సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సిక్రి వెల్లడి
న్యూఢిల్లీ: పిల్లల్ని కనాలా? వద్దా? అబార్షన్ చేయించుకోవాలా? గర్భనిరోధక పద్ధతులు పాటించాలా? అనేవన్నీ మహిళల ఇష్టాన్ని బట్టి ఉంటుందని, అది వారి హక్కు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు. శనివారం ఇక్కడ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భధారణ విషయంలో దేశంలో మహిళల హక్కు అరుదుగా అమలవుతోందన్నారు.ఈ విషయంలో మానవత్వం ప్రదర్శించడంలో మనం విఫలమయ్యామన్నారు.
దేశంలో మహిళల గర్భధారణ హక్కు విషయంలో పురుషులు లేదా ఇంటి పెద్దల అభిప్రాయమే చెల్లుబాటవుతుందని అన్నారు. గర్భధారణ మహిళ శరీరానికి సంబంధించినదని, అది ఆమె అభిప్రాయం మేరకే జరగాలని జస్టిస్ సిక్రి చెప్పారు. భార్యాభర్తలిద్దరు కలసి నిర్ణయం తీసుకున్నపుడే సమానత్వం అనేది సాధ్యమవుతుందన్నారు. సమాజంలో మార్పు వచ్చే వరకూ చట్టాల్లోని ఫలాలు మహిళలకు అందుబాటులోకి రావని అభిప్రాయపడ్డారు.