టైలరింగ్ యూనిట్‌లో కొలతలు ఇస్తున్న హాం మంత్రి చిన రాజప్ప
తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాధించే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన రాజప్ప మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కూడా జైల్‌లో ఉన్నారని, అనంతరం ఆయన జైలులో ఖైదీ సంక్షేమానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కేంద్ర కారాగారంలో ఖైదీల ఆరోగ్యం కోసం 50 పడకల హాస్పిటల్ నిర్మించేందుకు చర్యటు చేపట్టామన్నారు.
గత ఏడాది జైల్ ఉత్పత్తుల ద్వారా రూ.33.63 లక్షల లాభాలు వచ్చాయని తెలిపారు. పెట్రోల్ అమ్మకాల ద్వారా రూ1.45 కోట్ల నికర లాభాలు ఆర్జించినట్టు తెలిపారు. ఖైదీలను కోర్టులకు, హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లేటప్పుడు ఎస్కార్ట్ సమస్య ఉందని దానిని పరిష్కరిస్తామని తెలిపారు. పెరోల్ విషయంలో గడువు 45 రోజులు పెంచామన్నారు. ముందుగా గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్, రెండో డివిజన్ కార్పొరేటర్ పీతాని లక్ష్మీకుమారి, మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం క్రైం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌ను సందర్శించిన హోమ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సెంట్రల్ జైల్‌లో ఉన్న టైలరింగ్ యూనిట్‌ను పరిశీలించారు. యూనిట్‌లో ఖైదీలు కుట్టే రెడీమేడ్ దుస్తులను పరిశీలించి వారి నైపుణ్యానికి ముచ్చట పడ్డారు. హోమ్ మంత్రి కూడా తనకు దుస్తులు తయారు చేయాలని కొలతలు ఇచ్చారు. దీనితో ఆయన వెంట ఉన్న నేతలు సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ, తదితరులు కూడా తమతమ కొలతలు ఇచ్చారు. అలాగే ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో ఖైదీలకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు హోం మంత్రి చినరాజప్ప సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జైల్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి.
గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని
కాకినాడ క్రైం: అహింసాయుత సిద్ధాంతంతో ప్రపంచ ప్రాచుర్యం పొందిన గొప్ప దార్శనికుడు మహాత్మాగాంధీ అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీకి నివాళులర్పించారు. స్వాతంత్య్రం సాధనలో మహాత్మాగాంధీ జాతికి చూపిన అహింసాయుత మార్గం జాతి ఎన్నటికీ మరువదన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ వై.రవిశంకర్‌రెడ్డి, ఏఎస్పీ ఏఆర్ వీఎస్ ప్రభాకరరావు, ఎస్‌బీ డీఎస్పీలు ఆర్.విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, ఆర్‌ఐ ఏఆర్ రాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment