
పెరంబూరు: గాయని చిన్మయి ఆందోళన కార్యక్రమానికి చెన్నై పోలీస్ కార్యాలయం అనుమతి ఇవ్వలేదు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గొగొయిపై ఆయన కార్యాలయ పనిమనిషి లైంగిక ఆరోపణలు చేసిన విషయం, దీనిపై పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో కొందరు మహిళామండలి నిర్వాహకులు న్యాయమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలో లైంగిక వేధింపులపై(మీటూ) గళం విప్పిన తొలి మహిళగా పేరు తెచ్చుకున్న గాయని చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణను ఎదుర్కొన్న న్యాయమూర్తి రంజన్ గొగొయి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఇతర మహిళామండలి కార్యకర్తలతో కలిసి ఆదివారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. అందుకు పోలీస్‌కమీషనర్ కార్యాలయంలో అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందించింది. దీనిపై పోలీస్‌కమిషనర్ కార్యాలయం ఆమెకు అనుమతిని నిరాకరించారు. సుప్రీంకోర్టే కొట్టివేసిన కేసు విషయంలో ఆందోళన చేయడం న్యాయస్థానాన్ని అవమానించడం అవుతుందని, చిన్మయికి అనుమతిని ఇవ్యలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment