జైలు లోపల నుంచి బ్యాగులు పట్టుకొని బయటకు వస్తున్న జీవిత ఖైదీలు
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు) : సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు విశాఖ కేంద్ర కారాగారం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంవత్సరాలు తరబడి నాలుగు గోడల మధ్య గడుపుతూ కుటుంబీకులకు దూరంగా ఉన్న వారు ఎట్టకేలకు ఆదివారం విముక్తి పొందారు. రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన క్షమాబిక్ష జీవోకి ఇప్పుడు మోక్షం కలిగింది. ఈ ఏడాది జనవరి 24న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీంతో ఆ జీవో ప్రకారం ఇక్కడి జైలు అధికారులు అర్హులైన జీవిత ఖైదీల జాబితా తయారుచేసి జైల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. అప్పటి నుంచి వీరంతా ఎప్పుడు విడుదలవుతామా అంటూ ఎదురు చూశారు. రిపబ్లిక్ డే, ఉగాదికి విడదులవుతామని ఆశించారు. ఆ రెండు గడువులు దాటిపోయాయి. ఎట్టకేలకు ఆ ఖైదీలకు ఆదివారం మోక్షం కలిగింది. కానీ జైలు అధికారులు పంపించిన జాబితాలోని నలుగురిని ఉన్నతాధికారులు అనర్హులుగా గుర్తించి విడదులైన జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. ప్రభుత్వం క్షమాభిక్షపై రాష్ట్రంలో విడుదల చేసిన 49 మంది జీవిత ఖైదీలలో ఇక్కడి నుంచి 13 మందికి విముక్తి కలిగింది. దీంతో మధ్యాహ్నం 1 గంటకు వారంతా ఆనందోత్సాహాలతో జైలు నుంచి బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. వీరిలో ఓ మహిళా ఖైదీ తన రెండేళ్ల కుమార్తెతో విడుదల కావడం విశేషం. విడుదలైన వారిలో విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు 9 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఇద్దరు, శ్రీకాకుళం, కడప జిల్లాలకు చెందిన వారు చెరో ఒక్కరు చొప్పున ఉన్నారు. క్షమాబిక్ష జీవో నిబంధనల ప్రకారం వీరందరూ రూ.50వేలు బ్యాండు పూచీకత్తుపై విడుదలయ్యారు. ప్రతి మూడు నెలలకు ఓసారి వీరంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది.
కొబ్బరికాయలు కొట్టిన ఖైదీలు
విడుదలైన ఆనందంలో ఖైదీలు జైలు ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. చెప్పులు పక్కన విడిచి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కరూ జైలుకు దండం పెట్టారు. ఇది ఒక దేవాలయం లాంటిదని, మాకు జీవిత పాఠం నేర్పిందని, బాహ్యప్రపంచంలో నీతిగా బతుకుతామంటూ దండం పెట్టుకొన్నారు.
విడుదలైన జీవిత ఖైదీలు వీరే
విశాఖపట్నం జిల్లా నుంచి జి.శ్రీనివాస్(నాతవరం), ఎం.అప్పారావు (జి.మాడుగుల), ఎస్.సుబ్బారావు(పెదబయిలు), ఎన్.అప్పన్న
(నాతవరం), ఎన్.శ్రీను(నాతవరం), ఆర్.అప్పనాయుడు(అచ్చుతాపురం), ఎ.నాయుడు(మునగపాక), బి.గోవిందరాజు(గోపాలపట్నం), ఆర్.శ్యామల(గాజువాక) విడుదలయ్యారు. విజయనగరం జిల్లా వి.టి.అగ్రహారం రెడ్డి వీధికి చెందిన జి.కృష్ణ, పెదసాము ప్రాంతానికి చెందిన ఆర్.సీతారాం, శ్రీకాకుళం జిల్లా గట్లభద్రకు చెందిన ఎం.బాబూరావు, కడప జిల్లాకు చెందిన ఎస్.రవికుమార్ విడుదలయ్యారు.
మళ్లీ నేరం చేస్తే జీవితాంతం జైలులోనే
జైలు నుంచి విడుదలైన జీవిత ఖైదీలకు డిప్యూటీ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు నిబంధనలు వివరించారు. క్షమాభిక్ష జీవో ప్రకారం ఇప్పుడు విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాంటి వారికి క్షమాభిక్ష రద్దయి జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందన్నారు. బయట ప్రపంచంలో గౌరవంగా జీవించాలని సూచించారు. విడుదలైన వారంతా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ప్రతి మూడు నెలలకు ఓసారి వెళ్లి సంతకం చేయాలన్నారు. ఇప్పుడు ఇక్కడ మిగిలిన శిక్ష ముగిసినంతవరకు పోలీస్ స్టేషన్‌లో మూడు నెలలకు ఓసారి సంప్రదించాల్సిందేనని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment