‘క్షమాభిక్ష’పై జాప్యం చేస్తే.. | Supreme Court commutes 15 death sentences | Sakshi
Sakshi News home page

‘క్షమాభిక్ష’పై జాప్యం చేస్తే..

Published Wed, Jan 22 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

‘క్షమాభిక్ష’పై జాప్యం చేస్తే..

‘క్షమాభిక్ష’పై జాప్యం చేస్తే..

మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించవచ్చు: సుప్రీం కీలక తీర్పు
15 మంది ఖైదీల మరణశిక్ష జీవితఖైదుకు తగ్గింపు
మానసిక అనారోగ్యంతో ఉన్న ఖైదీలకూ మరణశిక్ష సరికాదన్న బెంచ్

 
 న్యూఢిల్లీ: మరణశిక్ష నేపథ్యంలో క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుని సుదీర్ఘకాలంగా దానిపై నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఖైదీలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త. మరణశిక్ష పడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయమై నిర్ణయం తీసుకోవడంలో మితిమీరిన, కారణాల్లేని ప్రభుత్వ జాప్యం.. వారి శిక్షను తగ్గించేందుకు ప్రాతిపదిక కావచ్చునంటూ సుప్రీంకోర్టు చెప్పింది.
 
 మరణశిక్ష పడిన 15 మంది ఖైదీలు దాఖలు చేసిన 13 పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు మంగళవారం మైలురారుు వంటి తీర్పు వెలువరించింది. తమ క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయంలో జరిగిన జాప్యాన్ని, తమ మానసిక వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే అడవిదొంగ వీరప్పన్ అనుచరులు నలుగురు సహా మొత్తం 15 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా సుప్రీం మార్చింది.
 
 మరణశిక్ష అమలులో సాగదీత... మృత్యువు నీడలో క్షమాభిక్షపై నిర్ణయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే సదరు నేరస్తులపై అమానవీయమైన రీతిలో ప్రభావం చూపుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నేరస్తుల మరణశిక్షను కూడా ఖైదీ మానసిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని జీవితఖైదుకు తగ్గించవచ్చని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, శివకీర్తి సింగ్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. మరణశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వాధికారులకు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. జీవించే హక్కుకు సంబంధించిన రాజ్యాంగంలోని 21వ అధికరణ ం కేవలం శిక్ష ప్రకటనతోనే ముగియడం లేదని, సదరు శిక్ష అమలు వరకు విస్తరించిందనే విషయం తెలిసిందేనని ధర్మాసనం పేర్కొంది. ఖైదీలకు సంబంధం లేని పరిస్థితుల కారణంగా జరిగే జాప్యం మరణశిక్ష తగ్గింపును తప్పనిసరి చేస్తోందని చెప్పింది.
 
 మార్గదర్శకాలు, తీర్పులోని ముఖ్యాంశాలు...
   హోం శాఖ గణాంకాల ప్రకారం సగటున ఒక్కో క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించేందుకు కేంద్రం 8 నుంచి 9 ఏళ్ల సమయం తీసుకుంటోంది. ఓ కేసులో అయితే ఏకంగా 14 ఏళ్ల సమయం తీసుకుంది.
   1980 వరకు ఈ పిటిషన్లను కనిష్టంగా 15 రోజుల్లో, గరిష్టంగా 10 నుంచి 11 నెలల్లో పరిష్కరించారు. 1980-88 మధ్యకాలంలో కాలవ్యవధి గణనీయంగా పెరిగి సగటున నాలుగేళ్లకు చేరుకుంది. 1989-97 మధ్య ఇది సగటున ఐదు నెలలు తగ్గినా, మళ్లీ భారీ జాప్యం పునరావృతమైంది.
 
   క్షమాభిక్ష కోరడమన్నది ఖైదీలకున్న రాజ్యాంగపరమైన హక్కు. అది అధికారుల విచక్షణపై ఉండదు.
   క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవండంలో దీర్ఘకాల జాప్యం వారి ప్రాథమిక హక్కులను హరించడమే.
   క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువేదీ లేదన్న కేంద్రం వాదన సరికాదు.
   భారతీయ శిక్షా స్మృతి లేదా ఉగ్రవాద వ్యతిరేక చట్టం దేనికింద శిక్ష పడినప్పటికీ శిక్ష తగ్గంచవచ్చు.  
   రాష్ట్రపతి, గవర్నర్ల అధికారం.. ఏదో దయ, ప్రత్యేక హక్కుకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగపరమైన విధి.
 
   క్షమాభిక్ష పిటిషన్లను ఇన్ని రోజుల్లోగా పరిష్కరించాలని గవర్నర్లు లేదా రాష్ట్రపతికి నిర్దేశించలేం.  
  రాష్ట్రపతికి సమయూన్ని నిర్ధారించలేనప్పటికీ సంబంధిత మంత్రిత్వ శాఖను మాత్రం.. జాప్యాన్ని నివారించే దిశగా నిబంధనలు పాటించాల్సిందిగా కచ్చితంగా కోరగలం.
   మరణశిక్ష పడినవారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురైతే ఆ విషయూన్ని ఖైదీల కుటుంబసభ్యులకు తప్పనిసరిగా తెలియజేయూలి.  
   ఉరిశిక్ష పడిన ఖైదీలు సహా ఏ ఖైదీకీ ఏకాంతవాస శిక్ష అమలుచేయకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం.
   క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన సమాచారం అందిన తర్వాత, ఉరిశిక్ష అమలు చేయడానికి మధ్య కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.  
  ఈ తీర్పు కర్ణాటకకు చెందిన 8 మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. వీటిలో కలప స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు సైమన్, జ్ఞానప్రకాష్, బిలవేంద్ర, మిసకార మాదయ్యల కుటుంబాలు ఉన్నారుు. సైమన్ తదితరులు తమిళనాడులో 22 మంది కర్ణాటక పోలీసులను మందుపాతరతో హతమార్చిన కేసులో దోషులు. ఈ తీర్పుతో 20 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న వీరప్పన్ అనుచరులను విడుదల చేయూలని అతని భార్య ముత్తులక్ష్మి కోరారు.
 
   తాజా తీర్పు రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన సంతన్, మురుగన్, పెరారివలన్ సహా పలువురు మరణశిక్ష పడిన ఖైదీలకు సైతం శిక్ష తగ్గేందుకు మార్గం సుగమం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement