సీజేఐ గొగోయ్‌కు క్లీన్‌చిట్‌ | CJI Ranjan Gogoi gets clean chit inl harassment case, | Sakshi
Sakshi News home page

సీజేఐ గొగోయ్‌కు క్లీన్‌చిట్‌

Published Tue, May 7 2019 4:40 AM | Last Updated on Tue, May 7 2019 11:06 AM

CJI Ranjan Gogoi gets clean chit inl harassment case, - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయన క్లీన్‌చిట్‌ పొందారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ స్పష్టం చేసింది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించడం తెల్సిందే. దీంతో జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు.

14 రోజుల పాటు విచారణ జరిపిన ఈ కమిటీ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సోమవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సీజేఐపై మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు లేవని కమిటీ గుర్తించింది’ అని తెలిపారు. కమిటీ నివేదికను ఆదివారమే సమర్పించింది. కోర్టులో సీజేఐ తర్వాత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ బాబ్డేకు నివేదికను అందజేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్‌ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు.

తీవ్ర అన్యాయం జరిగింది..
సీజేఐకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నివేదిక తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తాను భయపడుతున్నట్లే జరిగిందని, ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన న్యాయవాదితో చర్చించి తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దానిపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. సీజేఐకు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ప్రముఖ న్యాయకోవిదుడు సోలి సొరబ్జీ స్వాగతించారు. కమిటీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగానే విచారణ జరిపిందని పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడానికి కమిటీ చాలా తొందరపడిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు.

సీజేఐపై కేసులో పూర్వాపరాలు
► ఏప్రిల్‌ 19: సీజేఐ వేధించారంటూ 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖలు పంపిన మాజీ ఉద్యోగిని.  
► ఏప్రిల్‌ 22: లైంగిక వేధింపుల బూటకపు కేసులో సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని న్యాయవాది ఉత్సవ్‌ సింగ్‌ బెయిన్స్‌ ఆరోపణ.
► ఏప్రిల్‌ 23: మాజీ ఉద్యోగిని ఆరోపణలపై విచారణ జరిపేందుకు జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ రమణ, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల అంతర్గత త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటు.  జస్టిస్‌ రమణ ఆ కమిటీలో ఉండటం, ఒక్కరే మహిళా జడ్జి ఉండటంపై మాజీ ఉద్యోగిని అభ్యంతరం. ఏప్రిల్‌ 25న విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ రమణ. దీంతో కమిటీలోకి మరో మహిళా జడ్జి జస్టిస్‌ ఇందూ
► ఏప్రిల్‌25: సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోం దన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ సభ్యుడిగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. లైంగిక వేధింపులపై విచారణ కాకుండా, కుట్ర కోణంపై జస్టిస్‌ పట్నాయక్‌ విచారణ జరుపుతారని వెల్లడి.
► ఏప్రిల్‌ 26: త్రిసభ్య కమిటీ ఎదుట రహస్య విచారణకు తొలిసారి హాజరైన మాజీ ఉద్యోగిని. మొత్తంగా మూడుసార్లు విచారణకు హాజరు. అనంతరం ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ విచారణ నుంచి నిష్క్రమణ. n మే 6: సీజేఐపై ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పిన అంతర్గత త్రిసభ్య కమిటీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement