contraceptive methods
-
తెలుగు రాష్ట్రాల్లో సంతా‘నో’త్పత్తి! ఎస్ఆర్ఎస్ నివేదికలో కీలక విషయాలు
సాక్షి, అమరావతి: మహిళల్లో అక్షరాస్యత పెరుగుదల, ఆధునిక గర్భ నిరోధక పద్ధతులతో దేశవ్యాప్తంగా పదేళ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) గణనీయంగా తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో 2008–2010లో సగటు జీఎఫ్ఆర్ 63.8 కాగా 2018–20 నాటికి 52.9కి పడిపోయింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) గణాంకాల నివేదిక 2020’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రతి వెయ్యి మంది మహిళలకు ఆ ఏడాదిలో జన్మించిన శిశువుల సంఖ్యను జీఎఫ్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. 15–49 ఏళ్ల వయసు మహిళలను పరిగణలోకి తీసుకుని జీఎఫ్ఆర్ లెక్కిస్తారు. ► తెలుగు రాష్ట్రాల్లో నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే జీఎఫ్ఆర్ తగ్గుదల ఎక్కువగా ఉంది. 2008–10లో గ్రామాల్లో జీఎఫ్ఆర్ 66.9 ఉండగా 2018–20 నాటికి 54.7కి పరిమితమైంది. పట్టణాల్లో ఇదే సమయంలో 56.8 నుంచి 49.6కి తగ్గింది. దేశ వ్యాప్తంగా పదేళ్లలో 20.2 శాతం జీఎఫ్ఆర్ తగ్గింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15.6 శాతం తగ్గుదల నమోదైంది. అత్యధికంగా పదేళ్లలో జమ్మూ కశ్మీర్లో జీఎఫ్ఆర్ 29.2 శాతం తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో జీఎఫ్ఆర్ చాలా ఎక్కువగా ఉంది. ► ఏపీలో 20 – 29 ఏళ్ల వయసు మధ్య సంతానోత్పత్తి రేటు మెరుగ్గా నమోదైంది. 20–24 ఏళ్ల మధ్య 113.6, 25–29 ఏళ్ల మధ్య 109గా సంతానోత్పత్తి రేటు ఉంది. 30–34 ఏళ్ల వయస్సు వారిలో 44.4 ఉండగా, 35–39 ఏళ్ల వయస్సు వారిలో 13.4గా సంతానోత్పత్తి రేటు ఉంది. జాతీయ స్థాయిలో 30–34 ఏళ్ల మధ్య 84.4 ఉండగా 35–39 ఏళ్ల మధ్య సంతానోత్పత్తి రేటు 35.6గా నమోదైంది. -
త్వరలో పురుషుల గర్భ నిరోధక జెల్
ఇన్నాళ్లూ మహిళలకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలుండేవి. పురుషులైతే కండోమ్‌లు వాడడం ద్వారానో లేక వేసక్టిమీ ద్వారానో పిల్లలు పుట్టకుండా..పునరుత్పత్తికి అడ్డుకట్ట వేసేవారు. ఇప్పుడు పురుషుల కోసం కూడా గర్భ నిరోధక ఔషధం మరో రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. మాంచెస్టర్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ గర్భనిరోధక ఔషదాన్ని తయారు చేశారు. ఈ ఔషదాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి, ఎడిన్బర్గ్ పీహెచ్డీ స్టూడెంట్ జేమ్స్ ఓవెర్స్ ఈ ప్రయోగ వివరాలను స్కైడాట్కామ్తో పంచుకున్నారు. తన సతీమణి ఓ ప్రకటనను చూసి ఈ పరిశోధన గురించి తెలిపిందని, ఈ ప్రయోగంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. గర్భనిరోధక జెల్ ఉపయోగించిన తొలి వ్యక్తి జేమ్స్ ఓవెర్స్ అయితే ప్రస్తుతం పరీశీలనలో ఉన్న ఈ ఔషధం మరో రెండేళ్లలో వినియోగంలోకి రానుందని తెలిపారు. ‘ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉన్నాయి. జెల్ లా కనిపించే నెస్టోరోన్ (NES/T) అనే హార్మోన్ వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీన్ని వాడటం ప్రారంభించిన తర్వాత 6-12 వారాల్లో సెమెన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. వినియోగించడం నిలిపి వేసిన తర్వాత 6-12 వారాల్లో శుక్ర కణాలు ఎప్పటిలాగే తయారవుతాయి. వృషణాల్లోని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కణజాలం స్పెర్మాటో జెనెసిస్ అనే ప్రక్రియ ద్వారా వీర్యకణాలను తయారు చేస్తాయి. ఈ ఔషధం ప్రభావం వల్ల ఈ ట్యూబ్యూల్స్ కు ఎటువంటి హాని జరగదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ కు చెందిన 450 మంది పురుషులపై ఈ జెల్‌ను ప్రయోగించాం. ఏడాది క్రితం మొదలైన ఈ అధ్యయనంలో దుష్ఫలితాలు ఏవీ మా దృష్టికి రాలేదు. ఈ జెల్ ను ఎలా ఉపయోగించాలంటే.. నెస్టోరోన్ జెల్‌ను భుజాలకు గాని, వీపుకు గాని పూసుకోవాలి. కలబంద గుజ్జులా ఉండే ఈ జెల్ అరగంటలో చర్మం ద్వారా శరీరంలోకి ఇంకుతుంది. పిల్స్‌తో పోలిస్తే ఇది చాలా ఉత్తమం’ అని ఓవెర్స్ పేర్కొన్నాడు. గర్భనిరోధకానికి ఇప్పటికే మార్కెట్లో చాలా మార్గాలున్నాయని, కానీ తాము ఇంకా సులభతరం చేద్దామనే ఈ ఔషదాన్ని కనుగొన్నామని పరిశోధకురాలైన డాక్టర చెర్లీ తెలిపారు. -
గర్భధారణపై మహిళకే హక్కు
సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సిక్రి వెల్లడి న్యూఢిల్లీ: పిల్లల్ని కనాలా? వద్దా? అబార్షన్ చేయించుకోవాలా? గర్భనిరోధక పద్ధతులు పాటించాలా? అనేవన్నీ మహిళల ఇష్టాన్ని బట్టి ఉంటుందని, అది వారి హక్కు అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు. శనివారం ఇక్కడ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భధారణ విషయంలో దేశంలో మహిళల హక్కు అరుదుగా అమలవుతోందన్నారు.ఈ విషయంలో మానవత్వం ప్రదర్శించడంలో మనం విఫలమయ్యామన్నారు. దేశంలో మహిళల గర్భధారణ హక్కు విషయంలో పురుషులు లేదా ఇంటి పెద్దల అభిప్రాయమే చెల్లుబాటవుతుందని అన్నారు. గర్భధారణ మహిళ శరీరానికి సంబంధించినదని, అది ఆమె అభిప్రాయం మేరకే జరగాలని జస్టిస్ సిక్రి చెప్పారు. భార్యాభర్తలిద్దరు కలసి నిర్ణయం తీసుకున్నపుడే సమానత్వం అనేది సాధ్యమవుతుందన్నారు. సమాజంలో మార్పు వచ్చే వరకూ చట్టాల్లోని ఫలాలు మహిళలకు అందుబాటులోకి రావని అభిప్రాయపడ్డారు.