సాక్షి, అమరావతి: మహిళల్లో అక్షరాస్యత పెరుగుదల, ఆధునిక గర్భ నిరోధక పద్ధతులతో దేశవ్యాప్తంగా పదేళ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్‌ఆర్) గణనీయంగా తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో 2008–2010లో సగటు జీఎఫ్‌ఆర్ 63.8 కాగా 2018–20 నాటికి 52.9కి పడిపోయింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) గణాంకాల నివేదిక 2020’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రతి వెయ్యి మంది మహిళలకు ఆ ఏడాదిలో జన్మించిన శిశువుల సంఖ్యను జీఎఫ్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. 15–49 ఏళ్ల వయసు మహిళలను పరిగణలోకి తీసుకుని జీఎఫ్‌ఆర్ లెక్కిస్తారు.
► తెలుగు రాష్ట్రాల్లో నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే జీఎఫ్‌ఆర్ తగ్గుదల ఎక్కువగా ఉంది. 2008–10లో గ్రామాల్లో జీఎఫ్‌ఆర్ 66.9 ఉండగా 2018–20 నాటికి 54.7కి పరిమితమైంది. పట్టణాల్లో ఇదే సమయంలో 56.8 నుంచి 49.6కి తగ్గింది. దేశ వ్యాప్తంగా పదేళ్లలో 20.2 శాతం జీఎఫ్‌ఆర్ తగ్గింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15.6 శాతం తగ్గుదల నమోదైంది. అత్యధికంగా పదేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో జీఎఫ్‌ఆర్ 29.2 శాతం తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో జీఎఫ్‌ఆర్ చాలా ఎక్కువగా ఉంది.
► ఏపీలో 20 – 29 ఏళ్ల వయసు మధ్య సంతానోత్పత్తి రేటు మెరుగ్గా నమోదైంది. 20–24 ఏళ్ల మధ్య 113.6, 25–29 ఏళ్ల మధ్య 109గా సంతానోత్పత్తి రేటు ఉంది. 30–34 ఏళ్ల వయస్సు వారిలో 44.4 ఉండగా, 35–39 ఏళ్ల వయస్సు వారిలో 13.4గా సంతానోత్పత్తి రేటు ఉంది. జాతీయ స్థాయిలో 30–34 ఏళ్ల మధ్య 84.4 ఉండగా 35–39 ఏళ్ల మధ్య సంతానోత్పత్తి రేటు 35.6గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో సంతా‘నో’త్పత్తి! ఎస్‌ఆర్‌ఎస్ నివేదికలో కీలక విషయాలు
Published Fri, Sep 30 2022 6:00 AM | Last Updated on Fri, Sep 30 2022 12:09 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment