జస్టిస్ లలిత్
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాద కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ అనూహ్యంగా వైదొలిగారు. దీంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి జనవరి 29న విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన లలిత్..ఇకపై జరిగే విచారణలో పాల్గొనేందుకు నిరాకరించి తనంతట తానే తప్పుకున్నారు.
రామ మందిర నిర్మాణ కేసుకే సంబంధించి 1997లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ తరఫున లాయర్‌గా జస్టిస్ లలిత్ ప్రాతినిధ్యం వహించిన సంగతిని సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ ప్రస్తావించారు. ఈ కేసు విచారణలో జస్టిస్ లలిత్ కొనసాగేందుకు తనకేం అభ్యంతరం లేదని ధావన్ స్పష్టం చేసినా తుది నిర్ణయం మాత్రం జస్టిస్ లలిత్‌దేనని బెంచ్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌తో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.
ముగ్గురికి సూచిస్తే ఐదుగురికి ఎందుకిచ్చారు?: ధావన్
జస్టిస్ లలిత్ స్వచ్ఛందంగా వైదొలగడంతో అయోధ్య కేసు విచారణను వాయిదా వేసి కొత్త బెంచ్‌ను నియమించడం మినహా మరో మార్గం లేదని కోర్టు తెలిపింది. విచారణలో ముస్లిం పిటిషన్‌దారుడు సిద్దిఖి తరఫున రాజీవ్ ధావన్, హిందూ కక్షిదారుల తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. అయోధ్య భూ వివాద కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలని త్రిసభ్య బెంచ్ గతేడాది సెప్టెంబర్ 27న కోర్టుకు సూచించినా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎందుకు కేటాయించారని ధావన్ ప్రశ్నించారు.
దీనికి సాల్వే స్పందిస్తూ..రాజ్యాంగ సంబంధ ప్రశ్నలు తలెత్తినప్పుడు, ఆ అంశాన్ని ఐదుగురు సభ్యుల కన్నా తక్కువ లేని బెంచ్‌కే కేటాయించాలని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి తన పాలనాధికారాలు వినియోగించి ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేటాయించారని కోర్టు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ నియామకం త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమీ లేదని స్పష్టం చేసింది. అవసరానికి తగినట్లుగా ఏ బెంచ్‌లో ఎందరు సభ్యులుండాలో నిర్ణయించే అధికారం సీజేఐకి దఖలుపడిందని తెలిపింది. కొత్త బెంచ్ వేలాది పేజీల సాక్ష్యాలు, దస్తావేజులు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 88 మంది చెప్పిన 13886 పేజీల సాక్ష్యాలు, 257 డాక్యుమెంట్లు, వీడియో టేపులను భద్రపరిచారు.
వాళ్లంతా సీజేఐలవుతారు!
జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు వరుసగా ఒకరి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశాలున్నాయి. జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్‌లో పదవీ విరమణ చేశాక సంప్రదాయం ప్రకారం.. ఆయన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే సీజేఐగా బాధ్యతలు చేపట్టొచ్చు. 2021లో జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగిసిన తరువాత తెలుగు వ్యక్తి ఎన్‌వీ రమణకు సుప్రీం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం లభించొచ్చు. 2022లో జస్టిస్ రమణ పదవీ విరమణ తరువాత జస్టిస్ యూయూ లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. 2022 నవంబర్‌లో జస్టిస్ లలిత్ పదవీకాలం ముగిశాక జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులై 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 2024 వరకు పదవిలో కొనసాగొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment