అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన సెక్షన్ ప్రకారం.. కేసులు నమోదు కావడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నెటిజన్ల స్వేచ్ఛను హరించేదిగా ఉన్న ఐటీ యాక్ట్ సెక్షన్ 66 ఏను అప్పట్లో కోర్టు తప్పుబట్టింది. అలాంటి సెక్షన్ మీదే ఇప్పుడు వెయ్యి దాకా కేసులు నమోదు కావడం పట్ల కోర్టు దిగ్‌భ్రాంతి వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే మార్చి 10, 2021నాటికి ఈ సెక్షన్‌కు సంబంధించి 745 కేసులు నమోదు అయ్యాయని, కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి నిందితులు శిక్షలు అనుభవిస్తున్నారని ఓ ఎన్జీవో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ సెక్షన్‌కు సంబంధించి దేశంలోని పోలీస్ స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రానికి సూచించింది కూడా.
‘‘ఇది దిగ్‌భ్రాంతి కలిగించే అంశం. అది దాదాపుగా రద్దు చేయబడిన సెక్షన్. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తాం’’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక జస్టిస్ నారీమణ్ ఈ వ్యవహారాన్ని ‘ఘోరం.. దారుణం’ అని పేర్కొన్నారు. పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో ఈ మేరకు పిటిషన్ దాఖలుచేయగా.. పరిశీలించిన ధర్మాసనం తప్పకుండా నోటీసులు జారీ చేస్తాం అని పేర్కొంది.
సెక్షన్.. దుమారం
సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను నియంత్రించే పేరుతో 2008లో చట్టాన్ని సవరించి 66ఎ సెక్షన్ చేర్చారు. ఐటీయాక్ట్‌లోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు. ఈ సవరణ చట్టానికి 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు మనోభావాల్ని, అభిప్రాయాల్ని సాధారణంగా వ్యక్తం చేసినా అరెస్ట్‌లు చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే 2012లో ముంబైలో ఇద్దరు యువతుల అరెస్ట్ ఈ అంశంపై విస్తృత చర్చకు దారితీసింది.
2012లో శివసేన చీఫ్ బాల్‌థాక్రే మరణం తర్వాత ముంబై బంద్ పాటించడాన్ని తప్పుబడుతూ.. పాల్‌గఢ్‌కు చెందిన ఓ అమ్మాయి పోస్ట్ చేయగా, దానికి మరో యువతి లైక్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు 66 (ఎ) సెక్షన్ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘల్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మార్చి 24, 2015 నాడు పౌరుల భావ ప్రకటనను నిరోధించే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 A, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment