three member committe
-
గుట్టు వీడుతుందా?
-
కిడ్నీ రాకెట్ కేస్‌లో కస్టడీలోకి జేకే వర్మ
-
త్రిసభ్య కమిటీ చేతిలో ప్రాథమిక ఆధారాలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండు రోజుల నుంచి విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రిలో త్రిసభ్య కమిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కమిటీ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. దాంతో ఈ కేసులో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్ని అదుపులోకి తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు పోలీసు బృందాలు ఈ కేసు విచారణలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : కిడ్నీ రాకెట్ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం -
సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయన క్లీన్చిట్ పొందారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ స్పష్టం చేసింది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించడం తెల్సిందే. దీంతో జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. 14 రోజుల పాటు విచారణ జరిపిన ఈ కమిటీ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘సీజేఐపై మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు లేవని కమిటీ గుర్తించింది’ అని తెలిపారు. కమిటీ నివేదికను ఆదివారమే సమర్పించింది. కోర్టులో సీజేఐ తర్వాత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ బాబ్డేకు నివేదికను అందజేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు. తీవ్ర అన్యాయం జరిగింది.. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడంపై ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నివేదిక తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తాను భయపడుతున్నట్లే జరిగిందని, ఓ భారతీయ మహిళగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన న్యాయవాదితో చర్చించి తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఈ ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దానిపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. సీజేఐకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ న్యాయకోవిదుడు సోలి సొరబ్జీ స్వాగతించారు. కమిటీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగానే విచారణ జరిపిందని పేర్కొన్నారు. సీజేఐ గొగోయ్‌కు క్లీన్చిట్ ఇవ్వడానికి కమిటీ చాలా తొందరపడిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం ట్వీట్ చేశారు. సీజేఐపై కేసులో పూర్వాపరాలు ► ఏప్రిల్ 19: సీజేఐ వేధించారంటూ 22 మంది సుప్రీం జడ్జీలకు లేఖలు పంపిన మాజీ ఉద్యోగిని. ► ఏప్రిల్ 22: లైంగిక వేధింపుల బూటకపు కేసులో సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని న్యాయవాది ఉత్సవ్ సింగ్ బెయిన్స్ ఆరోపణ. ► ఏప్రిల్ 23: మాజీ ఉద్యోగిని ఆరోపణలపై విచారణ జరిపేందుకు జస్టిస్ బాబ్డే, జస్టిస్ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీల అంతర్గత త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటు. జస్టిస్ రమణ ఆ కమిటీలో ఉండటం, ఒక్కరే మహిళా జడ్జి ఉండటంపై మాజీ ఉద్యోగిని అభ్యంతరం. ఏప్రిల్ 25న విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ. దీంతో కమిటీలోకి మరో మహిళా జడ్జి జస్టిస్ ఇందూ ► ఏప్రిల్25: సీజేఐని ఇరికించేందుకు కుట్ర జరుగుతోం దన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ సభ్యుడిగా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. లైంగిక వేధింపులపై విచారణ కాకుండా, కుట్ర కోణంపై జస్టిస్ పట్నాయక్ విచారణ జరుపుతారని వెల్లడి. ► ఏప్రిల్ 26: త్రిసభ్య కమిటీ ఎదుట రహస్య విచారణకు తొలిసారి హాజరైన మాజీ ఉద్యోగిని. మొత్తంగా మూడుసార్లు విచారణకు హాజరు. అనంతరం ఈ కమిటీతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ విచారణ నుంచి నిష్క్రమణ. n మే 6: సీజేఐపై ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పిన అంతర్గత త్రిసభ్య కమిటీ. -
