
న్యూఢిల్లీ: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్‌సీఏఓఆర్‌ఏ) పేర్కొంది. సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనం ఎంపిక చేసిన కమిటీ ఆరోపణలపై దర్యాప్తు జరపాలంది.
భారీ కుట్ర ఉంది...
నిష్పాక్షిక దర్యాప్తుతో మాత్రమే సీజేఐపె వచ్చిన ఆరోపణలపై నిజాలు వెలుగుచూస్తాయని, న్యాయవ్యవస్థ స్వతంత్రత బలోపేతమవుతుందని సీనియర్ న్యాయవాది, ప్రముఖ న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. మాజీ ఉద్యోగిని ఒకరు సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయస్థానం పూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకునేదాకా సీజేఐ విధులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
సీజేఐ రాజీనామాకు కుట్ర
సీజేఐతో రాజీనామా చేయించేందుకే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారంటూ సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ సింగ్ బైన్స్ పేర్కొన్నారు. ఓ మాజీ మహిళా ఉద్యోగి తరఫున అజయ్ అనే వ్యక్తి తన వద్దకు వచ్చి సీజేఐకు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయిస్తే రూ.కోటిన్నర ఇస్తానంటూ ఆశ చూపాడని బైన్స్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.