న్యూఢిల్లీ: దేశంలోని ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.హెచ్.పాటిల్‌ను, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీకే గుప్తాను నియమించాలని సూచించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం.. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను, జస్టిస్ ఏఎస్ బోపన్నను గువాహటి హైకోర్టు సీజేగా, జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్‌ను సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది.
బాంబే హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ పాటిల్ పదవీకాలం మరో 7 నెలల్లో ముగియనున్నందున.. ఆయనకు సొంతరాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. అలాగే మద్రాస్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా ఉన్న జస్టిస్ ఆర్‌ఎంటీ టికా రామన్, జస్టిస్ ఎన్.సతీశ్ కుమార్, జస్టిస్ ఎన్.శేషసాయిలకు శాశ్వత జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే కర్ణాటక హైకోర్టులో ఏడుగురు అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని తీర్మానించింది. వీరితోపాటు ఇద్దరు న్యాయాధికారులు, ఇద్దరు లాయర్లను కేరళ హైకోర్టులో జడ్జీలుగా నియమించాలంది.
Comments
Please login to add a commentAdd a comment