
ఒక వ్యక్తి లక్ష్యంగా వ్యాజ్యమా?: సుప్రీం కోర్టు
‘‘కేవలం ఓ రాజకీయ కుటుంబానికి సంబంధించిన వారైనంత మాత్రాన ఒక వ్యక్తిని మీరు అపరాధిగా పేర్కొనడానికి వీల్లేదు. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం పేరుతో ఇలా ఒక వ్యక్తి పేరును నాశనం చేసేందుకు మేం అంగీకరించం.
వాద్రా కంపెనీపై సీబీఐ దర్యాప్తు కోరిన పిల్‌పై సుప్రీం
న్యూఢిల్లీ: ‘‘కేవలం ఓ రాజకీయ కుటుంబానికి సంబంధించిన వారైనంత మాత్రాన ఒక వ్యక్తిని మీరు అపరాధిగా పేర్కొనడానికి వీల్లేదు. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం పేరుతో ఇలా ఒక వ్యక్తి పేరును నాశనం చేసేందుకు మేం అంగీకరించం. కేవలం ఒక వ్యక్తినే లక్ష్యంగా ఎందుకు చేసుకున్నారు? లెసైన్సులు పొందిన ఇతరులపై పిటిషన్‌లో ఎలాంటి ఆరోపణలు చేయలేదే? చౌకబారు ప్రచారం కోసం ఒక వ్యక్తి పేరును నాశనం చేయొద్దు’’. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ కంపెనీకి హర్యానాలో కాలనీల అభివృద్ధికి లెసైన్సులు ఇవ్వడంపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలివి.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని, దాన్ని ఉపసంహరించుకోవాలని జస్టిస్ హెచ్.ఎల్. దత్తూ, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ ఎం.ఎల్. శర్మ(న్యాయవాది)కు సూచించింది. హర్యానా టౌన్-కంట్రీ ప్లానింగ్‌శాఖ 2005 నుంచి 2012 మధ్య గుర్గావ్ తదితర ప్రాంతాల్లో 21 వేల ఎకరాల భూముల అభివృద్ధికి సంబంధించి వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సహా వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలకు వందలాది లెసైన్సులు మంజూరు చేసింది. అయితే పిటిషనర్ కేవలం వాద్రా పేరును ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది.