సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ శామ్ నారీమన్ (95) మంగళవారం అర్ధరాత్రి మృతిచెందారు. న్యాయ నిపుణుడుగా పేరుగాంచిన నారీమన్ 1929లో పార్సీ దంపతులైన బైరాంజీ నారీమన్, బానో నారీమన్‌లకు మయన్మార్‌లో జని్మంచారు. బాంబేలో ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించిన నారీమన్ 1971లో సుప్రీంకోర్టులో సీనియర్ హోదా పొందారు.
1972 మే నుంచి 1972 జూన్ 25 వరకూ సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ పనిచేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన పదవికి మరుసటి రోజే రాజీనామా చేశారు. పలు కీలక కేసులు వాదించిన నారీమన్‌ను కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1999లో రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు.
1991లో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 1994లో ఇంటర్నేషల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. 1998లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌లో సభ్యుడయ్యారు. 1995 నుంచి 1997 వరకూ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ కార్యనిర్వాహక కమిటీకి ౖచైర్మన్‌గా పనిచేశారు. ఫాలీ నారీమన్ కుమారుడు రోహింగ్టన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు.
నిర్ణయమే శాసనం
ఫాలీ నారీమన్ చివరి వరకూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారుగానీ లాయర్‌గా రాజీ పడలేదు. ఎమర్జెన్సీ సమయంలో కేంద్రాన్ని కాదని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)గా రాజీనామా చేసిన ఆయన నర్మద రిహాబిలిటేషన్ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఉంటూ క్రిస్టియన్లపై దాడులు నిరసిస్తూ ఆ కేసు నుంచి తప్పుకొన్నారు. తొలుత తాను మానవతావాదినని తర్వాతే న్యాయవాదిని అని ఆ సమయంలో అభిప్రాయపడ్డారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఎదిరించినందకు నారీమన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఢిల్లీలో ఎవరూ ముందుకురాకపోవడంతో స్థిరమైన నివాసం కోసం ఎంతో కష్టపడ్డారు. ‘వెన్నెముక లేనితనం కంటే నిరాశ్రయమే మేలు’ అని నారీమన్ వ్యాఖ్యానించారు. డిసెంబరు 2009లో జస్టిస్ ప్రసాద్, జస్టిస్ దినకరన్‌ల నియామకాల సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుల సమీక్ష, బహిరంగ చర్చ అనంతరమే న్యాయ నియామకాలకు సిఫార్సులు చేపట్టాలని భావిస్తున్నట్లు జ్యూడీíÙయల్ అకౌంటబిలిటీపై కమిటీ పేర్కొంది. ఈ ప్రకటనపై రాం జఠ్మలానీ, శాంతి భూషణ్, అనిల్ దివాన్, కామిని జైశ్వాల్, ప్రశాంత్ భూషణ్‌లతోపాటు నారీమన్ సంతకం చేశారు.
కీలక కేసులు వాదన
తన సుదీర్ఘ కెరియర్‌లో నారీమన్ అనేక కీలక కేసులు వాదించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో ఆమె బెయిలు పొందడంలో కీలకవాదనలు చేశారు (అనంతరం ఆ బెయిలు రద్దయింది). భోపాల్ గ్యాస్ ఘటనలో యూనియన్ కార్బైడ్ తరఫున వాదించిన నారీమన్ తన తప్పును తదనంతరం అంగీకరించడానికి వెనకాడలేదు. 47 కోట్ల డాలర్ల పరిహారం కోర్టు వెలుపల బాధితులకు అందించేలా సంస్థతో ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఏఓఆర్ అసోసియేషన్ కేసులో తన వాదనా పటిమ అనంతరమే ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు చేపట్టడం ప్రారంభించింది. అయితే తదనంతరం తన ఆత్మకథ ‘బిఫోర్ మెమరీ ఫేడ్స్’లో మాత్రం న్యాయమూర్తుల నియామక విషయంలో ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు క్లోజ్ సర్క్యూట్ కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ సంప్రదించాలని అభిప్రాయపడ్డారు.
‘‘ఫాలీ నారీమన్ అత్యుత్తుమ న్యాయవాదులు, మేధావుల్లో ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం జరిగేలా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మృతి నన్నెంతో బాధించింది. నారీమన్ ఆత్మకు శాంతి కలగాలి’’
– ప్రధాని నరేంద్ర మోదీ
‘‘నారీమన్ మరణానికి సంతాపం తెలుపుతున్నా. చట్టంలో గొప్ప దిగ్గజమైన నారీమన్ మృతి చాలా విచారకరం’’
సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
Comments
Please login to add a commentAdd a comment