాచారం అందించాలన్న నియమం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఖైదీకి మౌఖికంగా మాత్రమే తెలియజేస్తు న్నారు. 72 అధికరణ ప్రకారం క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేయడం రాజ్యాంగ హక్కు కాబట్టి, దానిని తిరస్కరిస్తే ఆ సమాచారం కూడా తెలుసుకునే హక్కు ఖైదీకి ఉంటుంది. తమ తమ దరఖాస్తులను గవర్నర్ లేదా రాష్ట్రపతి తిరస్కరించినప్పుడు వాటి ప్రతిని పొందే హక్కు ఖైదీలకు ఉంది. శిక్ష అమలు విషయాన్ని 14 రోజుల ముందు తెలియజేయాలి. శిక్ష అమలు తేదీ గురించి ఎన్ని రోజుల ముందు తెలియజేయాలన్న విషయం చాలా జైలు మాన్యువల్స్‌లో ఏక సూత్రం కానరాదు. కొన్నింటిలో ఒకరోజు ముందు తెలియజేయాలనీ, ఇంకొన్ని కనీసం 14 రోజుల ముందు తెలియజేయాలనీ అంటున్నాయి. క్షమాభిక్ష తిర స్కరించిన తేదీకీ, శిక్ష అమలు తేదీకీ మధ్యన 14 రోజుల కనీస గడువు ఉండాలి. ఆరోగ్య నివేదికలూ కావాలి ఖైదీ మానసిక శారీరక ఆరోగ్యాలను బట్టి శిక్ష అమలును నిలిపే అధికారం చాలా జైలు మాన్యువల్స్ పర్యవేక్షణ అధికారులకి కల్పిస్తున్నాయి. దరఖాస్తు తిరస్క రించిన తరువాత, ఖైదీలకి వైద్యపరీక్షలు జరిపి వారి శారీరక మానసిక ఆరోగ్యం గురించిన నివేదికలను జైలు అధికారులు తీసుకోవాలి. ఖైదీ శారీరక, మానసిక ఆరోగ్యం గురించి సూపరింటెండెంట్ సంతృప్తి చెందాలి. ఆ విధంగా లేనప్పుడు శిక్ష అమలును నిలిపివేసి ఆ ఖైదీని మెడికల్ బోర్డుకి పంపించి నివేదికను తెప్పిం చుకోవాలి. తదుపరి చర్యల కోసం ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. మరణశిక్ష పడినవారిలో ఎక్కువ మంది బీదవాళ్లే. వారి దగ్గర తీర్పు ప్రతు లు, ఇతర కోర్టు కాగితాలు ఉండవు. అప్పీళ్లకీ, క్షమాభిక్ష దరఖాస్తులను పెట్టుకోవ డానికి, క్షమాభిక్ష తిరస్కరణ తరువాత న్యాయపరమైన ఇతర చర్యలకు ఈ కాగితాలు అవసరం. ఈ హక్కులను వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలని వారంలోగా ఖైదీకి అందే విధంగా చర్యలు తీసుకోవాలి. శిక్ష అమలుకు ముందు ఖైదీ తన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చివరిసారి కలవడానికి అవకాశాన్ని కొన్ని రాష్ట్రాల మాన్యువల్స్ మాత్రమే కల్పిస్తున్నాయి. ఉరిశిక్ష తరువాత విధిగా శవ పరీక్షలు జరిపించాలని చెప్పే నిబంధనలు జైలు మాన్యువల్స్‌లో లేవు. చట్టం నిర్దేశించిన ప్రకారం శిక్ష అమలైనదీ లేనిదీ తెలుసు కోవడానికి ఈ శవపరీక్షలు ఉపయోగపడతాయి. మరణశిక్ష పడిన వారికీ, ఆ శిక్షపడే అవకాశం ఉన్న వారికీ సుప్రీంకోర్టు తీర్పు పెద్ద ఉపశమనం. ఉరి వంటి శిక్ష పడటం వేరు. అంత తీవ్రమైన శిక్ష అమలు కోసం ఎదురుచూడటం వేరు. ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తూ క్షణక్షణం చావడం కన్నా శిక్ష ను అనుభవించడం మేలనిపిస్తుంది. ఉరిశిక్షని కోర్టులు రద్దు చేయకపోయినా ఈ తీర్పుతో మేలు చేశాయి. - మంగారి రాజేందర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి -
‘క్షమాభిక్ష’పై జాప్యం చేస్తే..
మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించవచ్చు: సుప్రీం కీలక తీర్పు 15 మంది ఖైదీల మరణశిక్ష జీవితఖైదుకు తగ్గింపు మానసిక అనారోగ్యంతో ఉన్న ఖైదీలకూ మరణశిక్ష సరికాదన్న బెంచ్ న్యూఢిల్లీ: మరణశిక్ష నేపథ్యంలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుని సుదీర్ఘకాలంగా దానిపై నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఖైదీలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త. మరణశిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయమై నిర్ణయం తీసుకోవడంలో మితిమీరిన, కారణాల్లేని ప్రభుత్వ జాప్యం.. వారి శిక్షను తగ్గించేందుకు ప్రాతిపదిక కావచ్చునంటూ సుప్రీంకోర్టు చెప్పింది. మరణశిక్ష పడిన 15 మంది ఖైదీలు దాఖలు చేసిన 13 పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు మంగళవారం మైలురారుు వంటి తీర్పు వెలువరించింది. తమ క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయంలో జరిగిన జాప్యాన్ని, తమ మానసిక వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే అడవిదొంగ వీరప్పన్ అనుచరులు నలుగురు సహా మొత్తం 15 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా సుప్రీం మార్చింది. మరణశిక్ష అమలులో సాగదీత... మృత్యువు నీడలో క్షమాభిక్షపై నిర్ణయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే సదరు నేరస్తులపై అమానవీయమైన రీతిలో ప్రభావం చూపుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నేరస్తుల మరణశిక్షను కూడా ఖైదీ మానసిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని జీవితఖైదుకు తగ్గించవచ్చని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, శివకీర్తి సింగ్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. మరణశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వాధికారులకు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. జీవించే హక్కుకు సంబంధించిన రాజ్యాంగంలోని 21వ అధికరణ ం కేవలం శిక్ష ప్రకటనతోనే ముగియడం లేదని, సదరు శిక్ష అమలు వరకు విస్తరించిందనే విషయం తెలిసిందేనని ధర్మాసనం పేర్కొంది. ఖైదీలకు సంబంధం లేని పరిస్థితుల కారణంగా జరిగే జాప్యం మరణశిక్ష తగ్గింపును తప్పనిసరి చేస్తోందని చెప్పింది. మార్గదర్శకాలు, తీర్పులోని ముఖ్యాంశాలు... హోం శాఖ గణాంకాల ప్రకారం సగటున ఒక్కో క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించేందుకు కేంద్రం 8 నుంచి 9 ఏళ్ల సమయం తీసుకుంటోంది. ఓ కేసులో అయితే ఏకంగా 14 ఏళ్ల సమయం తీసుకుంది. 1980 వరకు ఈ పిటిషన్లను కనిష్టంగా 15 రోజుల్లో, గరిష్టంగా 10 నుంచి 11 నెలల్లో పరిష్కరించారు. 1980-88 మధ్యకాలంలో కాలవ్యవధి గణనీయంగా పెరిగి సగటున నాలుగేళ్లకు చేరుకుంది. 1989-97 మధ్య ఇది సగటున ఐదు నెలలు తగ్గినా, మళ్లీ భారీ జాప్యం పునరావృతమైంది. క్షమాభిక్ష కోరడమన్నది ఖైదీలకున్న రాజ్యాంగపరమైన హక్కు. అది అధికారుల విచక్షణపై ఉండదు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవండంలో దీర్ఘకాల జాప్యం వారి ప్రాథమిక హక్కులను హరించడమే. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువేదీ లేదన్న కేంద్రం వాదన సరికాదు. భారతీయ శిక్షా స్మృతి లేదా ఉగ్రవాద వ్యతిరేక చట్టం దేనికింద శిక్ష పడినప్పటికీ శిక్ష తగ్గంచవచ్చు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారం.. ఏదో దయ, ప్రత్యేక హక్కుకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగపరమైన విధి. క్షమాభిక్ష పిటిషన్లను ఇన్ని రోజుల్లోగా పరిష్కరించాలని గవర్నర్లు లేదా రాష్ట్రపతికి నిర్దేశించలేం. రాష్ట్రపతికి సమయూన్ని నిర్ధారించలేనప్పటికీ సంబంధిత మంత్రిత్వ శాఖను మాత్రం.. జాప్యాన్ని నివారించే దిశగా నిబంధనలు పాటించాల్సిందిగా కచ్చితంగా కోరగలం. మరణశిక్ష పడినవారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురైతే ఆ విషయూన్ని ఖైదీల కుటుంబసభ్యులకు తప్పనిసరిగా తెలియజేయూలి. ఉరిశిక్ష పడిన ఖైదీలు సహా ఏ ఖైదీకీ ఏకాంతవాస శిక్ష అమలుచేయకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన సమాచారం అందిన తర్వాత, ఉరిశిక్ష అమలు చేయడానికి మధ్య కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి. ఈ తీర్పు కర్ణాటకకు చెందిన 8 మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. వీటిలో కలప స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు సైమన్, జ్ఞానప్రకాష్, బిలవేంద్ర, మిసకార మాదయ్యల కుటుంబాలు ఉన్నారుు. సైమన్ తదితరులు తమిళనాడులో 22 మంది కర్ణాటక పోలీసులను మందుపాతరతో హతమార్చిన కేసులో దోషులు. ఈ తీర్పుతో 20 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న వీరప్పన్ అనుచరులను విడుదల చేయూలని అతని భార్య ముత్తులక్ష్మి కోరారు. తాజా తీర్పు రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన సంతన్, మురుగన్, పెరారివలన్ సహా పలువురు మరణశిక్ష పడిన ఖైదీలకు సైతం శిక్ష తగ్గేందుకు మార్గం సుగమం చేసింది.