
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డేను జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు కలిశారంటూ వచ్చిన పత్రికా కథనాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఆ కథనం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణపై జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని అంతర్గత కమిటీ ఏకపక్షంగా దర్యాప్తు సాగించడం సరికాదని, విచారణలో సహకరించేందుకు అమికస్ క్యూరీగా లాయర్‌ను నియమించుకోవాలని జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు సూచించినట్లు ఓ పత్రిక పేర్కొంది. ఈ కథనం అబద్ధమంటూ ఆదివారం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేను జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మే 3వ తేదీ సాయంత్రం కలిసినట్లు ఆ ప్రముఖ వార్తా పత్రికలో కథనం రావడం దురదృష్టకరం. అది పూర్తిగా అబద్ధం. అంతర్గత విచారణ కమిటీ నిర్దేశించిన పనిని మరే ఇతర జడ్జీల సాయం అవసరం లేకుండానే చేసుకుపోతుంది. ఈ విషయంలో ఆ కమిటీకి సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా ఎలాంటి సలహా ఇచ్చినా అది దాని విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది’అని ఆయన స్పష్టం చేశారు. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఈ కమిటీ విచారణకు మూడు పర్యాయాలు హాజరైన ఫిర్యాదుదారు, మాజీ ఉద్యోగిని వివిధ కారణాలు చూపుతూ విచారణ ప్రక్రియకు ఇకపై హాజరు కాబోనని ఇటీవల వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment