
ప్రమాణ స్వీకారం చేస్తున్న రంజన్ గొగోయ్
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుల వ్యతిరేక నినాదాల నడుమ గురువారం రాజ్యసభలో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగానే విపక్షాలు సభనుంచి బయటకు వెళ్లిపోవటం గమనార్హం. విపక్షాల చర్యను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. రాజ్యసభ సభ్యుడిగా రంజన్ తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ( న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నీలినీడలు)
సభనుంచి బయటకు వెళ్లిపోతున్న విపక్షాలు
కాగా, 13 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ పొందారు. కొద్దిరోజుల క్రితం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే రంజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ విమర్శలపై రంజన్ స్పందిస్తూ.. ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించాన’అని అన్నారు. ( నా ప్రమాణం తర్వాత మాట్లాడతా )