సీజేఐపై కుట్ర.. ప్రత్యేక విచారణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. విచారణ సమయంలో ఆయనకు సహకరించాలంటూ సీబీఐ, ఐబీ డైరెక్టర్లతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతరుల సాయం తీసుకోవచ్చంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ తన దర్యాప్తు నివేదికను సీల్డు కవర్లో అందజేయాలని కోరింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ వేసిన అఫిడవిట్‌ను గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాల ప్రత్యేక ధర్మాసనం విచారించి, పై ఉత్తర్వులను వెలువరించింది. అఫిడవిట్లో పేర్కొన్న వివిధ అంశాలపై కమిటీ కోరినప్పుడు వివరణ ఇవ్వాలని లాయర్‌ను ఆదేశించింది. త్రిసభ్య కమిటీపై అభ్యంతరాలు.. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని అంతర్గత విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీజేఐకు జస్టిస్ రమణ సన్నిహిత మిత్రుడని, నిత్యం సీజేఐ నివాసానికి ఆయన వెళ్తుంటారని, కమిటీలో ఆయన ఉండటం వల్ల తాను సమర్పించిన ఆధారాలు, అఫిడివిట్‌పై సరైన విచారణ జరుగుతుందని భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కమిటీలో మహిళా జడ్జి ఇందిరా బెనర్జీ ఒక్కరు మాత్రమే ఉండటంపైనా ఆమె జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖలో అభ్యంతరం లేవనెత్తారు. కాగా, సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన సీజేఐకు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రాను నియమిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఫిర్యాదుదారు అభ్యంతరం తెలిపిన కారణంగా జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగలేదని సమాచారం. -
సయోధ్యకు మధ్యవర్తిత్వం
రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం విషయంలో మధ్యవర్తిత్వం నెరపి, ‘శాశ్వత పరిష్కా రాన్ని’ సాధించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమిస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్ర వారం వెలువరించిన ఆదేశాలు ఏడు దశాబ్దాలుగా సాగుతున్న ఆ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. సంఘర్షణ కంటే సామరస్యత ఎప్పుడూ మంచిదే గనుక ఇది స్వాగతించదగ్గదే. మధ్య వర్తిత్వం కోసం నియమించిన బృందంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా, మధ్యవర్తిత్వం కేసుల్లో నిపు ణుడిగా పేరున్న సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు. వీరు అవసరమనుకుంటే మరికొం దరిని సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఈ బృందం 8 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. నాలుగు వారాల్లోగా తాత్కాలిక నివేదికను అందజేయాలని ధర్మాసనం కోరింది. అయితే సంబంధిత పక్షాలతో జరిపే సంప్రదింపుల వివరాలను వెల్లడించరాదని సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఈ వివాదం విషయంలో ఇటీవల తీవ్ర స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు, సంఘ్ పరివార్‌కు చెందిన ఇతర నేతలు ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం ప్రారంభించాల్సిందేనని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు దీన్ని ఇప్పటికప్పుడు తేల్చనిపక్షంలో ఆర్డినెన్స్ జారీకి కూడా వెనుకాడరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఒక దశలో పార్లమెంటు సమావేశాలు ముగిశాక ఆర్డి నెన్స్ వెలువడుతుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ఆలోచన చేసి, అందుకోసం ఒక బృందాన్ని నియమిం చడం ఇదే మొదటిసారి. కానీఈ తరహా ప్రయత్నాలు లోగడ జరగకపోలేదు. 1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, 2003లో ప్రధానిగా వాజపేయి మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు. పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పని చేసిన ఉన్నతాధికారి స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్, ఆయనతోపాటు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కా రానికి వారు చేరువగా వచ్చారన్న కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ చివరికది మూలన పడింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వా సాలతో ముడిపడి ఉన్న సమస్య. సమస్య ఆస్తుల పంపకానికి సంబంధించిందో, సరిహద్దు వివా దానికి సంబంధించిందో అయినప్పుడు మధ్యవర్తిత్వంపెద్ద కష్టం కాదు. అక్కడ ఇచ్చిపుచ్చుకోవ డాలుంటాయి. వివాదం సాగదీసేకొద్దీ నష్టపోతామన్న అవగాహన ఉంటుంది. కానీ ఇది అలాం టిది కాదు. 1949లో మహంత్ రామచంద్ర దాస్ పరమహంస రామమందిరం ఉన్న ప్రాంతంలో పూజ, దర్శనం కోసం అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడినుంచి రాముడి విగ్రహాన్ని తొలగించాలని హషీమ్ అన్సారీ అనే వ్యక్తి కూడా కోర్టుకెక్కారు. కానీ అది ఈ స్థాయిలో దేశమంతా తెలిసింది 80వ దశకంలో సంఘ్ పరివార్ సంస్థలు రామజన్మభూమి విముక్తి పేరిట సాగించిన ఉద్యమం, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ చేపట్టిన రథయాత్రల వల్లనే. 1992 నాటి బాబ్రీమసీదు కూల్చివేత దేశవ్యాప్తంగా మతకల్లోలాలకు దారితీసి 2,000మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయాలపాలయ్యారు. ఆపై జరిగిన పలు హింసాత్మక ఉదంతా లకూ, ఉగ్రవాద ఘటనలకూ బాబ్రీ మసీదు కూల్చివేతలోనే బీజాలున్నాయి. అయితే ఇప్పుడు 90వ దశకంనాటి ఉద్రిక్తతలు లేవు. తమ తమ విశ్వాసాల మాటెలా ఉన్నా వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది గనుక అదిచ్చే తీర్పు కోసం ఎదురు చూడాలన్న దృక్పథం ఇరు వర్గాల్లోనూ ఏర్ప డింది. విశ్వాసానికి సంబంధించిన వివాదంలో న్యాయస్థానాలు చెప్పేదేమిటని హిందుత్వ సంస్థ లకు చెందినవారు కొందరు వ్యాఖ్యానించినా మొత్తం మీద ఆగ్రహా వేశాలు కట్టుదాటలేదు. మధ్యవర్తిత్వం ద్వారా వైరి వర్గాలను ఒప్పించి సామరస్యపూర్వక పరిష్కారం సాధించాలను కోవడం ఆదర్శవంతమైనదే. ప్రజాస్వామ్యబద్ధమైనదే. కానీ ఈ వివాదం సాధారణమైనది కాదు. అత్యంత జటిలమైనది. భావోద్వేగాలతో, విశ్వాసాలతో ముడిపడి ఉండే ఒక వివాదంలో మధ్యవ ర్తిత్వం ద్వారా పరిష్కారం కనుగొనడం సాధ్యమేనా? అది సాధ్యం కావాలంటే ఇరుపక్షాలూ ఇచ్చి పుచ్చుకునే వైఖరిని ప్రదర్శించాలి. ఎవరి వరకో ఎందుకు... ప్రస్తుత బృందంలోని శ్రీశ్రీ రవిశంకరే అలాంటి వైఖరి ఈ వివాదంలో సాధ్యపడదని తేల్చిచెప్పారు. వివాదస్పద ఎకరం స్థలాన్ని హిందు వులకు బహుమతిగా ఇచ్చి దానికి బదులు సమీపంలో మరోచోట 5 ఎకరాలు తీసుకుని మసీదు నిర్మాణం చేపట్టడమే ఉత్తమ పరిష్కారమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డుకు నిరుడు రాసిన లేఖలో ఆయన ప్రతిపాదించారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నా తీవ్రవాదం పెరుగుతుందని, అంతిమంగా అది అంతర్యుద్ధానికి దారి తీస్తుం దని హెచ్చరించారు. కనుకనే శ్రీశ్రీ రవిశంకర్‌ను బృందంలో చేర్చడంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు బృంద సభ్యుడుగా ఇరు వర్గాలకూ ఆయనేం ప్రతిపాదిస్తారన్నది ఆసక్తికరమైనదే. ఈ మొత్తం ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే సాగుతుంది కనుక ఒవైసీలాంటివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే ఈ వివాదం తాత్కా లికంగా సద్దుమణిగింది. మధ్యవర్తిత్వ బృందం తుది నివేదిక ఇచ్చేనాటికి ఎన్నికలు కూడా పూర్తవు తాయి. కానీ ఆ తర్వాతైనా పరిష్కారం సాధ్యమవుతుందా? అనుమానమే. ప్రజలెన్నుకునే ప్రభు త్వాలే చొరవ తీసుకుని సమాజంలో తలెత్తే వివాదాలకు అన్ని వర్గాలతో చర్చించి ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం సరైంది. కానీ అందుకు చిత్తశుద్ధి, దృఢమైన సంకల్పం ఉండాలి. స్వీయ ప్రయోజనాలను పక్కనబెట్టగలిగే విశాల దృక్పథం ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా? -
అర్హులందరికీ రీయింబర్స్మెంట్-కడియం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అర్షులైన వారందరికీ ఫీజు రియింబర్స్ పథకాన్ని వర్తింపజేస్తామని డిప్యూటీ సీఎం (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉద్దేశించిన ముగ్గురు మంత్రుల కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ...ఈ నెల 11 న మరోసారి మంత్రుల బృందం భేటీ అవుతుందన్నారు. స్కాలర్ షిప్ ల మంజూరు కూడా పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో వసతుల పెంపుపై సంబంధిత అధికారులను నివేదిక కోరినట్టు ఆయన చెప్పారు. -
నేడు ‘ఫీజు’పై త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉద్దేశించిన ముగ్గురు మంత్రుల కమిటీ భేటీ బుధవారం సచివాలయంలో జరగనుంది. ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సభ్యులుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఏయే అంశాల ప్రాతిపదికన విద్యార్థులకు ఫీజులు, బకాయిల చెల్లింపు చేయాలి, ఇందుకు ఏయే మార్గదర్శకాలను పెట్టాలి అనే అంశంపై త్రిసభ్య కమిటీ సచివాలయంలో విద్యాశాఖ, వివిధ సంక్షేమశాఖల అధికారులతో సమావేశం కానుంది. విద్యార్థుల కనీస విద్యార్హతలు, స్థానికత నిర్ధారణ, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపునకు కొత్తగా ఏవైనా మార్గదర్శకాలు చేర్చాలా అన్న దానిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ అంశంపై విద్యా, సంక్షేమశాఖ అధికారులతో చర్చల సందర్భంగా వచ్చే సూచనలు, సలహాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు సమర్పించనుంది. నెల రోజుల్లో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. సంక్షేమ మంత్రే లేకపోతే ఎలా...! ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రుల్లో ఎవరూ సభ్యులుగా లేకపోవడం చర్చనీయాంశమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా సంక్షేమ శాఖకు సంబంధించినది కాగా ఈ శాఖ మంత్రులకే ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదంటున్నారు. పథకంతో ఏమాత్రం సంబంధం లేని విద్యాశాఖ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో విద్యుత్, వైద్యశాఖల మంత్రులను సభ్యులుగా వేస్తే దాని వల్ల ఒరిగేదేమీ ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి, సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థుల గురించి వీరికి ఏ మేరకు అవగాహన ఉంటుంది, ఆయా సమస్యలు,అంశాలపై తగిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోగలుగుతారనే ప్రశ్నలు వస్తున్నాయి.