తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం | This is not appropriate time to trial Division Petition: Supreme Court | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం

Published Mon, Nov 18 2013 3:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం - Sakshi

తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు విచారణ: సుప్రీం

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ఇది సమయం కాదని సుప్రీం కోర్టు  చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు సోమయాజులు చెప్పారు.  రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి  నేత రఘు రామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణను ఏర్పాటు చేయాలంటూ కేంద్రం నిర్ణయించటం, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిల్స్ దాఖలు చేశారు.

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి  వచ్చినప్పుడు రావాలని కోర్టు సూచించిందని సోమయాజులు చెప్పారు. బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు విచారిస్తామని కోర్టు చెప్పినట్లు తెలిపారు. ఏ ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నదానిపై సుప్రీంకోర్టు తమ వాదన విన్నట్లు చెప్పారు. కేసు డిస్మిస్‌ చేయలేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు తెలిపారు.  గతంలో కృష్ణయ్య కేసు కొట్టివేయడం కూడా తప్పని  కోర్టు పేర్కొందని సోమయాజులు చెప్పారు.

కోర్టు చెప్పిన విధంగా సరైన సమయంలో తాము మళ్లీ వెళ్తామని రఘురామకృష్ణంరాజు చెప్పారు. బిల్లు అసెంబ్లీ, పార్లమెంట్‌కు వచ్చినప్పుడు పిటిషన్‌ వేస్తామన్నారు. రాష్ట్రపతి ముందుకు బిల్లు వెళ్లినప్పుడు సుప్రీం కోర్టు తలుపు తడతామని  చెప్పారు.

 అంతకు ముందు విభజనను వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. విభజనపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీని సంప్రదించలేదని, విభజనకు సరైన పద్ధతులను పాటించలేదని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా విభజన చేస్తున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం పంపకుండా విభజనపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజన ప్రక్రియను ముందుగా అసెంబ్లీ నుంచే ప్రారంభించాలని, కానీ అలా జరగలేదని తెలిపారు. రాష్ట్రపతి సిఫార్సుతోనే ముసాయిదా బిల్లు తయారుకావాలని, ముసాయిదా తయారీకి అసెంబ్లీ తీర్మానం అవసరమైనా, దీనికి భిన్నంగా విభజన ప్రక్రియ జరుగుతోందని నారిమన్‌ వాదించారు.

గతంలో కూడా తాము పిటిషన్లను కొట్టివేయలేదని,  విచారణకు ఇది తగిన సమయం కాదని మాత్రమే చెప్పామని న్యాయమూర్తులు అన్నారు. కానీ, అసలు కేబినెట్‌ నిర్ణయాన్నే తాము తప్పుబడుతున్నామని, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీఏ నిర్ణయం తీసుకుందని రోహింగ్టన్‌ నారిమన్‌ వాదించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి రెండున్నరేళ్లయిందని, తన ఆరో సిఫార్సును అమలుచేయాలని చెప్పినా.. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని నారిమన్‌ అన్నారు. 371 (డి) ఉన్నప్పుడు విభజన ప్రక్రియ చేపట్టడం అసాధ్యమని, ఎన్నికలను దృష్టిపెట్టుకునే కేంద్రం ఇలా చేస్తోందని మరో సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement