నా సర్వస్వం కోల్పోయాను | 35 year Old Woman Accused of Sexual Assault by Ranjan Gogoi | Sakshi
Sakshi News home page

నా సర్వస్వం కోల్పోయాను

Published Thu, May 16 2019 12:02 AM | Last Updated on Thu, May 16 2019 12:02 AM

35 year Old Woman Accused of Sexual Assault by Ranjan Gogoi - Sakshi

ముగ్గురు జడ్జిలు ఇచ్చిన నివేదికలో ఏముందో తెలియదు. కానీ ఆమె మనసులో ఏముందో తెలుసుకోడానికి ముగ్గురు పత్రికా ప్రతినిధులు ఆమెను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు.

‘నిర్భయ’ ఘటనలో బాధితురాలు ఎలా ఉంటుందో, ఆమె అసలు పేరేంటో కొన్నేళ్ల వరకు ఎవరికీ తెలియదు. 2012 డిసెంబరు 16 రాత్రి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ప్రతిఘటనలో తీవ్రంగా గాయపడి డిసెంబర్‌ 28న మరణించింది. గోప్యత కోసం, ఒక స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం కోసం కేసు నడుస్తున్నంతకాలం ఆమె ఫొటోను కానీ, పేరును గానీ మీడియా ఎక్కడా ఇవ్వలేదు. దోషులకు శిక్ష పడిన తర్వాత మాత్రమే తొలిసారిగా ఆమెపేరు స్థానిక పేపర్ల ద్వారా బయటికి వచ్చింది. ఫొటో కూడా వచ్చింది కానీ.. నిజంగా అది ఆమె ఫోటోనా కాదా అన్నది దేశ ప్రజల్లో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఇప్పుడు మళ్లీ అదే గోప్యతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 35 ఏళ్ల మహిళ విషయంలో మీడియా పాటిస్తోంది.

ఆమె ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవని ముగ్గురు జడ్జీలతో కూడిన ధర్మాసనం నివేదికను ఇవ్వడంతో ఆమె జీవితం దాదాపుగా దుర్భరమైపోయింది. రోజూ బెదరింపులు వస్తున్నాయి. ‘నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని’ అపరిచితులు ఫోన్‌ చేస్తున్నారు. దీంతో ఆమె దినదినగండంగా గడుపుతున్నారు. ఒక స్త్రీ న్యాయం కోరి న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆమెకు న్యాయం జరగకపోవడం అంటే ఆమె ఇక అనుక్షణం భయంభయంగా జీవితాన్ని గడపవలసిన పరిస్థితులు తలెత్తడమేనని న్యాయవాదులలోనే కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అజ్ఞాత మహిళ అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆమె కేసును డీల్‌ చేసిన ముగ్గురు జడ్జీలు.. జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, ఇందిర బెనర్జీ, ఇందు మల్హోత్ర.. విచారణ జరిపి చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ నిర్దోషి అని నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక కాపీని చీఫ్‌ జస్టిస్‌కు అందించారు కానీ ఆమెకు ఇవ్వలేదు! ఈ చర్యపై ఆమె నివ్వెరపోయారు.

2013 నాటి ‘సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్‌) యాక్టును కూడా జడ్జీలు పరిగణనలోకి తీసుకోలేదన్నదీ ఆమె ఆవేదనకు ఒక కారణం. ఇక ఇప్పుడు ఇంకే కోర్టుకు వెళ్లాలో తెలియక, దేవుడి కోర్టులోనన్న తనకు న్యాయం జరగకపోదా అని విలపిస్తున్నారు బాధితురాలైన ఆ మాజీ కోర్టు ఉద్యోగిని. ముగ్గురు జడ్జిలు ఇచ్చిన నివేదికలో ఏముందో తెలియదు. కానీ ఆమె మనసులో ఏముందో తెలుసుకోడానికి ముగ్గురు పత్రికా ప్రతినిధులు ఆమెను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు. ది వైర్, ది కారవాన్, స్క్రోల్‌ వెబ్‌సైట్‌లకు పని చేస్తున్న ఆ జర్నలిస్టులు ఆమెను అడిగిన చిట్ట చివరి ప్రశ్నకు ఆమె చెప్పిన ఒక్క సమాధానం చాలు.. తనెంతగా షాక్‌లోకి వెళ్లిపోయారో తెలుసుకోడానికి.

‘‘మీరు కేసు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సంభవించిన పరిణామాలన్నిటినీ మీరెలా నెగ్గుకొస్తున్నారు?’’ అన్నది ఆ ఆఖరి ప్రశ్న. ‘‘నేను నా సర్వస్వం కోల్పోయిన భావన కలుగుతోంది. తొలిసారిగా అక్టోబర్‌ 11న కొందరు న్యాయమూర్తుల దృష్టికి నాపై లైంగిక వేధింపులు జరిగిన విషయం తీసుకెళ్లాను. అప్పట్నుంచీ జరిగిన ప్రతిదీ నాకు వ్యతిరేకంగానే జరిగింది. తర్వాతేం జరగబోతోందో తెలియడం లేదు. నిద్రే లేని అశాంతి జీవితాన్ని గడుపుతున్నాను. ఇంకో కమిటీ వేసినా అందులో నా పాత్ర ఉంటుందో లేదో తెలియదు. బాధితురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించలేదనిది కాదు’’ అన్నారు ఆమె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement