హైకోర్టు తాత్కాలిక భవనాన్ని ప్రారంభిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: న్యాయం కోసం ఎదురుచూసే వారికి న్యాయస్థానం ఒక దేవాలయం లాంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం సడలిపోకుండా ఉండాలంటే న్యాయవాదులు తమ విధులను నిష్టతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం ప్రారంభించారు. శాశ్వత హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది జస్టిస్ పి.వెంకటరామారెడ్డి, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జస్టిస్ రంజన్ గొగోయ్ అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించి సీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మినియేచర్లను పరిశీలించారు.
పెండింగ్ కేసులు మాయని మచ్చ
కింది కోర్టుల్లో 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇందులో 81 లక్షల కేసులు ఒక ఏడాదిలోనే దాఖలయ్యాయని, 50 లక్షల కేసులు చిల్లర కేసులని, 25 లక్షల కేసులు పదేళ్ల పాతవని చెప్పారు. 50 లక్షల చిల్లర కేసులను పరిష్కరించడానికి ఏం చేయాలనే దానిపై ప్రధాన న్యాయమూర్తులు ఆలోచన చేయాలని తెలిపారు. తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థకు ఈ పెండింగ్ కేసులో ఓ మాయని మచ్చగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కింది కోర్టుల్లో భారీ స్థాయిలో ఖాళీలున్నాయని, వీటి భర్తీకి ఆయా హైకోర్టులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఖాళీల భర్తీకి తాము తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 75 శాతం ఖాళీలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేస్తామని తెలిపారు. హైకోర్టులో 392 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇందులో 272 ఖాళీలకు సంబంధించి ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నుంచి ఎలాంటి సిఫార్సులు రాలేదన్నారు. 130 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, మరో 100 ఖాళీల భర్తీ విషయం కొలీజియం పరిశీలనలో ఉందని, 14 ఖాళీలకు సంబంధించి తాము చేసిన సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఈ తాత్కాలిక హైకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు.
రైతులే అసలైన రాజధాని నిర్మాతలు
అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించడం, శాశ్వత హైకోర్టుకు శంకుస్థాపన చేయడం ఓ చరిత్రక ఘట్టమని జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఆశావహ దృక్పథంతో ఈ హైకోర్టు ప్రతిష్టను మరింత పెంచాలని న్యాయమూర్తులు, న్యాయవాదులను కోరారు. రాజధాని కోసం తల్లిలాంటి భూములిచ్చిన రైతులే అసలైన రాజధాని నిర్మాతలని అన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో, ఆశలతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారని, న్యాయవ్యవస్థపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జస్టిస్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ... విభజన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో 1.70 లక్షల చొప్పున కేసులున్నాయన్నారు. జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... ఈ హైకోర్టు భవనాన్ని ఓ వ్యవస్థగా మార్చాల్సిన బాధ్యత న్యాయవాదులు, కక్షిదారులతో పాటు ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. హైకోర్టు విభజన ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సాఫీగా పూర్తయిందని తెలిపారు.
చరిత్రను పునరావృతం చేస్తాం...
రాష్ట్ర విభజన వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాతోపాటు పలు హామీలు ఇంకా అమలు కాలేదన్నారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు సదా రుణపడి ఉంటానని చెప్పారు. శాతవాహనుల కాలంలో అమరావతి ఓ వెలుగు వెలిగిందని, ఇప్పుడు మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తామని తెలిపారు. అమరావతిలో నల్సార్ వంటి న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భూమి ఇచ్చేందుకు, యూనివర్సిటీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment