Nariman
-
న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ శామ్ నారీమన్ (95) మంగళవారం అర్ధరాత్రి మృతిచెందారు. న్యాయ నిపుణుడుగా పేరుగాంచిన నారీమన్ 1929లో పార్సీ దంపతులైన బైరాంజీ నారీమన్, బానో నారీమన్లకు మయన్మార్‌లో జని్మంచారు. బాంబేలో ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించిన నారీమన్ 1971లో సుప్రీంకోర్టులో సీనియర్ హోదా పొందారు. 1972 మే నుంచి 1972 జూన్ 25 వరకూ సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ పనిచేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన పదవికి మరుసటి రోజే రాజీనామా చేశారు. పలు కీలక కేసులు వాదించిన నారీమన్‌ను కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1999లో రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. 1991లో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 1994లో ఇంటర్నేషల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. 1998లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌లో సభ్యుడయ్యారు. 1995 నుంచి 1997 వరకూ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ కార్యనిర్వాహక కమిటీకి ౖచైర్మన్‌గా పనిచేశారు. ఫాలీ నారీమన్ కుమారుడు రోహింగ్టన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. నిర్ణయమే శాసనం ఫాలీ నారీమన్ చివరి వరకూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారుగానీ లాయర్‌గా రాజీ పడలేదు. ఎమర్జెన్సీ సమయంలో కేంద్రాన్ని కాదని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా రాజీనామా చేసిన ఆయన నర్మద రిహాబిలిటేషన్ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఉంటూ క్రిస్టియన్లపై దాడులు నిరసిస్తూ ఆ కేసు నుంచి తప్పుకొన్నారు. తొలుత తాను మానవతావాదినని తర్వాతే న్యాయవాదిని అని ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఎదిరించినందకు నారీమన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఢిల్లీలో ఎవరూ ముందుకురాకపోవడంతో స్థిరమైన నివాసం కోసం ఎంతో కష్టపడ్డారు. ‘వెన్నెముక లేనితనం కంటే నిరాశ్రయమే మేలు’ అని నారీమన్ వ్యాఖ్యానించారు. డిసెంబరు 2009లో జస్టిస్ ప్రసాద్, జస్టిస్ దినకరన్‌ల నియామకాల సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుల సమీక్ష, బహిరంగ చర్చ అనంతరమే న్యాయ నియామకాలకు సిఫార్సులు చేపట్టాలని భావిస్తున్నట్లు జ్యూడీíÙయల్ అకౌంటబిలిటీపై కమిటీ పేర్కొంది. ఈ ప్రకటనపై రాం జఠ్మలానీ, శాంతి భూషణ్, అనిల్ దివాన్, కామిని జైశ్వాల్, ప్రశాంత్ భూషణ్లతోపాటు నారీమన్ సంతకం చేశారు. కీలక కేసులు వాదన తన సుదీర్ఘ కెరియర్లో నారీమన్ అనేక కీలక కేసులు వాదించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో ఆమె బెయిలు పొందడంలో కీలకవాదనలు చేశారు (అనంతరం ఆ బెయిలు రద్దయింది). భోపాల్ గ్యాస్ ఘటనలో యూనియన్ కార్బైడ్ తరఫున వాదించిన నారీమన్ తన తప్పును తదనంతరం అంగీకరించడానికి వెనకాడలేదు. 47 కోట్ల డాలర్ల పరిహారం కోర్టు వెలుపల బాధితులకు అందించేలా సంస్థతో ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఏఓఆర్ అసోసియేషన్ కేసులో తన వాదనా పటిమ అనంతరమే ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు చేపట్టడం ప్రారంభించింది. అయితే తదనంతరం తన ఆత్మకథ ‘బిఫోర్ మెమరీ ఫేడ్స్’లో మాత్రం న్యాయమూర్తుల నియామక విషయంలో ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు క్లోజ్ సర్క్యూట్ కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ సంప్రదించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఫాలీ నారీమన్ అత్యుత్తుమ న్యాయవాదులు, మేధావుల్లో ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం జరిగేలా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మృతి నన్నెంతో బాధించింది. నారీమన్ ఆత్మకు శాంతి కలగాలి’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘నారీమన్ మరణానికి సంతాపం తెలుపుతున్నా. చట్టంలో గొప్ప దిగ్గజమైన నారీమన్ మృతి చాలా విచారకరం’’ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ -
ఫాలీ నారీమన్ కన్నుమూత.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఢిల్లీ, సాక్షి: న్యాయ రంగంలో ఒక శకం ముగిసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ (95) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ (బుధవారం) ఉదయం కన్నుమూశారు. ఫాలీ నారీమన్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. బాంబే హైకోర్టులో 22 ఏళ్లపాటు ప్రాక్టీస్ చేసిన ఆయన.. 1971 నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో పని చేస్తూ వచ్చారు. అలాగే.. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై గుర్తింపు పొందిన న్యాయనిపుణుడు ఫాలీ నారీమన్. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. బ్రిటిష్ బర్మా రంగూన్లో 1929లో జన్మించారాయన. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్ ఎగ్జామ్స్ వైపు అడుగులేసిన ఆయన.. చివరకు ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తి వైపు అడుగులేశారు. End of an era—#falinariman passes away, a living legend who wl forever be in hearts &minds of those in law &public life. Above all his diverse achievements, he stuck to his principles unwaveringly &called a spade a spade, a quality shared by his brilliant son #Rohinton. — Abhishek Singhvi (@DrAMSinghvi) February 21, 2024 భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ నారిమన్ కీలక పాత్ర పోషించారు. అలాగే.. 1972 నుంచి మూడేళ్లపాటు అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ పని చేశారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఇక.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ తరఫున వాదించారు నారిమన్. అయితే అది పొరపాటని తర్వాత ఇంటర్వ్యూలలో ఆయన పేర్కొన్నారు. గోలఖ్‌నాథ్, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్ లాంటి కేసుల్ని ఆయన వాదించారు. సుప్రీం కోర్టు ఏవోఆర్ కేసును సైతం (ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి..) ఈయనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. నారీమన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ కన్నుమూత పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారీమన్ కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సంతాపం తెలిపినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఇది ఘోరం, దారుణం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన సెక్షన్ ప్రకారం.. కేసులు నమోదు కావడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నెటిజన్ల స్వేచ్ఛను హరించేదిగా ఉన్న ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఏను అప్పట్లో కోర్టు తప్పుబట్టింది. అలాంటి సెక్షన్ మీదే ఇప్పుడు వెయ్యి దాకా కేసులు నమోదు కావడం పట్ల కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే మార్చి 10, 2021నాటికి ఈ సెక్షన్‌కు సంబంధించి 745 కేసులు నమోదు అయ్యాయని, కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి నిందితులు శిక్షలు అనుభవిస్తున్నారని ఓ ఎన్జీవో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ సెక్షన్‌కు సంబంధించి దేశంలోని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి సూచించింది కూడా. ‘‘ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. అది దాదాపుగా రద్దు చేయబడిన సెక్షన్. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తాం’’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక జస్టిస్ నారీమణ్ ఈ వ్యవహారాన్ని ‘ఘోరం.. దారుణం’ అని పేర్కొన్నారు. పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో ఈ మేరకు పిటిషన్ దాఖలుచేయగా.. పరిశీలించిన ధర్మాసనం తప్పకుండా నోటీసులు జారీ చేస్తాం అని పేర్కొంది. సెక్షన్.. దుమారం సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను నియంత్రించే పేరుతో 2008లో చట్టాన్ని సవరించి 66ఎ సెక్షన్ చేర్చారు. ఐటీయాక్ట్‌లోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు. ఈ సవరణ చట్టానికి 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు మనోభావాల్ని, అభిప్రాయాల్ని సాధారణంగా వ్యక్తం చేసినా అరెస్ట్‌లు చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే 2012లో ముంబైలో ఇద్దరు యువతుల అరెస్ట్ ఈ అంశంపై విస్తృత చర్చకు దారితీసింది. 2012లో శివసేన చీఫ్ బాల్‌థాక్రే మరణం తర్వాత ముంబై బంద్ పాటించడాన్ని తప్పుబడుతూ.. పాల్గఢ్కు చెందిన ఓ అమ్మాయి పోస్ట్ చేయగా, దానికి మరో యువతి లైక్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు 66 (ఎ) సెక్షన్ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘల్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మార్చి 24, 2015 నాడు పౌరుల భావ ప్రకటనను నిరోధించే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 A, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. -
సుప్రీం కొలీజియం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది. అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. -
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్‌ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ఈ రోస్టర్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ కొత్త రోస్టర్ ప్రకారం.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను, లెటర్ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మరో ఏడుగురు న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆరు నుంచి ఏడు ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేసులను సీజేఐ విచారిస్తారు. ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యూడీషియల్ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్ సంబంధిత కేసులను జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుంది. -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
వారు జస్టిస్ బాబ్డేను కలవలేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డేను జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు కలిశారంటూ వచ్చిన పత్రికా కథనాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఆ కథనం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణపై జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని అంతర్గత కమిటీ ఏకపక్షంగా దర్యాప్తు సాగించడం సరికాదని, విచారణలో సహకరించేందుకు అమికస్ క్యూరీగా లాయర్‌ను నియమించుకోవాలని జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు సూచించినట్లు ఓ పత్రిక పేర్కొంది. ఈ కథనం అబద్ధమంటూ ఆదివారం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జస్టిస్ ఎస్ఏ బాబ్డేను జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మే 3వ తేదీ సాయంత్రం కలిసినట్లు ఆ ప్రముఖ వార్తా పత్రికలో కథనం రావడం దురదృష్టకరం. అది పూర్తిగా అబద్ధం. అంతర్గత విచారణ కమిటీ నిర్దేశించిన పనిని మరే ఇతర జడ్జీల సాయం అవసరం లేకుండానే చేసుకుపోతుంది. ఈ విషయంలో ఆ కమిటీకి సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా ఎలాంటి సలహా ఇచ్చినా అది దాని విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది’అని ఆయన స్పష్టం చేశారు. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఈ కమిటీ విచారణకు మూడు పర్యాయాలు హాజరైన ఫిర్యాదుదారు, మాజీ ఉద్యోగిని వివిధ కారణాలు చూపుతూ విచారణ ప్రక్రియకు ఇకపై హాజరు కాబోనని ఇటీవల వెల్లడించారు. -
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఇది సమయం కాదని సుప్రీం కోర్టు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు సోమయాజులు చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి నేత రఘు రామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణను ఏర్పాటు చేయాలంటూ కేంద్రం నిర్ణయించటం, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిల్స్ దాఖలు చేశారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు రావాలని కోర్టు సూచించిందని సోమయాజులు చెప్పారు. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు విచారిస్తామని కోర్టు చెప్పినట్లు తెలిపారు. ఏ ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నదానిపై సుప్రీంకోర్టు తమ వాదన విన్నట్లు చెప్పారు. కేసు డిస్మిస్ చేయలేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు తెలిపారు. గతంలో కృష్ణయ్య కేసు కొట్టివేయడం కూడా తప్పని కోర్టు పేర్కొందని సోమయాజులు చెప్పారు. కోర్టు చెప్పిన విధంగా సరైన సమయంలో తాము మళ్లీ వెళ్తామని రఘురామకృష్ణంరాజు చెప్పారు. బిల్లు అసెంబ్లీ, పార్లమెంట్‌కు వచ్చినప్పుడు పిటిషన్ వేస్తామన్నారు. రాష్ట్రపతి ముందుకు బిల్లు వెళ్లినప్పుడు సుప్రీం కోర్టు తలుపు తడతామని చెప్పారు. అంతకు ముందు విభజనను వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. విభజనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సంప్రదించలేదని, విభజనకు సరైన పద్ధతులను పాటించలేదని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా విభజన చేస్తున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం పంపకుండా విభజనపై కేబినెట్ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజన ప్రక్రియను ముందుగా అసెంబ్లీ నుంచే ప్రారంభించాలని, కానీ అలా జరగలేదని తెలిపారు. రాష్ట్రపతి సిఫార్సుతోనే ముసాయిదా బిల్లు తయారుకావాలని, ముసాయిదా తయారీకి అసెంబ్లీ తీర్మానం అవసరమైనా, దీనికి భిన్నంగా విభజన ప్రక్రియ జరుగుతోందని నారిమన్ వాదించారు. గతంలో కూడా తాము పిటిషన్లను కొట్టివేయలేదని, విచారణకు ఇది తగిన సమయం కాదని మాత్రమే చెప్పామని న్యాయమూర్తులు అన్నారు. కానీ, అసలు కేబినెట్ నిర్ణయాన్నే తాము తప్పుబడుతున్నామని, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీఏ నిర్ణయం తీసుకుందని రోహింగ్టన్ నారిమన్ వాదించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి రెండున్నరేళ్లయిందని, తన ఆరో సిఫార్సును అమలుచేయాలని చెప్పినా.. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని నారిమన్ అన్నారు. 371 (డి) ఉన్నప్పుడు విభజన ప్రక్రియ చేపట్టడం అసాధ్యమని, ఎన్నికలను దృష్టిపెట్టుకునే కేంద్రం ఇలా చేస్తోందని మరో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు.