రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు 2019, జనవరి 24న సమావేశం కానున్న అత్యున్నత ఎంపిక కమిటీలో తానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు మరో బెంచ్‌ను నియమిస్తామని వెల్లడించారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాలుచేస్తూ కామన్‌కాజ్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. సీబీఐ డైరెక్టర్ నియామకంలో పారదర్శకత కోసం విధివిధానాలను రూపొందించాలని కామన్‌కాజ్ సంస్థ కోర్టును కోరింది. నాగేశ్వరరావును సెలెక్ట్ కమిటీ సిఫార్సు ఆధారంగా నియమించలేదని తెలిపింది. నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం 2018, అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది.
కానీ కేంద్రం దుర్బుద్ధితో, ఏకపక్షంగా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం (డీపీఎస్‌ఏ) నిబంధనల్ని తుంగలో తొక్కుతూ నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించిందని పిటిషన్‌లో పేర్కొంది. డీపీఎస్ చట్టం ప్రకారం వెంటనే నూతన సీబీఐ డైరెక్టర్‌ను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. అలాగే సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను, ఎంపిక ప్రక్రియలో పాటించిన విధివిధానాలు, సమావేశాల మినిట్స్‌ను సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కింద ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరింది. దీనివల్ల తుది జాబితాలోని అభ్యర్థులకు సంబంధించి ప్రతికూల అంశాలు ఉంటే ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు వీలవుతుందని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment