ఒకటో ఎస్టేట్ దయతో మూడో ఎస్టేట్ నుంచి రెండో ఎస్టేట్‌కు ప్రమోట్ అయ్యారు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. ఈయనగారొక్కరే కాదు ఇదివరకు 44 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు పదవి దిగిపోయిన తరువాత సర్కారు ఇచ్చిన హోదాలు అందుకుని న్యాయదేవతను సమర్చించారు. రిటైర్ మెంట్ తరువాత పదవులకోసం ఉవ్విళ్లూరే విధంగా అనేక పదవులను లెజిస్లేచర్ సృష్టించింది.
లోక్‌పాల్, లోకాయుక్త, జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు, లాకమిషన్ ఆఫ్ ఇండియా వంటి అనేక పదవులను మాజీ న్యాయ మూర్తులకే ఇవ్వాలనే చట్టాలున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఇటీవలి కాలంలో రిటైరయిన నూరుమందిలో 70 మంది జడ్జీలు ఆ తరువాత అనేక పదవులు తీసుకున్నారని తేలింది. ఇటీవలే కేరళ గవర్నర్‌గా సకల అధికార సౌఖ్యాలు అనుభవించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం గుర్తుండే ఉంటారు. అంతకుముందు రంగనాథ్ మిశ్రా గారు సీజేఐ పదవి వదిలిన ఏడేళ్ల తరువాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి, గెలిపించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. 1984 సిక్కు వ్యతిరేక హింసాకాండలో కాంగ్రెస్ ప్రమేయం ఏదీ లేదని వారంతా సచ్చీలురని రంగనాథ్ మిశ్రా న్యాయవిచారణ కమిషన్ నివేదిక ఇచ్చింది. అంత మేలు చేసిన న్యాయమూర్తికి ఆలస్యంగానైనా ధన్యవాదాలు చెప్పుకున్నారు.
జస్టిస్ బహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జిగారు సుప్రీంకోర్టుకు రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేసి 1983లో కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు. ఆయన చేసిన మేలు కూడా ఇంతాఅంతా కాదు. ఆనాటి బిహార్ సీఎం జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో అబద్ధాలను వెతికి పట్టుకున్నారు. ఇటీవలే మరణించిన పద్మభూషణ్ అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయ కుడిగా ఉన్న 2012 కాలంలో న్యాయమూర్తుల పదవీ విరమణ తరువాత రెండేళ్ల దాకా ఏ పదవులను అంగీకరించకూడదనీ, వారికి ప్రభుత్వాలు ఏ పదవులూ ఇవ్వకూడదని వక్కాణించారు. చేసిన సేవలు రెండేళ్ల తరువాత గుర్తుపెట్టుకుని పదవులిచ్చే కృతజ్ఞత ఉంటుందా. ఎన్ని పనులు ఉంటాయి? మరిచిపోకముందే రుణం తీర్చుకోవడం ఉత్తమపురుషుల లక్షణం.
రంజన్ గొగోయ్ చాలా సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి. సీబీఐ అలోక్ వర్మ తొలగింపు కేసులో న్యాయంచెప్పారు. తరువాత సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ప్రధానితో పాటు కూర్చున్నారు. ఏదో తప్పనిపించి కమిటీ నుంచి తప్పుకున్నారు. రఫేల్ కుంభకోణంలో ప్రభుత్వం తప్పే చేయలేదని గొగోయ్ గారికి అని పించింది. ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో కార్పొరేట్ ల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేయడానికి వీలు కల్పించే పథకంలో ఆయనకు ఏ దోషమూ కనిపించలేదు. కశ్మీర్‌లో అక్రమ బందీల హెబియస్ కార్పస్ కేసులు వినకుండా ఉంటేనే మేలనుకున్నారు. అయోధ్య వివాదంపైన రాజ్యాంగం కూడా ఊహించని కోత్త కోణం గొగోయ్ గారికి కనిపించింది.
అయోధ్యలో రామాలయం వస్తుందా లేదా అన్నదే పాయింట్. మిగతా గోల ఎందుకంట. అస్సాంలో ఎన్నార్సీ తయారీలో సుప్రీంకోర్టు పర్యవేక్షణ చాలా ముఖ్యం. అందులో రంజన్ గొగోయ్ గారిది కీలకపాత్ర. ఎన్నార్సీని దేశం మొత్తానికి విస్తరించే ఊపునిచ్చిన పాత్ర. తనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళను డిసెంబర్ 2018లో ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసారు. తన కేసులో తానే తీర్పు చెప్పు కున్నంత స్థాయిలో తానే బెంచ్ పై ఉండడం. తానే జడ్జిలను ఎంపికచేయడం, తను నిర్దోషిగా బయటపడటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మామూలు విషయాలు. ఈయన గారు సీజేఐ పదవి వదిలి పెట్టిన కొన్నాళ్ళకు ఆ ఆరోపణలు చేసిన మహిళకు జనవరి 23, 2020 నాడు ఉద్యోగం మళ్లీ ఇచ్చారు. అయితే తప్పెవరిది అని తల బద్దలు కొట్టుకునే వారు చాలా మంది. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని భారీ ఎత్తున తగ్గించే చర్య ఈ నియామకం. ఎవరినైనా కొనేస్తాం అనే ధైర్యాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఎవ రైనా అమ్ముడుపోతారేమోననే అనుమానాన్ని కొందరు పెద్దలు కలిగిస్తున్నారు.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment