Justice Sikri
-
కొలిక్కిరాని సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక
న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని గురువారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. ‘పదవికి అర్హులైన జాబితాలోని అధికారుల పేర్లపై సెలక్షన్ కమిటీ సభ్యులు గురువారం చర్చించారు. త్వరలోనే మరోసారి కమిటీ సమావేశమై కొత్త చీఫ్ పేరును ప్రకటిస్తుంది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జన్ ఖర్గే పాల్గొన్నారు. ‘ కేవలం పేర్లపైనే చర్చ జరిగింది. జాబితాలోని అధికారుల కెరీర్, అనుభవం తదితర వివరాలను పొందుపరచలేదు. అందుకే సంబంధిత వివరాలను కోరాం. వచ్చే వారం కమిటీ సమావేశం ఉండొచ్చు’ అని ఖర్గే అన్నారు. ‘సీబీఐ’ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సిక్రీ న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తప్పుకున్నారు. గత సోమవారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఈ కేసును తాను విచారించబోనంటూ తప్పుకోవడం తెలిసిందే. సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే అత్యన్నత స్థాయి కమిటీలో జస్టిస్ గొగోయ్ సభ్యుడు కాగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తొలగించిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. ఈ కారణాలనే చూపుతూ వీరిద్దరూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసును జస్టిస్ సిక్రీ విచారిస్తే తమకేమీ అభ్యంతరం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పినప్పటికీ పక్కకు తప్పుకునేందుకే జస్టిస్ సిక్రీ మొగ్గు చూపారు. -
జస్టిస్ సిక్రీ జోక్‌తో కోర్టులో నవ్వులు
న్యూఢిల్లీ: కర్ణాటక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సిక్రీ జోకుతో సుప్రీంలో నవ్వులు విరిశాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో ఒకవైపు వాడీవేడిగా వాదనలు సాగుతుండగా.. జస్టిస్ సిక్రీ మధ్యలో జోక్యం చేసుకుంటూ ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జోకు గురించి మీకు చెప్పాలి. తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రిసార్టు యజమాని గవర్నర్‌కు లేఖ రాశాడట’ అని ఆయన చెప్పగానే కోర్టులోని వారంతా పగలబడి నవ్వారు. బెంగళూరులోని ఈగల్టన్ రిసార్టులో కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేల్ని ఉంచిన అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ సిక్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
గర్భధారణపై మహిళకే హక్కు
సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సిక్రి వెల్లడి న్యూఢిల్లీ: పిల్లల్ని కనాలా? వద్దా? అబార్షన్ చేయించుకోవాలా? గర్భనిరోధక పద్ధతులు పాటించాలా? అనేవన్నీ మహిళల ఇష్టాన్ని బట్టి ఉంటుందని, అది వారి హక్కు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు. శనివారం ఇక్కడ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భధారణ విషయంలో దేశంలో మహిళల హక్కు అరుదుగా అమలవుతోందన్నారు.ఈ విషయంలో మానవత్వం ప్రదర్శించడంలో మనం విఫలమయ్యామన్నారు. దేశంలో మహిళల గర్భధారణ హక్కు విషయంలో పురుషులు లేదా ఇంటి పెద్దల అభిప్రాయమే చెల్లుబాటవుతుందని అన్నారు. గర్భధారణ మహిళ శరీరానికి సంబంధించినదని, అది ఆమె అభిప్రాయం మేరకే జరగాలని జస్టిస్ సిక్రి చెప్పారు. భార్యాభర్తలిద్దరు కలసి నిర్ణయం తీసుకున్నపుడే సమానత్వం అనేది సాధ్యమవుతుందన్నారు. సమాజంలో మార్పు వచ్చే వరకూ చట్టాల్లోని ఫలాలు మహిళలకు అందుబాటులోకి రావని అభిప్రాయపడ్డారు.