కొలిక్కిరాని సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపిక | Panel to meet in Delhi for appointment of new CBI director | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపిక

Published Fri, Jan 25 2019 5:46 AM | Last Updated on Fri, Jan 25 2019 5:46 AM

Panel to meet in Delhi for appointment of new CBI director - Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్‌ ఎంపిక కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని గురువారం జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. ‘పదవికి అర్హులైన జాబితాలోని అధికారుల పేర్లపై సెలక్షన్‌ కమిటీ సభ్యులు గురువారం చర్చించారు. త్వరలోనే మరోసారి కమిటీ సమావేశమై కొత్త చీఫ్‌ పేరును ప్రకటిస్తుంది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు సీజే రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జన్‌ ఖర్గే పాల్గొన్నారు. ‘ కేవలం పేర్లపైనే చర్చ జరిగింది. జాబితాలోని అధికారుల కెరీర్, అనుభవం తదితర వివరాలను పొందుపరచలేదు. అందుకే సంబంధిత వివరాలను కోరాం. వచ్చే వారం కమిటీ సమావేశం ఉండొచ్చు’ అని ఖర్గే అన్నారు.

‘సీబీఐ’ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ తప్పుకున్నారు. గత సోమవారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కూడా ఈ కేసును తాను విచారించబోనంటూ తప్పుకోవడం తెలిసిందే. సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే అత్యన్నత స్థాయి కమిటీలో జస్టిస్‌ గొగోయ్‌ సభ్యుడు కాగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తొలగించిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్‌ సిక్రీ కూడా ఉన్నారు. ఈ కారణాలనే చూపుతూ వీరిద్దరూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసును జస్టిస్‌ సిక్రీ విచారిస్తే తమకేమీ అభ్యంతరం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ చెప్పినప్పటికీ పక్కకు తప్పుకునేందుకే జస్టిస్‌ సిక్రీ మొగ్గు చూపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement