
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ (ఫైల్‌ఫోటో)
అత్యున్నత స్ధానానికి ఎదిగినా ఆస్తులు సంపాదించుకోని న్యాయమూర్తి..
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనకు ఇల్లు, వాహనం, ఆభరణాలు వంటి ఆస్తులేమీ లేవని ప్రకటించారు. అక్టోబర్ 1న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ దీపక్ మిశ్రా తనకు ఒక ఫ్లాట్, కొన్ని బంగారు ఆభరణాలున్నాయని వెల్లడించగా ఆయన స్ధానంలో ప్రధాన న్యాయమూర్తి పగ్గాలు చేపట్టిన రంజన్ గొగోయ్ మాత్రం తనకెలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు.
జస్టిస్ రంజన్ గొగోయ్‌చే సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గొగోయ్ తన డిక్లరేషన్‌లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, తన పెళ్లి సమయంలో భార్యకు పుట్టింటి నుంచి కొన్ని ఆభరణాలు లభించాయని పేర్కొన్నారు.
అసోం మాజీ సీఎం కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్‌కు సొంత వ్యక్తిగత వాహనం లేకపోవడం గమనార్హం. ఆయన పేరుతో ఎలాంటి బ్యాంకు రుణాలు కూడా లేవు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాల ప్రకారం జస్టిస్ గొగోయ్‌కు రెండు బ్యాంకు ఖాతాల్లో రూ 6.5 లక్షల నగదు నిల్వలు, రూ 16 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, 1999లో తీసుకున్న రూ 5 లక్షల విలువైన ఎల్‌ఐసీ పాలసీలున్నాయి. ఆయనకు ఎలాంటి బంగారు ఆభరణాలు లేకున్నా భార్య పేరిట 150 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి.